ఆస్తి పన్ను ఆధారంగా చెత్త పన్ను

ABN , First Publish Date - 2022-08-18T06:33:09+05:30 IST

నగరంలో ఇకపై చెత్త పన్ను (యూజర్‌ చార్జీ)ను అర్ధ సంవత్సర ఆస్తి పన్ను ఆధారంగా వసూలు చేయబోతున్నారు.

ఆస్తి పన్ను ఆధారంగా  చెత్త పన్ను

ఐదు శ్లాబులుగా విభజన

కనిష్ఠం రూ.20, గరిష్ఠం రూ.120...

అత్యధికంగా రూ.50 శ్లాబులో రెండు లక్షలకిపైగా అసెస్‌మెంట్‌లు

ప్రతి నెలా రెసిడెన్షియల్‌ కేటగిరీలో రూ.3.82 కోట్లు వసూలు

వచ్చే నెల నుంచి అమలులోకి తేవాలని యోచన


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

నగరంలో ఇకపై చెత్త పన్ను (యూజర్‌ చార్జీ)ను అర్ధ సంవత్సర ఆస్తి పన్ను ఆధారంగా వసూలు చేయబోతున్నారు. ఇందుకోసం అసెస్‌మెంట్లను ఐదు శ్లాబులుగా విభజించారు. అత్యల్పంగా రూ.20, అత్యధికంగా రూ.120 వసూలు చేసేలా అధికారులు కార్యచరణ రూపొందించారు. ఇందుకు ఇటీవల జీవీఎంసీ కౌన్సిల్‌ ఆమోదం తెలపడంతో వచ్చే నెల నుంచి కొత్త విధానాన్ని అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు.

ఘన వ్యర్థాల నిర్వహణ చట్టం-2016 ప్రకారం చెత్త సేకరణ, తరలింపు ప్రక్రియను శాస్త్రీయంగా నిర్వహించేందుకు ప్రజల నుంచి యూజర్‌ చార్జీలను వసూలు చేసుకోవచ్చునంటూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది. దీని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం యూజర్‌ చార్జీలను వసూలుచేసి ఆ మొత్తం పారిశుధ్య నిర్వహణకు వెచ్చించాలని అన్ని స్థానిక సంస్థలను ఆదేశించింది. ఈ మేరకు మురికివాడల్లో నివాసాలకు నెలకు రూ.60, ఇతర ప్రాంతాల్లోని నివాసాలకు రూ.120 చొప్పున వసూలుచేయాలని ప్రతిపాదన రూపొందించి జీవీఎంసీ కౌన్సిల్‌లో ఆమోదానికి పెట్టగా, టీడీపీ సహా ప్రతిపక్షాలన్నీ వ్యతిరేకించాయి. కానీ అధికార పార్టీకి కౌన్సిల్‌లో మెజారిటీ వుండడంతో యూజర్‌ చార్జీల వసూలుకు ఆమోదం లభించింది. అయితే వార్డు సచివాలయ శానిటేషన్‌ సెక్రటరీలు, వార్డు వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి యూజర్‌ చార్జీలు చెల్లించాలని కోరితే ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఎలాగైనా ప్రజల నుంచి యూజర్‌ చార్జీలను వసూలు చేయాల్సిందేనంటూ అధికారులపై ఒత్తిడి తెస్తోంది. అధికారులు తరచూ వీడియో కాన్ఫరెన్సులు ఏర్పాటుచేసి యూజర్‌చార్జీల వసూలు పురోగతిపై ఆరా తీస్తుండడంతో జీవీఎంసీ అధికారులు కింది స్థాయి ఉద్యోగులపై ఒత్తిడి పెంచుతూ వచ్చారు. సచివాలయ కార్యదర్శులకు మెమోలు జారీచేశారు. అయితే ప్రజలు కట్టకపోతే తాము ఏమీ చేయలేమంటూ వారంతా చివరికి చేతులెత్తేశారు. ఈ నేపథ్యంలో యూజర్‌ చార్జీలపైనే ఆధారపడి తీసుకున్న క్లాప్‌ వాహనాలకు సక్రమంగా బిల్లులు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. కాంట్రాక్టర్‌కు బిల్లులు పెండింగ్‌ ఉండిపోవడంతో వారు...డ్రైవర్లకు జీతాలను చెల్లించడం మానేశారు. దీంతో చాలామంది డ్రైవర్లు వాహనాలను నిలిపివేయడంతో నగరంలో చెత్త పేరుకుపోయి తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. పారిశుధ్య లోపం తలెత్తడంతో ప్రజల నుంచి జీవీఎంసీ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. ఇటువంటి పరిస్థితుల్లో యూజర్‌ చార్జీలను అన్ని వర్గాల నుంచి ఒకేలా కాకుండా ఆస్తి పన్ను ఆధారంగా వసూలుచేస్తే ఫలితం వుంటుందని అధికారులు భావించారు. ఈ మేరకు అర్ధ సంవత్సరానికి ఆస్తి పన్ను రూ.100-200 చెల్లించేవారు నెలకు రూ.20, రూ.201-1,000 వరకూ పన్ను కట్టేవారు రూ.50, రూ.1,001-2,000 పన్ను చెల్లించేవారు రూ.60, రూ.2,001-4,000 పన్ను కట్టేవారు రూ.110, రూ.4,001, అంతకంటే ఎక్కువ కట్టేవారి నుంచి రూ.120 చొప్పున వసూలు చేసేలా ఐదు శ్లాబ్‌లుగా విభజించారు. దీనివల్ల ప్రజల నుంచి వ్యతిరేకత కూడా రాదన్నది అధికారుల భావన. 

నెలకు రూ.3.82 కోట్లు యూజర్‌ చార్జీలు వసూలుకు ప్రణాళిక

జీవీఎంసీ పరిధిలో రెసిడెన్షియల్‌ కేటగిరీలో 5,87,612 అసెస్‌మెంట్లు ఉన్నాయి. ఇవికాకుండా కమర్షియల్‌ కేటగిరీలో మరో 25,722 అసెస్‌మెంట్లు ఉన్నాయి. కొత్త విధానంలో రెసిడెన్షియల్‌ కేటగిరీలో అసెస్‌మెంట్ల నుంచి నెలకు రూ.3,82,27,960 వసూలుచేసేలా ప్రణాళికలు రచించారు. వీటిలో రూ.20 చొప్పున యూజర్‌ చార్జీలు చెల్లించే అసెస్‌మెంట్లు 89,827, రూ.50 చొప్పున చెల్లించే అసెస్‌మెంట్లు 2,01,110, రూ.60 చొప్పున చెల్లించే అసెస్‌మెంట్లు 1,19,230, రూ.110 చొప్పున చెల్లించే అసెస్‌మెంట్లు 1,07,078, రూ.120 చొప్పున చెల్లించే అసెస్‌మెంట్లు 70,367 ఉన్నాయి. దీనికి కౌన్సిల్‌ ఆమోదం తెలపడంతో సెప్టెంబరు నుంచి కొత్త విధానంలో యూజర్‌ చార్జీలను వసూలు చేయాలని ప్రజారోగ్య విభాగం అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. 


Updated Date - 2022-08-18T06:33:09+05:30 IST