చదువులు సాగేదెలా...

ABN , First Publish Date - 2022-08-31T06:15:15+05:30 IST

ఏజెన్సీ ప్రాంతంలో గల గిరిజన విద్యార్థులకు విద్యా సంస్థల్లో సరిపడా సీట్లు లేకపోవడంతో చాలామంది చదువుకు దూరం అవుతున్నారని జడ్పీ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్రతోపాటు జడ్పీటీసీ సభ్యులు, మండలాధ్యక్షులు జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో ఆందోళన వ్యక్తంచేశారు.

చదువులు సాగేదెలా...
జడ్పీ సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి బూడి ముత్యాలనాయుడు. వేదికపై చైర్‌పర్సన్‌ సుభద్ర, ప్రభుత్వ విప్‌ ధర్మశ్రీ, కలెక్టర్లు మల్లికార్జున, రవి పట్టన్‌శెట్టి


గిరిజన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా

కళాశాలలు, ఏకలవ్య, ఆశ్రమ పాఠశాలల్లో సీట్లు లేవు

‘పది’ పాసైన విద్యార్థులకు ఇంటర్‌లో సీట్లు నిల్‌

మరోవైపు డిగ్రీ కళాశాలల్లో అధ్యాపకుల కొరత

జడ్పీ సమావేశంలో మన్యం ప్రజా ప్రతినిధులు ఆందోళన

కేజీబీవీల్లో ఇంటర్‌ తరగతులకు వసతి సమస్య: ఎమ్మెల్సీ మాధవ్‌

ప్రైవేటు స్కూళ్లకు ఇప్పటికీ పాఠ్య పుస్తకాలు ఇవ్వలేదు: ఎమ్మెల్సీ కల్యాణి

అనకాపల్లి జిల్లాలో ఉపాధ్యాయుల కొరత, విలీనం సమస్యలను ప్రస్తావించిన పలువురు సభ్యులు

కేజీహెచ్‌ మార్చురీలో అక్రమ వసూళ్లపై ఎమ్మెల్యేల ఫిర్యాదు

కమిటీ వేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హామీ

అనకాపల్లి ఏరియా ఆస్పత్రిలో తీవ్రంగా వైద్యుల కొరత

ఏజెన్సీలో ఆంత్రాక్స్‌ లక్షణాలు వెలుగుచూడడంతో చైర్‌పర్సన్‌ ఆందోళన


విశాఖపట్నం, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి):

