చిన్నారులకు బంధనం
ABN , First Publish Date - 2022-10-17T07:15:32+05:30 IST
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచం కొత్త పుంతలు తొక్కుతున్నా... ఇంకా బాల్య వివాహమనే జాఢ్యం జనం నుంచి తొలగిపోవడం లేదు.
ఉమ్మడి జిల్లాలో ఆగని బాల్య వివాహాలు
ఏటా పదుల సంఖ్యలో పెళ్లిళ్లను అడ్డుకుంటున్న అధికారులు
పరిమితంగానే యంత్రాంగం దృష్టికి
అవగాహన కల్పిస్తున్నా ఫలితం శూన్యం
తల్లిదండ్రుల్లో మార్పు రావాలంటున్న నిపుణులు
(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచం కొత్త పుంతలు తొక్కుతున్నా... ఇంకా బాల్య వివాహమనే జాఢ్యం జనం నుంచి తొలగిపోవడం లేదు. ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా, చట్టం పేరుతో భయం కలిగించినా... తల్లిదండ్రుల్లో మార్పు కనిపించడం లేదు. ఫలితంగా ఆడీ పాడే వయసులో పడుతున్న బంధాలు ముఖ్యంగా బాలికల శారీరక, మానసిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి.
‘ఆనందపురం మండలం మామిడిలోవ గ్రామంలో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికకు వివాహం చేస్తున్నారంటూ గుర్తు తెలియని వ్యక్తులు అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అధికారులు ఆ వివాహాన్ని అడ్డుకున్నారు. 29 ఏళ్ల వయసున్న యువకుడితో బాలికకు వివాహం చేసేందుకు సిద్ధమైన తల్లిదండ్రులకు బాల్య వివాహం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు. బాలిక మేజర్ అయిన తరువాతే వివాహం చేసేలా ఇరు కుటుంబాల వారిని ఒప్పించి, పోలీసుల సమక్షంలో ఒప్పందపత్రాలను రాయించారు.
‘కొయ్యూరు మండలం మర్రిపాలెం గ్రామంలో ఎనిమిదో తరగతి చదువుతున్న బాలికకు తల్లిదండ్రులు కొద్దిరోజులు కిందట వివాహం నిశ్చయించారు. విషయం అధికారులు దృష్టికి రాగా, ఇరు కుటుంబాలతో మాట్లాడి, పోలీసులు, ఇతర అధికారులతో కలిసి కౌన్సిలింగ్ ఇవ్వడంతో పెళ్లి వాయిదా పడింది. దీంతో ఆ బాలిక ఆనందంగా పాఠశాలకు వెళ్లి చదువుకుంటోంది’
జిల్లాలో అధికారులు నిలిపేసిన బాల్య వివాహాల్లో ఇవి కొన్ని మాత్రమే. ఆడపిల్ల బరువు దించుకుందామనే భావనలో ఉన్న తల్లిదండ్రులు ఏటా పదుల సంఖ్యలో బాల్యవివాహాలు చేసేస్తున్నారు. వీటిలో అధికారుల దృష్టికి వచ్చినవి కొన్ని మాత్రమే ఉంటుండగా, ఎన్నో వివాహాలు గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోతున్నాయి. చిన్నారుల బాల్యాన్ని మూడుముళ్లతో బంధించి, వారి జీవితాలను చిదిమేస్తున్నారు. ఇటీవల ఇలా జరుగుతున్న వివాహాల్లో ఎక్కువగా ప్రేమ పెళ్లిళ్లు ఉండడం కొస మెరుపు.
అవగాహన కల్పిస్తున్నా...
సమాజం పట్ల కనీస అవగాహన ఏర్పడని, ఎదిగే వయసులో పిల్లలు పెళ్లిళ్లు చేసుకుని చిన్న వయసులోనే నరకాన్ని అనుభవిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. బాల్య వివాహాల వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయని, ఈ విషయాన్ని తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలని కోరుతున్నారు. తమ దృష్టికి వచ్చిన కొద్ది సంఖ్యలోని బాల్య వివాహాలను మాత్రమే నిలువరించగలుగుతున్నామని, మిగిలినవి యథావిధిగా జరిగిపోతున్నాయని నిట్టూరుస్తున్నారు.
