నాటి సంకల్పం.. నేడు సఫలీకృతం

ABN , First Publish Date - 2022-12-10T01:17:46+05:30 IST

coffee

నాటి సంకల్పం.. నేడు సఫలీకృతం
చింతపల్లి ఎకో పల్పింగ్‌ యూనిట్‌

9సీటీపీ2 చింతపల్లి ఎకో పల్పింగ్‌ యూనిట్‌

9సీటీపీ3 కాఫీ పండ్లు సేకరిస్తున్న రైతులు

9సీటీపీ4 కాఫీ పండ్లను రైతుల నుంచి కొనుగోలు చేస్తున్న మాక్స్‌ సిబ్బంది

9సీటీపీ5 పల్పింగ్‌ చేసిన పార్చిమెంట్‌ని ఎండబెడుతున్న మ్యాక్స్‌ సిబ్బంది

9సీటీపీ7 సెగ్గె కొండలరావు, మ్యాక్స్‌ అధ్యక్షుడు, చింతపల్లి

9సీటీపీ8 ఎన్‌.అశోక్‌, ఏఈ, కాఫీ ప్రాజెక్టు, పాడేరు

టీడీపీ హయాంలో కాఫీ పైలట్‌ ప్రాజెక్టుకు శ్రీకారం

గిరిజన రైతులు సభ్యులుగా ‘మ్యాక్స్‌’ ఏర్పాటు

తొలుత 800 మంది రైతులతో ప్రారంభం.. ఇప్పుడు 3,200 మందికి చేరిక

చింతపల్లిలో కాఫీ ఎకో పల్పింగ్‌ యూనిట్‌

జి.మాడుగుల, జీకే వీధిలో కొత్తగా యూనిట్లు ఏర్పాటు

నిధులు మంజూరు చేసిన ట్రైకార్‌, ఐటీడీఏ

200 టన్నుల నుంచి 1,087 టన్నులకు పెరిగిన పార్చిమెంట్‌ ఉత్పత్తి

మార్కెట్‌లో విక్రయం... వచ్చిన లాభాల్లో కాఫీ రైతులకు బోనస్‌

నాలుగేళ్లలోనే సగం రుణం వడ్డీతో సహా చెల్లించిన మ్యాక్స్‌

ఈ ఏడాది తొమ్మిది మండలాల కాఫీ రైతులకు సేవలు

ఐదు వేల టన్నుల కాఫీ పండ్లను సేకరించాలని లక్ష్యం

చింతపల్లి, డిసెంబరు 9: ఆదివాసీ రైతులు నాణ్యమైన కాఫీ దిగుబడులు సాధించడానికి, పండించిన కాఫీ పంటకు అంతర్జాతీయ ధరలు లభించాలనే సంకల్పంతో నాడు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటుచేసిన ‘కాఫీ పైలట్‌ ప్రాజెక్టు’ ఇప్పుడు మంచి ఫలితాలను ఇస్తున్నది. ఈ ప్రాజెక్టు నిర్వహిస్తున్న ‘ది విశాఖ ఏజెన్సీ గిరిజన కాఫీ ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సంఘం(మ్యాక్స్‌)’ గిరిజన రైతులు పండించిన కాఫీ గింజలకు మార్కెటింగ్‌ సదుపాయం కల్పిస్తూ అంతర్జాతీయ ధరలను అందిస్తున్నది. గతంలో దళారీలు నిర్ణయించిన ధరకు కాఫీ గింజలను విక్రయించుకునే రైతులు... ఇప్పుడు కాఫీ విక్రయ ధరలను తామే నిర్ణయించే స్థాయికి ఎదిగారు. కాఫీ తోటల్లో దిగుబడులు ప్రారంభమైన నేపథ్యంలో కాఫీ పైలట్‌ ప్రాజెక్టుపై ప్రత్యేక కథనం.

