సీఐల బదిలీల్లో జోరుగా పైరవీలు
ABN , First Publish Date - 2022-08-17T06:44:40+05:30 IST
నగర పరిధిలో సర్కిల్ ఇన్స్పెక్టర్ల బదిలీలు, పోస్టింగ్‌ల విషయంలో రాజకీయ జోక్యం ఎక్కువైందని పోలీస్ శాఖలో చర్చ జరుగుతోంది.

మితిమీరిన రాజకీయ జోక్యం
తాము సూచించిన వారికి ప్రాధాన్యం కలిగిన స్టేషన్లలో పోస్టింగ్ ఇవ్వాలని ఉన్నతాధికారులపై నేతల ఒత్తిడి
ఒకే స్టేషన్లో పోస్టుకు వేర్వేరు సీఐలకు వేర్వేరు నేతల సిఫారసు లేఖలు
ఏం చేయాలో అర్థంకాక పెడింగ్‌లో పెట్టిన సీపీ?
పీఎం పాలెం, పెందుర్తి, ఆరిలోవ, హార్బర్ పోలీస్ స్టేషన్లకు గట్టి పోటీ
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
నగర పరిధిలో సర్కిల్ ఇన్స్పెక్టర్ల బదిలీలు, పోస్టింగ్‌ల విషయంలో రాజకీయ జోక్యం ఎక్కువైందని పోలీస్ శాఖలో చర్చ జరుగుతోంది. తమ వారికి కీలక స్టేషన్లలో పోస్టింగ్ ఇవ్వాలంటూ ఉన్నతాధికారులపై నాయకులు ఒత్తిడి పెంచుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల భారీగా సీఐల బదిలీలు జరిగినా...పీఎం పాలెం సీఐ పోస్టును ఎవరినీ కేటాయించకపోవడంతో పాటు ఆరిలోవ, హార్బర్, పెందుర్తి వంటి కీలక స్టేషన్ల సీఐల బదిలీ ప్రక్రియ నిలిపివేసినట్టు తెలిసింది.
నగర పోలీస్ కమిషనరేట్ పరిఽధిలో లా అండ్ ఆర్డర్‌కు సంబంధించి 23 స్టేషన్లు ఉన్నాయి. వాటిలో భీమిలి, పీఎం పాలెం, పెందుర్తి, గాజువాక, ఆరిలోవ, మల్కాపురం, ఆరిలోవ వంటి స్టేషన్లు కీలకమైనవిగా పోలీసులు చెబుతుంటారు. ఆయా స్టేషన్ల పరిధిలో ప్రతి నెలా భారీగా మామూళ్లు వస్తుంటాయని, అందుకే సీఐ పోస్టుకు మంచి డిమాండ్ వుంటుందని పేర్కొంటుంటారు. ఇదిలావుండగా నగరంలో సీఐల బదిలీలు ఎప్పుడు జరిగినా ఎంతో కొంత రాజకీయ నేతల ప్రమేయం కనిపిస్తూ వస్తోంది. అయితే ఇటీవల కాలంలో నేతల పెత్తనం బాగా పెరిగిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధికార పార్టీకి చెందిన నాయకులు తమ పరిధిలోని పోలీస్ స్టేషన్‌కు తమ సామాజిక వర్గానికి చెందిన సీఐ లేదంటే తమకు అనుకూలంగా వుండే సీఐను నియమించాలంటూ ఉన్నతాధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. కీలక స్టేషన్లలో పోస్టింగ్ కోసం సీఐలు కూడా తమకు అనుకూలమైన నేతల నుంచి సిఫారసు లేఖలు తీసుకుని ఉన్నతాధికారులకు అందజేస్తున్నారు. ఒకే స్టేషన్లో పోస్టుకు ఇద్దరు, ముగ్గురు సీఐలు నేతల నుంచి సిఫారసు లేఖలు అందజేస్తుండడంతో ఎవరి పేరును పరిగణనలోకి తీసుకోవాలో తెలియక ఉన్నతాధికారులు అయోమయానికి గురవుతున్నారు. ఇటీవల జరిగిన 20 మంది సీఐల బదిలీల ప్రక్రియను పరిశీలిస్తే సీఐల పోస్టింగ్‌లలో రాజకీయ ప్రమేయం ఏ స్థాయిలో వుందనేది అర్థమవుతోంది. ద్వారకానగర్, గాజువాక వంటి స్టేషన్లలో