కాఫీ రైతు విలవిల

ABN , First Publish Date - 2022-11-23T00:51:05+05:30 IST

మన్యంలోని కాఫీ రైతులకు గత కొన్నాళ్లుగా ప్రోత్సాహకాలను పాలకులు ఆపేశారు. దీంతో కాఫీ రైతులకు సరైన ప్రోత్సాహం లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. 2018 నుంచి 2022 వరకు గిరిజన కాఫీ రైతులకు సుమారు రూ.60 కోట్లు ప్రోత్సాహక సొమ్ము బకాయి ఉందని రైతులు అంటున్నారు. వాటిని ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

కాఫీ రైతు విలవిల
కాఫీ పండ్లు సేకరిస్తున్న గిరిజన కాఫీ రైతు కాఫీ రైతు విలవిల

- ప్రోత్సాహకాలు నిలిపివేసిన ప్రభుత్వం

- నాలుగేళ్లుగా సుమారు రూ.60 కోట్లు వరకు బకాయి

- ఆందోళనలో కాఫీ రైతాంగం

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

మన్యంలోని కాఫీ రైతులకు గత కొన్నాళ్లుగా ప్రోత్సాహకాలను పాలకులు ఆపేశారు. దీంతో కాఫీ రైతులకు సరైన ప్రోత్సాహం లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. 2018 నుంచి 2022 వరకు గిరిజన కాఫీ రైతులకు సుమారు రూ.60 కోట్లు ప్రోత్సాహక సొమ్ము బకాయి ఉందని రైతులు అంటున్నారు. వాటిని ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఏజెన్సీలో కాఫీ తోటలు వేసుకునే గిరిజన రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక ప్రోత్సాకాల్ని అందిస్తాయి. ఇందులో భాగంగా రైతులకు ఎకరానికి రూ.32 వేలు చొప్పున వివిధ దశల్లో ఉపాధి పథకం ద్వారా, నగదు రూపంలో చెల్లిస్తుంటారు. దీంతో గిరిజన రైతులు ఉత్సాహంగా కాఫీ తోటల పెంపకానికి ఆసక్తి చూపుతున్నారు. కాగా 2018 నుంచి కాఫీ రైతులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన ప్రోత్సాహకాలు అందడం లేదు. అయితే దీనిపై ప్రభుత్వం సైతం అధికారులకు సరైన స్పష్టత ఇవ్వకపోవడంతో బకాయిల రూపంలో ఆయా ప్రోత్సాహక సొమ్ము వస్తుందనే భావనతో రైతులు కాఫీ తోటల పెంపకం చేపడుతున్నారు. అయినప్పటికీ గత నాలుగేళ్లుగా ఆయా ప్రోత్సాహకాలను ప్రభుత్వం విడుదల చేయకుండా కాలం గడుపుతూ వస్తున్నది. ఈ సమస్యపై కాఫీ రైతుల సంఘం, గిరిజన సంఘం నేతలు అనేక ఆందోళనలు చేపట్టి, అధికారులకు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ, సమస్య పరిష్కారం ప్రభుత్వ స్థాయిలో ఉండడంతో ఎవరూ పట్టించుకోని దుస్థితి కొనసాగుతున్నది. దీనిపై స్థానిక అధికారులు సైతం రైతులకు ఎటువంటి హామీ ఇవ్వలేని పరిస్థితిలో తలలు పట్టుకుంటున్నారు.