గిరిజన రైతులు కాఫీ తోటలను ఏ విధంగా సాగు చేసుకోవాలి, నాణ్యమైన పంట దిగుబడులు సాఽధించేందుకు చేపట్టాల్సిన చర్యలపై రైతులకు అవగాహన కల్పించేందుకు 2018 డిసెంబరులో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం చింతపల్లి కేంద్రంగా ‘కాఫీ పైలట్‌ ప్రాజెక్టు’ను ప్రారంభించింది. దీని నిర్వహణ బాధ్యతలను పార్టనర్స్‌ ఇన్‌ ప్రాస్పారిటీ (పీఐపీ) అనే సంస్థకు అప్పగించింది. రైతులు నాణ్యమైన కాఫీ దిగుబడులు సాధించేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు పీఐపీకి నాటి ప్రభుత్వం ట్రైకార్‌ ద్వారా సుమారు రూ.3.5 కోట్ల నిధులు కేటాయించింది. అలాగే గిరిజనులు పండించిన కాఫీ గింజలకు మార్కెటింగ్‌ సదుపాయం కల్పించి, అంతర్జాతీయ ధరలు లభించాలన్న ఉద్దేశంతో ‘ది విశాఖ ఏజెన్సీ గిరిజన కాఫీ ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సంఘం(మ్యాక్స్‌)’ను ఏర్పాటు చేసింది. దీనికి రివాల్వింగ్‌ ఫండ్‌గా రూ.3.12 కోట్లు, అడ్మినిస్ట్రేటివ్‌ ఫండ్‌గా రూ.1.56 కోట్లు విడుదల చేసింది.

9 మండలాలకు మార్కెటింగ్‌ సేవలు విస్తరణ

నాలుగేళ్ల క్రితం తొలుత కేవలం 800 మంది రైతులతో ప్రారంభమైన మ్యాక్స్‌లో ప్రస్తుతం 3,200 మంది సభ్యులుగా వున్నారు. ప్రభుత్వం ఇచ్చిన రివాల్వింగ్‌ ఫండ్‌తో రైతుల నుంచి కాఫీ పండ్లను అపెక్స్‌ కమిటీ సూచించిన గరిష్ఠ ధరలకు కొనుగోలుచేస్తున్నది. అనంతరం పల్పింగ్‌ యూనిట్‌లో ప్రాసెసింగ్‌ చేసి, క్లీన్‌ కాఫీగా మార్కెటింగ్‌ చేస్తున్నది. కాఫీ గింజలు విక్రయించగా వచ్చిన లాభాల్లో నుంచి నిర్ణీత మొత్తాన్ని రైతులకు బోనస్‌గా చెల్లిస్తున్నది. ఈ క్రమంలో ప్రభుత్వం అందించిన రివాల్వింగ్‌ ఫండ్‌ రూ.3.12 కోట్లకు రూ.17 లక్షలు వడ్డీ కలిపి మొత్తం రూ.3.29 కోట్లను ఈ ఏడాది ఫిబ్రవరిలో ట్రైకార్‌, ఐటీడీఏకు తిరిగి చెల్లించింది. ఇంకా మిగిలిన రూ.1.4 కోట్లతో ఈ ఏడాది మ్యాక్స్‌ వ్యాపారం ప్రారంభించింది. 2020 వరకు చింతపల్లి మండలానికి పరిమితమైన మ్యాక్స్‌.. 2021లో జీకేవీధి మండలానికి సేవలను విస్తరించింది. ఈ ఏడాది అరకులోయ, అనంతగిరి మినహా మిగిలిన తొమ్మిది మండలాలకు మార్కెటింగ్‌ సేవలను విస్తరించింది.

కాఫీ పల్పింగ్‌ యూనిట్లు

ఐటీడీఏ ప్రాజెక్టు అధికారుల కృషి ఫలితంగా మ్యాక్స్‌కి అనుబంధంగా ట్రైకార్‌ నిధులతో ఎకో పల్పింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేశారు. ఐటీడీఏ పూర్వ పీవోలు డీకే బాలాజీ, డాక్టర్‌ వెంకటేశ్వర్లు, ప్రస్తుత పీవో రోణంకి గోపాలక్రిష్ణ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చింతపల్లిలో సుమారు రూ.3 కోట్ల ట్రైకార్‌, ఐటీడీఏ నిధులతో అత్యాధునిక ఎకో పల్పింగ్‌ యూనిట్‌ని నిర్మించారు. ఇది 2020-21 నుంచి అందుబాటులోకి వచ్చింది. ఇంకా జి.మాడుగుల, గూడెంకొత్తవీధిలో ఎకో పల్పింగ్‌ యూనిట్ల నిర్మాణానికి సుమారు రూ.మూడు కోట్ల నిధులను ఐటీడీఏ పీవో విడుదల చేశారు. గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్‌ అధికారులు ఎకో పల్పింగ్‌ యూనిట్లు నిర్మిస్తున్నారు. సుమారు రూ.50 లక్షలతో చింతపల్లిలోని ఎకో పల్పింగ్‌ యూనిట్‌కి ఆనుకుని నాలుగు ఎకరాల స్థలంలో గోదాముల నిర్మాణం జరుగుతున్నది.