ఏజెన్సీ ప్రాంతంలో గల గిరిజన విద్యార్థులకు విద్యా సంస్థల్లో సరిపడా సీట్లు లేకపోవడంతో చాలామంది చదువుకు దూరం అవుతున్నారని జడ్పీ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్రతోపాటు జడ్పీటీసీ సభ్యులు, మండలాధ్యక్షులు జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో ఆందోళన వ్యక్తంచేశారు. మంగళవారం చైర్‌పర్సన్‌ సుభద్ర అధ్యక్షతన జడ్పీ సర్వసభ్య సమావేశం వాడీవేడిగా సాగింది. విద్య, వైద్యం, పంచాయతీరాజ్‌, డ్వామా, గ్రామీణ నీటి సరఫరా శాఖల్లో పథకాల అమలు, అధికారుల పనితీరుపై చర్చ జరిగింది. అధికారులు తమకు కనీస మర్యాద ఇవ్వడం లేదంటూ అధికార పార్టీ సభ్యులు ధ్వజమెత్తారు. విద్యా శాఖపై చర్చలో భాగంగా చింతపల్లి, అనంతగిరి, పెదబయలు, హుకుంపేట, కొయ్యూరు జడ్పీటీసీ సభ్యులు పి.బాలయ్య, గంగరాజు, కూడా బొంజిబాబు, రేగ మత్స్యలింగం, వారా నూకరాజు మాట్లాడుతూ...పాడేరు, అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గాల్లో గిరిజన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా కళాశాలలు, ఏకలవ్య పాఠశాలలు, గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో సీట్లు లేవని అన్నారు. ఈ ఏడాది పదో తరగతి ఉత్తీర్ణులైనవిద్యార్థులు ఇంటర్‌ చదివేందుకు సరిపడా సీట్లు లేవని ఆందోళన వ్యక్తంచేశారు. రోజూ పలువురు విద్యార్థులు తమ వద్దకు వచ్చి ఇంటర్‌లో ప్రవేశం కల్పించాలని కోరుతున్నారని చెప్పారు. ఏకలవ్య పాఠశాలల్లో ఆరో తరగతిలో పిల్లలను చేర్చేందుకు తల్లిదండ్రులు సీట్లు అడుగుతున్నారని, ప్రిన్సిపాళ్లకు అడిగితే సీట్లు లేవని చెబుతున్నారని అన్నారు. గిరిజన విద్యార్థులు మైదాన ప్రాంతానికి వెళ్లి ప్రైవేటు కళాశాలల్లో చదివే స్థోమత లేదని వాపోయారు. డిగ్రీ కళాశాలల్లో అధ్యాపకుల కొరత తీవ్రంగా ఉందని, విద్యార్థులు రోజూ కాలేజీలకు వెళ్లి హాజరువేయించుకుని ఇళ్లకు తిరిగి వెళ్లిపోతున్నారని చెప్పారు. సభ్యుల ఆవేదనతో చైర్‌పర్సన్‌ సుభద్ర, పాడేరు ఎమ్మెల్యే కె.భాగ్యలక్ష్మి కూడా ఏకీభవించారు. నాడు-నేడు కింద తమ మండలంలోని పాఠశాలల్లో చేపట్టిన పనుల్లో అక్రమాలు జరిగాయని హుకుంపేట జడ్పీటీసీ సభ్యుడు మత్స్యలింగం ఫిర్యాదు చేయగా, విచారించి చర్యలు తీసుకుంటామని అల్లూరి జిల్లా విద్యా శాఖాధికారి డాక్టరు రమేశ్‌ బదులిచ్చారు.

శాసన మండలి సభ్యుడు పీవీఎన్‌ మాధవ్‌ మాట్లాడుతూ, కస్తూర్బాగాంఽధీ బాలికా విద్యాలయాల్లో ఇంటర్మీడియట్‌ కోర్సులు ప్రవేశపెట్టిన ప్రభుత్వం, తరగతుల నిర్వహణకు అవసరమైన భవనాలను సమకూర్చ లేదని అన్నారు. కేజీబీవీల్లో సీఆర్‌టీల బదిలీల్లో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. సీఆర్‌టీలకు మినిమమ్‌ టైమ్‌స్కేల్‌ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మాట్లాడుతూ, సెప్టెంబరు నెల వచ్చినా ప్రైవేటు పాఠశాలలకు పాఠ్య పుస్తకాలు సరఫరా కాలేదని అసంతృప్తి వ్యక్తంచేశారు. విశాఖ డీఈవో చంద్రకళ బదులిస్తూ జిల్లాలోని ప్రైవేటు పాఠశాలలకు ఇంకా 1.9 లక్షల పాఠ్య పుస్తకాలు సరఫరా చేయాల్సి ఉందని చెప్పారు. 

అనకాపల్లి జిల్లాలో..

కోటవురట్ల జడ్పీటీసీ సభ్యురాలు సిద్ధాబత్తుల ఉమాదేవి మాట్లాడుతూ, కోటవురట్ల ఉన్నత పాఠశాలలో టీచర్ల కొరత ఉందని, కైలాసపట్నం పాఠశాలలో పూర్తిస్థాయిలో టీచర్లు లేకపోవడంతో 13 మంది విద్యార్థులు టీసీలు తీసుకుని ప్రైవేటు స్కూళ్లకు వెళ్లిపోయారని చెప్పారు. ఆ పాఠశాలల్లో పరిస్థితిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అనకాపల్లి డీఈవో బి.లింగేశ్వరరెడ్డిని కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి ఆదేశించారు. నర్సీపట్నం జడ్పీటీసీ సభ్యురాలు సుకల రమణమ్మ మాట్లాడుతూ, ప్రాథమిక పాఠశాలల నుంచి కొన్ని తరగతులను కిలోమీటరు దూరంలోని ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడంతో అనేక గ్రామాల్లో పిల్లల చదువుపై ప్రతికూల ప్రభావం చూపిందని, భవిష్యత్తులో మూడు కి.మీ.ల పరిధిలోని పాఠశాలల విలీన ప్రతిపాదనను విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. రోలుగుంట జడ్పీ ఉన్నత పాఠశాలల మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ బాగోలేదని జడ్పీటీసీ సభ్యురాలు పోతల రమణమ్మ ఫిర్యాదు చేశారు. పరవాడ జడ్పీటీసీ సభ్యుడు పైల సన్యాసిరాజు మాట్లాడుతూ, పాఠశాలల్లో నాడు-నేడు పనులకు నేరుగా ఇసుక సరఫరా చేయకుండా అక్కడక్కడా స్టాకు పాయింట్లు ఏర్పాటుచేయడం సరైన నిర్ణయం కాదని అన్నారు. 