పోస్టింగ్‌లపై తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. అలాగే పీఎం పాలెంలో పనిచేస్తున్న సీఐ రవికుమార్‌ను అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేయగా, ఆయన స్థానంలో ఎవరినీ నియమించలేదు. ఆ పోస్టు కోసం ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు సీఐలు పోటీపడడంతోపాటు అధికార పార్టీకి చెందిన ఇద్దరు వేర్వేరు నేతలతో సిఫారసు లేఖలు తెచ్చుకోవడంతో సీపీ డోలాయమానంలో పడిపోయినట్టు ప్రచారం జరుగుతోంది. అలాగే ఆరిలోవ సీఐ ఇమ్మాన్యుయేల్‌రాజు చాలాకాలంగా అక్కడే వుండడంతో ఆయన్ను బదిలీ చేయాలని అధికారులు భావించారు. అయితే ఆ పోస్టు కోసం ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు సీఐలు వేర్వేరు నేతలతో ఒత్తిడి తీసుకురావడంతో ఇమ్మాన్యుయేల్‌రాజు బదిలీ యోచనను తాత్కాలికంగా పక్కనపెట్టినట్టు తెలిసింది. అలాగే హార్బర్ సీఐగా పనిచేస్తున్న మురళీ అనకాపల్లి జిల్లాకు వెళ్లిపోవాలని యత్నించగా, ఆ పోస్టు కోసం మరొక సీఐ ఉన్నత స్థాయిలో సిఫారసు చేయించుకున్నారు. అయితే హార్బర్ సీఐ మురళీ మళ్లీ తాను అక్కడే కొనసాగాలని నిర్ణయించుకోవడంతో ఆయన బదిలీ తాత్కాలికంగా నిలిచిపోయినట్టు చెబుతున్నారు. పెందుర్తి సీఐ పోస్టు కోసం తాను సూచించిన అధికారిని పరిగణనలోకి తీసుకోవాలని అక్కడ ప్రజా ప్రతినిధి సీపీని కోరగా, అందుకు పరిస్థితులు అనుకూలంగా లేవని బదులిచ్చినట్టు తెలిసింది. దీంతో మరొక పేరు సూచించేంత వరకూ ప్రస్తుత సీఐను కొనసాగించాలని సీపీకి సదరు ప్రజా ప్రతినిధి చెప్పినట్టు సమాచారం. ఏదిఏమైనా గతంలో ఎన్నడూ లేనిస్థాయిలో సీఐల పోస్టింగ్‌లలో రాజకీయ జోక్యం పెరగడంతో సీపీ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది సీఐలు తాము రాజకీయ నేతలతో సిఫారసు చేయించుకున్నాసరే సీపీ తమను లెక్కచేయడం లేదనే భావనలో వున్నట్టు చెబుతున్నారు. నగరంలో కీలక పోలీస్ స్టేషన్లలో సీఐలపై ఏ విధంగా ముందుకువెళ్లాలనే దానిపై నగర పోలీస్ కమిషనర్ ప్రభుత్వంలోని కీలక నేతలతోపాటు పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నట్టు తెలిసింది. ఈ వారాంతానికి బదిలీల ప్రక్రియ పూర్తిచేసే అవకాశం వుందని పోలీస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
మరో 22 మందికి కరోనా
విశాఖపట్నం, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి) : జిల్లాలో కొత్తగా 22 మందికి కరోనా
వైరస్ సోకినట్టు నమోదైంది. వీటితో మొత్తం కేసుల సంఖ్య 1,94,765కు చేరింది. మరో 51 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 1,93,471కు చేరింది. మరో 138 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 1156 మంది మృతి చెందారు.