విద్యాధికుల్లోనూ కనిపించని మార్పు
బాలికలను వివాహం చేసుకుంటున్న యువకుల్లో ఎక్కువ మంది ఉన్నత చదువులు పూర్తిచేసిన వారు కూడా ఉండడం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. గత ఐదేళ్లలో ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలో 186 బాల్య వివాహాలను అధికారులు నిలుపుదల చేశారు. వీటిలో ఈ ఏడాదిలో ఇప్పటివరకు నిలుపుదల చేసిన వివాహాలు 37 ఉన్నాయి. బాలికల స్నేహితులు, గ్రామ పెద్దల ద్వారా సమాచారం రావడంతో అప్రమత్తమవుతున్న అధికారులు బాలికల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయంటున్న అధికారులు వీటిని నియంత్రించే దిశగా ప్రజల్లో చైతన్యం నింపేందుకు మహిళా శిశు సంక్షేమశాఖ, 1098 చైల్డ్‌లైన్, సమగ్రబాలల సంరక్షణ పథకం(ఐసీపీఎస్), పోలీస్, రెవెన్యూ ఇతర స్వచ్ఛంద సంస్థలతో కలిసి మార్పునకు తమ వంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు.
చట్ట ప్రకారం నేరం...
బాల్య వివాహాల నిరోధక చట్టాన్ని బ్రిటిష్ ప్రభుత్వ హయాంలోనే రూపొందించారు. అయితే ఈ చట్టంతో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో మరింత పకడ్బందీగా అమలుచేయాలని భావించిన కేంద్ర ప్రభుత్వం 2006లో బాల్య వివాహ నిరోధక కొత్త చట్టాన్ని అమలులోకి తీసుకువచ్చింది. ఈ చట్టం ప్రకారం వధువుకి 18, వరుడికి 21 ఏళ్లు నిండిన తరువాతే వివాహం చేయాల్సి ఉంటుంది. అలా కాదని పెళ్లి చేస్తే వధువు తండ్రికి, వివాహానికి సహకరించినవారికి, వరుడికి రెండేళ్ల జైలు శిక్ష, వరుడికి 18 ఏళ్లు దాటితే రూ.లక్ష జరిమానా విధిస్తారు. బాల్య వివాహాన్ని నాన్‌బెయిలబుల్‌గా పరిగణిస్తారు. తాజాగా కేంద్రం బాల, బాలికల వివాహ వయసును మరింత పెంచాలని నిర్ణయించినా ఇంకా అమల్లోకి రాలేదు.
బాల్య వివాహాన్ని నిరోధించేందుకు..
బాల్య వివాహాలను నిరోధించేందుకు అధికారులున్నారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ బాల్య వివాహ నిరోధక అధికారిగా వ్యవహరిస్తారు. రెవెన్యూ స్థాయిలో ఆర్డీవో, అంగన్‌వాడీల్లో రెండు, మూడు ప్రాజెక్టుల పరిధిలో సీడీపీవో, మండల స్థాయిలో రెవెన్యూ ఆఫీసర్, అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు, గ్రామస్థాయిలో సెక్రటరీ, వీఆర్‌వోలు బాల్య వివాహ నిరోధక అధికారులుగా ప్రభుత్వం ప్రకటించింది.
అవగాహన లోపంతోనే..