కేజీహెచ్‌ మార్చురీలో అక్రమ వసూళ్లు

వైద్య, ఆరోగ్య శాఖపై చర్చలో భాగంగా ఎలమంచిలి, భీమిలి ఎమ్మెల్యేలు యూవీ రమణమూర్తిరాజు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, మునగపాక, పరవాడ జడ్పీటీసీ సభ్యులు పెంటకోట సత్యనారాయణ, పైలా సన్యాసిరాజు మాట్లాడుతూ, కేజీహెచ్‌ మార్చురీలో పోస్టు మార్టం చేసే సిబ్బంది వైద్యుల పేరిట డబ్బులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీనికి విశాఖ కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున స్పందిస్తూ సూపరింటెండెంట్‌ నేతృత్వంలో కమిటీని ఏర్పాటుచేసి రెండు రోజుల్లో నివేదిక రప్పిస్తామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. పద్మనాభం మండలం రేవిడి పీహెచ్‌సీలో ‘బర్త్‌ వెయిటింగ్‌ హాలు’ నిర్మాణంలో జాప్యంపై ఎమ్మెల్యే ముత్తంశెట్టి, ఎంపీపీ కె.రాంబాబు అసంతృప్తి వ్యక్తంచేయగా కలెక్టర్‌ జోక్యం చేసుకుని నిర్మాణానికి నిధులు ఇస్తానని హామీ ఇచ్చారు. రేవిడి పీహెచ్‌సీలో సాయంత్రం నాలుగు గంటల తరువాత డాక్టర్‌ అందుబాటులో వుండడం లేదని ఎంపీపీ ఫిర్యాదు చేశారు. 

అనకాపల్లి ఎంపీపీ గొర్లె సూరిబాబు మాట్లాడుతూ, అనకాపల్లి ఏరియా ఆస్పత్రిలో వైద్యుల కొరత తీవ్రంగా వుందని ఆందోళన చేశారు. కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి స్పందిస్తూ, త్వరలో కొంతమంది వైద్యులను నియమిస్తామన్నారు. నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో నిధుల కొరతతో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిలిపివేశారని జడ్పీటీసీ సభ్యురాలు రమణమ్మ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. గొలుగొండ మండలం చీడిగుమ్మల పీహెచ్‌సీలో వైద్య సేవలు ప్రారంభించాలని జడ్పీటీసీ సభ్యుడు సుర్ల వెంకట గిరిబాబు కోరారు. ఏజెన్సీలో ఆంత్రాక్స్‌ కేసులు నమోదు కావడంపై చైర్‌పర్సన్‌ సుభద్రతోపాటు పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తంచేశారు.  మండల కేంద్రాల్లో సదరం క్యాంపులు నిర్వహించాలని ఎమ్మెల్యే భాగ్యలక్షి కోరారు. ఆస్పత్రుల్లో కుక్కకాటు నివారణ (యాంటీ రేబిస్‌) ఇంజెక్షన్లు లేవని గవర కార్పొరేషన్‌ చైర్మన్‌ బొడ్డేడ ప్రసాద్‌ చెప్పగా, ఎక్కడెక్కడ లేవో చెబితే మందులు సరఫరా చేస్తామని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు హామీ ఇచ్చారు. విమ్స్‌లో త్వరలో క్యాథలాబ్‌ ఏర్పాటుచేస్తామని ఎమ్మెల్యే మాధవ్‌ అడిగిన ప్రశ్నకు కలెక్టర్‌ మల్లికార్జున బదులిచ్చారు. కేవలం నాలుగు మండలాలే వున్న విశాఖలో కాకుండా అనకాపల్లిలో జడ్పీ సమావేశం నిర్వహించాలని ఎమ్మెల్యే రమణమూర్తిరాజు సూచించగా, నిబంధనల ప్రకారం ప్రస్తుత జడ్పీ పాలకవర్గం పదవీకాలం ముగిసే వరకు సమావేశాలను విశాఖలోనే నిర్వహించాల్సి వుంటుందని కలెక్టర్‌ మల్లికార్జున వివరణ ఇచ్చారు. సమావేశంలో ప్రభుత్వ విప్‌ కరణం ధర్మశ్రీ, అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ, అల్లూరి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ జె.శివశ్రీనివాస్‌, జడ్పీ ఇన్‌చార్జి సీఈవో సత్యనారాయణ, పలువురు సభ్యులు పాల్గొన్నారు.


