మామూళ్ల మత్తు!

ABN , First Publish Date - 2022-09-19T07:12:02+05:30 IST

నగరంలోని ట్రాఫిక్‌ పోలీసుల పనితీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మామూళ్ల మత్తు!
శంకరమఠం రోడ్డులో నిషేధిత సమయంలో ప్రవేశించిన కంటెయినర్‌

నిషేధిత వేళల్లో నగరంలోకి భారీ వాహనాలు

నిబంధన లకు విరుద్ధంగా రోడ్డుపైనే లోడింగ్‌, అన్‌లోడింగ్‌

ట్రాఫిక్‌ పోలీసుల చేతివాటమే కారణం

వాహన రాకపోలకు తీవ్ర ఆటంకం

ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం


(ఆంధ్రజ్యోతి, విశాఖపట్నం)

 నగరంలోని ట్రాఫిక్‌ పోలీసుల పనితీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిర్ణీత వేళల్లోనే నగరంలోకి ప్రవేశించాల్సిన భారీ, వాణిజ్య వాహనాలు ఇష్టారాజ్యంగా రాకపోకలు సాగిస్తుండడం, రద్దీవేళల్లో రోడ్డుపైనే నిలిపేసి లోడింగ్‌, అన్‌లోడింగ్‌ చేస్తుండడంతో ట్రాఫిక్‌ అస్తవ్యస్తమవుతోంది. ఈ నేపథ్యంలో పలు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. వాహన రాకపోకలను క్రమబద్దీకరించాల్సిన ట్రాఫిక్‌ పోలీసులు మామూళ్ల మత్తులో మునిగిపోయి, వాహన నియంత్రణను పట్టించుకోవడంలేదనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. 


నగరంలో వాహనాల రద్దీ ఎక్కువ కావడం, రోడ్లన్నీ ఇరుకుగా ఉండడంతో తరచూ ట్రాఫిక్‌జామ్‌లు సంభవిస్తుంటాయి. ఇటుక, సిమెంట్‌ తదితర సామగ్రితో వచ్చే వాహనాలు, గూడ్స్‌ వాహనాలు రద్దీ సమయంలో రోడ్లపైకి వస్తే మరింత దుర్భర పరిస్థితి ఎదురవుతుంది. అంతేకాకుండా గోడౌన్ల వద్ద లోడింగ్‌, అన్‌లోడింగ్‌ చేసేందుకు గంటల తరబడి రోడ్డుపైనే నిలిపివేస్తుండడంతో ఆ మార్గంలో వాహన రాకపోకలకు అవకాశం ఉండదు. ఇలాంటి పరిస్థితిలో వాహనచోదకులు, ఆయాప్రాంతాల్లోని నివాసితులు తీవ్ర ఇబ్బందులకు గురవుతారు. దీనిని గుర్తించిన పోలీస్‌ అధికారులు నగరంలోకి భారీ వాహనాలు,  ఇతర సరుకుల లోడ్‌తో వచ్చే వాణిజ్య వాహనాలపై ఆంక్షలు విధించారు. రాత్రి పది గంటల నుంచి ఉదయం తొమ్మిది గంటల వరకూ మాత్రమే వాటిని నగరంలోకి ప్రవేశించేందుకు అవకాశం కల్పించారు. మిగిలిన సమయాల్లో అనుమతించేది లేదని చాలాకాలం కిందటే ఆదేశాలు జారీచేశారు. పాలు, గ్యాస్‌ లాంటి నిత్యావసరాలను రవాణా చేసే వాహనాలకు మాత్రమే మినహాయింపు ఇచ్చారు. కానీ గత కొంతకాలంగా  నిషేధిత సమయాల్లోనూ భారీ వాహనాలు నగరంలోకి ప్రవేశిస్తున్నాయి. అంతర్గత రోడ్లు, వీధిరోడ్లపైనే నిలిపివేసి లోడింగ్‌, అన్‌లోడింగ్‌ చేస్తుండడం పరిపాటిగా మారింది. ఇక ఇసుక, ఇటుక, కాంక్రీట్‌ తదితర సరకులను రవాణా చేసే వాహనాల సంగతి చెప్పాల్సిన పనిలేదు. బీట్‌ కానిస్టేబుళ్లకు ఎంతో కొంత చేతిలో పెట్టి వీరు దర్జాగా సాగిపోతున్నట్టు ఆరోపణలున్నాయి. 