అత్యధికంగా గ్రామీణ ప్రాంతాల్లోనే బాల్య వివాహాలు జరుగుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం నిరక్ష్యరాస్యతేనని అధికారులు పేర్కొంటున్నారు. బాల్య వివాహాలతో కలిగే అనర్థాలను తెలుసుకోలేకపోవడం మరో కారణమంటున్నారు. బాలికలకు చదువుకోవాలనే ఆసక్తి ఉన్నా, కుటుంబ ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడం, ఆడ పిల్లలకు త్వరగా పెళ్లి చేసేస్తే బాధ్యత తీరిపోతుందని తల్లిదండ్రులు ఆలోచిస్తుండడం తదితర కారణాలతో బాల్య వివాహాలు జరిగిపోతున్నాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలో నర్సీపట్నం, నాతవరం, భీమిలి, కె.కోటపాడు, చోడవరం, దేవరపాల్లి, నగర పరిధిలోని కంచరపాలెం, పెందుర్తి, పరవాడ, పెదగంట్యాడ, గాజువాక, ఆనందపురం తదితర ప్రాంతాల్లో ఏటా బాల్య వివాహాలు ఎక్కువగా నమోదవుతున్నాయి.
సమాచారం అందించండి..
జిల్లాలో ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్టు తెలిస్తే జిల్లా కలెక్టర్, పోలీస్ ఉన్నతాధికారులు డయల్ 100, మహిళా శిశు సంక్షేమశాఖ పథక సంచాలకులు, ఐసీపీఎస్, చైల్డ్‌లైన్ 1098, తహసీల్దార్, సీడీపీవో, గ్రామస్థాయిలో వీఆర్‌వో, పంచాయతీ కార్యదర్శులకు సమాచారం అందించవచ్చు. అవసరమైతే సామాజిక సేవా కార్యకర్తలకు కూడా తెలియజేయవచ్చు.
బాలికలకు సమస్యలెన్నో...
బాల్య వివాహాల వల్ల బాలికలకు అనేక ఇబ్బందులు ఎదురవుతాయని నిపుణులు చెబుతున్నారు. రక్తహీనతకు గురి కావడం, అనారోగ్యంతో కూడిన శిశువులు జన్మించడం, అవయవాల ఎ దుగుదల లేకపోవడం, శిశు మరణాలు సంభవించడం, జన్యుపరమైన సమస్యలు, దంపతుల మధ్య అవగాహన లోపంతో కుటుంబంలో కలహాలు, మానసిక పరిపక్వత లేక చిన్న సమస్య తలెత్తినా ఆత్మహత్యలకు యత్నించడం వంటి ఇబ్బందులు తలెత్తే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.
తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నాం
బాల్య వివాహాలు జరుగుతున్నట్టు సమాచారం వచ్చిన వెంటనే అధికారులతో కలిసి వెళ్లి నిలుపుదల చేస్తున్నాం. తల్లిదండ్రులు, కుటుంబసభ్యులతో ఒప్పంద పత్రాలపై సంతాకలు తీసుకుంటున్నాం. మేజర్లు అయ్యే వరకు వివాహం జరిపించకూడదని స్పష్టం చేస్తున్నాం. బాల్య వివాహాలు చేస్తే చట్ట ప్రకారం తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, బంధువులు, పెద్దలకు రెండేళ్ల జైలు, రూ.లక్ష జరిమానా విధించే అవకాశం ఉంది. పిల్లలను చదివిచండంలో ఇబ్బందులు తలెత్తితే హోమ్స్‌లో చేర్పించి చదివిస్తాం. అవసరమైతే ఎన్‌జీవోల సహకారం తీసుకుంటున్నాం. బాల్య వివాహాల సమాచారాన్ని ఎవరైనా తెలియజేయవచ్చు. వారి వివరాలను గోప్యంగా ఉంచుతాం.
- బి.మమత, జిల్లా బాలల సంరక్షణ అధికారి
ఐదేళ్లలో జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ టీం ఆపిన బాల్య వివాహాలు
2018 - 21
2019 - 56
2020 - 35
2021 - 37
2022 - 37
(సెప్టెంబరు వరకు)
ఇవి అధికారులకు సమాచారం వస్తే ఆపిన వివాహాలు మాత్రమే. వీటికి నాలుగైదు రెట్లు వివాహాలు బయటపడకుండా జరిగిపోతున్నట్టు చెబుతున్నారు.