మాకు కనీస గౌరవం ఇవ్వరా?

ఎంపీపీ కార్యాలయాల్లో కూర్చోడానికి కుర్చీ లేదు

ఫోన్లు చేస్తే అధికారులు స్పందించరు

ఎన్నికై పది నెలలైనా గౌరవ వేతనం ఇవ్వలేదు

జడ్పీటీసీ సభ్యులు ఆవేదన

ప్రొటోకాల్‌ అమలు చేయాలని మంత్రి ముత్యాలనాయుడు... కలెక్టర్లకు ఆదేశం


విశాఖపట్నం, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి):

తమ హక్కులు, గౌరవంపై జిల్లా పరిషత్‌ ప్రాదేశిక సభ్యులు (జడ్పీటీసీ) మరోసారి గళం విప్పారు. సుమారు 50 వేల మంది ఓటర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న తమకు కనీస గౌరవం ఇవ్వండి అని ప్రాధేయపడాల్సి వస్తున్నదని తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. మంగళవారం చైర్‌పర్సన్‌ సుభద్ర అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో బుచ్చెయ్యపేట సభ్యుడు దొండా రాంబాబు మాట్లాడుతూ, ప్రతి సర్వసభ్య సమావేశంలో తమ హక్కుల గురించి ప్రస్తావిస్తున్నా ఎవరూ పట్టించుకోవడంలేదని అన్నారు. మండల పరిషత్‌ కార్యాలయంలో కూర్చోడానికి కనీసం కుర్చీలేదు, మండల సమావేశాల్లో వేదికపైకి ఆహ్వానించడంలేదు వాపోయారు. ప్రజల సమస్యలపై ఫోన్లు చేస్తే కొందరు అధికారులు స్పందించడం లేదని, జిల్లా సహకార అధికారి అయితే మేసేజ్‌కు తిరుగు సమాధానం ఇవ్వడంలేదని ఆరోపించారు. ఎన్నికై పది నెలలు అయినా గౌరవ వేతనాలు, మండల కార్యాలయాల్లో చాంబర్ల గురించి ఎవరూ పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సహచర జడ్పీటీసీ సభ్యులు ఆయనకు మద్దతు పలుకుతూ బల్లలు చరిచారు. భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి మాట్లాడుతూ, మండలాల్లో తప్పనిసరిగా ప్రొటోకాల్‌ పాటించాలని అధికారులకు సూచించారు.  ఎలమంచిలి ఎమ్మెల్యే రమణమూర్తిరాజు మాట్లాడుతూ, జడ్పీటీసీ సభ్యులకు మండల సమావేశంలో తగు మర్యాద, గౌరవం ఇవ్వాలన్నారు. నర్సీపట్నం జడ్పీటీసీ సభ్యురాలు సుకల రమణమ్మ మాట్లాడుతూ, ఇంతవరకు ఒక్క నెల గౌరవ వేతనం కూడా ఇవ్వలేదని, మండల కార్యాలయాల్లో హీనంగా చూస్తున్నారని ఆవేదన చేశారు. చైర్‌పర్సన్‌ సుభద్ర జోక్యంచేసుకుని మూడు నెలల గౌరవవేతనం మంజూరైందని, త్వరలో సభ్యుల ఖాతాలకు జమ అవుతుందన్నారు. ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ, జడ్పీటీసీ సభ్యులకు ప్రొటోకాల్‌ అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని మూడు జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. నాడు-నేడు పనుల శిలాఫలకంపై తప్పనిసరిగా జడ్పీటీసీ సభ్యుల పేర్లు ఉండాలని స్పష్టం చేశారు. కొత్త పనులకు నిధుల్లేవ్‌