నాలుగేళ్లలో స్వయం సమృద్ధి

తొలి ఏడాది (2018-19) మ్యాక్స్‌ 800 మంది రైతుల నుంచి కాఫీ పండ్లు కిలో రూ.31 చొప్పున కొనుగోలు చేసింది. వీటిని పార్చిమెంట్‌గా మార్చడం ద్వారా వచ్చిన 200 టన్నుల గింజలను పీఐపీ సంస్థ ద్వారా టాటా కంపెనీకి కిలో రూ.150 చొప్పున విక్రయించింది. 2019-20లో 1,400 మంది రైతుల నుంచి కిలో రూ.21 చొప్పున కొనుగోలు చేసింది. 450 కిలోల పార్చిమెంట్‌ని రూ.210 ధరకు విక్రయించారు. వచ్చిన లాభాల్లో కిలోకి రూ.6 చొప్పున రైతులకు బోనస్‌గా చెల్లించారు. 2020-21లో 2,500 మంది రైతుల నుంచి కాఫీ పండ్లు కిలో రూ.27 చొప్పున కొనుగోలు చేశారు. 658 టన్నుల పార్చిమెంట్‌ని కిలో రూ.221 ధరకు విక్రయించారు. వచ్చిన లాభంలో నుంచి కిలోకి రూ.4 చొప్పున రైతులకు బోనస్‌గా చెల్లించారు. 2021-22లో 3,200 మంది రైతుల నుంచి కాఫీ పండ్లు కిలో రూ.32 చొప్పున కొనుగోలు చేశారు 1,087 టన్నుల పార్చిమెంట్‌కి కిలో రూ.294 చొప్పున విక్రయించారు. లాభాల నుంచి కిలో పండ్లకు రూ.8 చొప్పున రైతులకు బోనస్‌ రూపంలో చెల్లించారు.

ఐదువేల టన్నుల కాఫీ పండ్ల సేకరణ లక్ష్యం

సెగ్గె కొండలరావు, అధ్యక్షుడు, మ్యాక్స్‌, చింతపల్లి.

మ్యాక్స్‌ ద్వారా ఈ ఏడాది ఐదు వేల టన్నుల కాఫీ పండ్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. కాఫీ పండ్లు కిలో రూ.36 ధరగా నిర్ణయించి కొనుగోలు చేస్తున్నాం. ఆరు కిలోల కాఫీ పండ్లను పల్పింగ్‌ యూనిట్‌లో ప్రాసెస్‌ చేస్తే ఒక కిలో పార్చిమెంట్‌ కాఫీ వస్తుంది. ఇప్పటి వరకు 175 టన్నులు కొనుగోలు చేశాం. పార్చిమెంట్‌ అమ్మకం ద్వారా వచ్చిన లాభాల్లో నుంచి ఈ ఏడాది కూడా రైతులకు బోనస్‌ చెల్లిస్తాం.

పక్వానికి వచ్చిన పండ్లను సేకరించాలి

ఎన్‌.అశోక్‌, ఏఈ, కాఫీ ప్రాజెక్టు, పాడేరు

గిరిజన రైతులు కాఫీ తోటల్లో పక్వానికి వచ్చిన పండ్లను మాత్రమే సేకరించాలి. దీనివల్ల నాణ్యమైన కాఫీ పప్పు వస్తుంది. మార్కెట్‌లో గరిష్ఠ ధర లభిస్తుంది. కాఫీ పండ్లను మీ ప్రాంతానికి వచ్చే మ్యాక్స్‌ సిబ్బందికి విక్రయించి గిట్టుబాటు ధరలు పొందాలి. దళారీలను ఆశ్రయించి నష్టపోవద్దు.

Updated Date - 2022-12-10T01:17:48+05:30 IST