అందని ప్రోత్సాహక సొమ్ము

ఏజెన్సీ వ్యాప్తంగా 2018- 19 ఆర్థిక సంవత్సరం నుంచి 2021- 2022 ఆర్థిక సంవత్సరం వరకు 5,200 ఎకరాలకు, 43,247 మంది గిరిజన కాఫీ రైతులకు సంబంధించి రూ.60 కోట్ల 32 లక్షల 50 వేలు ప్రోత్సాహక సొమ్ము అందాల్సి ఉంది. 2018- 19 సంవత్సరంలో 8,891 మంది రైతులు.. 10 వేల ఎకరాలు, 2019- 20లో 9,174 రైతులు.. 10 వేలు ఎకరాలు, 2020- 21లో 11,343 మంది రైతులు.. 12 వేలు ఎకరాలు, 2021- 22లో 13,839 మంది రైతులు.. 15 వేల ఎకరాల కాఫీ తోటలు వేసిన రైతులకు ఆ మొత్తాన్ని ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. మండలాల వారీగా అందాల్సిన సొమ్మును పరిశీలిస్తే అనంతగిరి మండలానికి రూ.3కోట్ల 26 లక్షల 75 వేలు, అరకులోయ రూ.4 కోట్ల 99 లక్షల 75 వేలు, డుంబ్రిగుడ రూ.4 కోట్ల 62 లక్షల 50 వేలు, హుకుంపేట రూ.5 కోట్ల 28 లక్షల 75 వేలు, పెదబయలు రూ.3 కోట్ల, 28 లక్షలు, ముంచంగిపుట్టు రూ.3 కోట్ల 92 లక్షల 50 వేలు, పాడేరు రూ.6 కోట్ల 15 లక్షల 75 వేలు, జి.మాడుగుల రూ.7 కోట్ల 85 లక్షల 50 వేలు, చింతపల్లి రూ.6 కోట్ల 76 లక్షల 50 వేలు, జీకేవీధి రూ.7 కోట్ల 54 లక్షల 50 వేలు, కొయ్యూరు మండలానికి రూ.6 కోట్ల 62 లక్షలు బకాయి ప్రోత్సాహకాలు అందాల్సి ఉంది.

ఫొటో రైటప్స్‌: 22పిడిఆర్‌ 2: ఐటీడీఏ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న కాఫీ రైతులు

కదంతొక్కిన కాఫీ రైతులు

- బకాయి సొమ్ము చెల్లించాలంటూ ఐటీడీఏ ఎదుట ధర్నా

పాడేరు, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): మన్యంలో కాఫీ రైతులు కదంతొక్కారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమండ్‌ చేస్తూ మంగళవారం ఐటీడీఏ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ప్రధానంగా గిరిజన కాఫీ రైతులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన ప్రోత్సాహకాలు ఇవ్వాలని, కాఫీకి గిట్టుబాటు ధర కల్పించాలని, కాఫీ రైతుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి విడనాడాలని ఆందోళనకారులు డిమాండ్‌ చేశారు. సుమారు మూడు గంటల పాటు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర మాట్లాడుతూ గిరిజన కాఫీ రైతుల ప్రధానమైన డిమాండ్లను అధికార యంత్రాంగం నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. కాఫీ రైతులను మరింతగా ప్రోత్సహించి వారిని అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోతున్న కాఫీ రైతులకు నష్టపరిహారం చెల్లించాలని, రూ.2 లక్షలు వడ్డీ లేని రుణం అందించాలన్నారు. కాఫీ రైతుల పిల్లల చదువులకు ఉపకార వేతనాలు అందించాలన్నారు. కాఫీ రైతుల సంఘం, గిరిజన సంఘం జిల్లా అఽధ్యక్షుడు పాలికి లక్కు మాట్లాడుతూ ఐటీడీఏ ఆధ్వర్యంలో చింతపల్లిలో ఏర్పాటు చేసిన మ్యాక్స్‌ సొసైటీతో గిరిజన రైతులకు మేలు జరగకపోగా, దోపిడీ జరుగుతున్నదని ఆరోపించారు. ప్రైవేటు వర్తకులు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మ్యాక్స్‌ సొసైటీలో కిలో కాఫీ పండ్లను రూ.50లకు కొనుగోలు చేస్తుంటే, చింతపల్లి మ్యాక్స్‌ సొసైటీ కిలో రూ.36లకు కొనుగోలు చేస్తున్నదన్నారు. అధికారులు స్పందించి కాఫీ పండ్లు కిలో రూ.60కి తగ్గకుండా, పార్చిమెంట్‌ రూ.360, కిలో మిరియాలు రూ.వెయ్యికి కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. అనంతరం తమ డిమాండ్లపై ఐటీడీఏ ఏపీవో వెంకటేశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాఫీ రైతుల సంఘం నేతలు రామన్న, రామారావు, గురుమూర్తి, సురేశ్‌, పోతురాజు, కొండలరావు, కృష్ణారావు, భాస్కరరావు, అర్జున్‌, అప్పారావు, పాడేరు, హుకుంపేట, డుంబ్రిగుడ, జి.మాడుగుల, అరకులోయ, అనంతగిరి, చింతపల్లి మండలాలకు చెందిన గిరిజన కాఫీ రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-23T00:51:05+05:30 IST

Read more