చేతులెత్తేసిన మంత్రి ‘బూడి’

ఇప్పటికే చేపట్టినవాటికి బిల్లులు మంజూరు కాలేదు

మూడేళ్లనాడు చేపట్టిన భవనాలే ఇంకా పూర్తవ్వలేదు

జల్‌ జీవన్‌ మిషన్‌పై చర్చలో టీడీపీ సభ్యురాలిపై మంత్రి అసహనంవిశాఖపట్నం, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి):

ఉపాధి హామీ పథకంలో మెటీరియల్‌ కాంపోనెంట్‌ కింద కొత్తగా పనులు మంజూరు చేయలేమని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు చేతులెత్తేశారు. మూడేళ్ల క్రితం చేపట్టిన సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్‌నెస్‌ సెంటర్లు, అంగన్‌వాడీ కేంద్రాల భవన నిర్మాణాలు ఇంకా పూర్తికాలేదని, ఇటువంటి సమయంలో కొత్తగా పనులు మంజూరు చేయలేమని స్పష్టం చేశారు. జడ్పీ సమావేశంలో ఉపాధి పనులపై జరిగిన చర్చలో ఎలమంచిలి ఎమ్మెల్యే రమణమూర్తిరాజు... తన నియోజకవర్గంలో కొత్తగా 16 గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయని, వీటిని భవనాలు మంజూరు చేయాలని కోరగా మంత్రి పై విధంగా స్పందించారు. ఇప్పటికే పనులు చేపట్టిన భవనాలకు బిల్లుల మంజూరులో ఇబ్బందులు ఉన్నాయని మంత్రి అన్నారు. ఉపాధి కూలీలకు నాలుగు నెలల నుంచి కూలి డబ్బులు మంజూరు కాలేదని, ఇలా అయితే నిరుపేదలు ఎలా బతుకుతారని ఎమ్మెల్యే రమణమూర్తిరాజు అనగా.. డ్వామా పీడీ సందీప్‌ మాట్లాడుతూ, రెండు నెలల నుంచి బిల్లులు పెండింగ్‌లో వున్నాయని వివరణ ఇచ్చారు.

టీడీపీ సభ్యురాలిపై మంత్రి అసహనం

గ్రామీణ నీటి సరఫరా విభాగంపై చర్చ సందర్భంగా నర్సీపట్నం సభ్యురాలు రమణమ్మ మాట్లాడుతూ, జల్‌ జీవన్‌ మిషన్‌లో భాగం ప్రతి ఇంటికి కొళాయి వేస్తున్నారని, అయితే గ్రామాల్లో నీటి ట్యాంకుల నిల్వ సామర్థ్యం తక్కువగా వుందని అన్నారు. దీంతో మంత్రి ముత్యాలనాయుడు అసహనం వ్యక్తం చేస్తూ.. గత ప్రభుత్వంలో జల్‌ జీవన్‌ మిషన్‌ పథకం ప్రారంభమైందని, చంద్రబాబు ఇంటింటికి కొళాయి ఇవ్వకపోతే జగన్మోహనరెడ్డి వచ్చిన తరువాత పనులు చేపట్టామని, తరువాత గ్రామాల్లోని ఓవర్‌ హెడ్‌ ట్యాంకుల్లో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుతామన్నారు. రమణమ్మ మళ్లీ మాట్లాడేందుకు ప్రయత్నించగా మంత్రి అవకాశం ఇవ్వలేదు. Read more