మద్దిలపాలెం వద్ద మరీ ఘోరం 

జాతీయరహదారికి అనుకుని మద్దిలపాలెం  వద్ద ఐరన్‌, సిమెంట్‌ దుకాణాలున్నాయి. వీటి వద్ద నిత్యం భారీ లారీలను నిలిపివేసి లోడింగ్‌, అన్‌లోడింగ్‌ చేస్తున్నా పోలీసులు పట్టించుకోవడంలేదు. మద్దిలపాలెం పిఠాపురం కాలనీ, వుడా షాపింగ్‌ కాంప్లెక్స్‌ సమీపంలో కొరియర్‌, హోల్‌సేల్‌ రైస్‌ దుకాణాలకు చెందిన గోడౌన్లున్నాయి. దీనివల్ల ఆ రోడ్డులో నిత్యం ట్రాఫిక్‌జామ్‌ నెలకొంటోంది. హెచ్‌బీకాలనీ, సీతంపేట, శాంతిపురం, ఎన్‌జీజీవోస్‌ కాలనీ, లలితానగర్‌ రోడ్లపై కొరియర్‌, ప్లేవుడ్‌, హార్డ్‌వేర్‌ దుకాణాలకు చెందిన గోడౌన్లు ఉండడంతో నిత్యం వాణిజ్య వాహనాలు రాకపోకలు సాగిస్తూనే ఉంటాయి. అయితే మద్దిలపాలెం, ఎన్‌ఏడీ కూడళ్లలో విధుల్లోని ట్రాఫిక్‌ పోలీసులు నిషేధిత సమయంలో ఈ వాహనాలు రాకుండా అడ్డుకోవాల్సి ఉంటుంది. కానీ వారు పట్టించుకోకపోవడంతోనే సమస్య ఉత్పన్నమవుతోందని అధికారులే పేర్కొటున్నారు. నగరంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరగడానికి ఇది కూడా కారణంగా వారు విశ్లేషిస్తుండడం విశేషం.


నెలవారీ మామూళ్లు...?

నగరంలోని ట్రాఫిక్‌ పోలీసులు మామూళ్ల మత్తులో పడి నిషేధిత సమయంలో నగరంలోకి ప్రవేశించే వాహనాలపై చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.  కొంతమంది సిమెంట్‌, ఐరన్‌, ప్లేవుడ్‌, హార్డ్‌వేర్‌ వ్యాపారులతోపాటు కొరియర్‌ సర్వీసులు, ప్రైవేటు ట్రావెల్స్‌, క్వారీ లారీల యజమానులు ట్రాఫిక్‌ పోలీసులకు నెలవారీ మామూళ్లు ఇస్తున్నట్టు పోలీస్‌శాఖ సిబ్బందే చెబుతున్నారు. ఇలా నగరంలోని ఒక్కో ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌కు నెలకు రూ.1.5 లక్షల నుంచి రూ.5 లక్షలు వరకూ అందుతుంటాయని, అందులో విభాగంలోని హోంగార్డు నుంచి ఎస్‌ఐలు, సీఐల వరకూ వాటాలందుతాయనే విమర్శలున్నాయి. ఇటీవల ఏసీపీ, ఏసీడీపీకి కూడా వాటాలు ఇస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. మద్దిలపాలెం కూడలిలో ఇటీవల వరకూ ట్రాఫిక్‌ విభాగంలో పనిచేసిన ఓ కానిస్టేబుల్‌ దుకాణాలు, గోడౌన్లు, కొరియర్‌ సంస్థలు, క్వారీలారీల యజమానుల నుంచి మామూళ్లు వసూలు చేసి, సంబంధిత అధికారికి అందజేసేవారని, అక్కడ వాటాలు పంచేవారని, ఇటీవల అతడు లా అండ్‌ ఆర్డర్‌ విభాగానికి బదిలీ అయినప్పటికీ, ఈ వసూళ్ల వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్నాడనే వార్తలు గుప్పుమంటున్నాయి.


అధికారుల పర్యవేక్షణ కరవు 

ట్రాఫిక్‌ విభాగంపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తుతోందనేవాదన వినిపిస్తోంది. గతంలో ట్రాఫిక్‌ ఏడీసీపీగా పనిచేసిన వారు నిత్యం నగరంలో ట్రాఫిక్‌ తీరుని పర్యవేక్షించేవారు. రద్దీవేళ్లలో సమస్యాత్మక ప్రాంతాలకు వెళ్లి ఏసీపీలు, సీఐలతో కలిసి సిబ్బందికి ఆదేశాలు ఇస్తుండేవారు. బీట్‌ కానిస్టేబుళ్లు ఎక్కడెక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు? బీట్‌లో పక్కాగా ఉంటున్నారా? వాహనాల రాకపోకలను నియంత్రించకుండా సెల్‌ఫోన్‌లో మాట్లాడుకుంటూ, వీడియోలు చూసుకుంటున్నారా? అనేది తనిఖీ చేసేవారు. కానీ నగరంలో ప్రస్తుతం ఆ పరిస్థితి అరుదుగా కనిపిస్తోంది. ప్రముఖుల పర్యటన సమయంలో మినహా అధికారులు సాధారణ రోజుల్లో రోడ్లపైకి వచ్చి ట్రాఫిక్‌ తీరుతెన్నులను పర్యవేక్షించడం లేదనే విమర్శలున్నాయి. ఇప్పటికైనా ట్రాఫిక్‌ విభాగాన్ని ప్రక్షాళన చేయడంపై నగర పోలీస్‌ కమిషనర్‌ దృష్టిసారించాలని కొంతమంది పోలీస్‌ సిబ్బందే పేర్కొంటున్నారు. Read more