లక్ష్మీపురం రహదారిలో కారు బీభత్సం
ABN , First Publish Date - 2022-02-15T06:08:00+05:30 IST
లక్ష్మీపురం రహదారిలో సోమవారం మధ్యాహ్నం ఓ కారు బీభత్సం సృష్టించింది. ఇరుకు రోడ్డులో అతి వేగంగా వచ్చిన కారు, అదుపు తప్పి రహదారి పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొట్టింది.
ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొట్టడంతో విరిగిన స్తంభం
తప్పిన పెను ప్రమాదం.. పరుగులు తీసిన జనం
చోడవరం, ఫిబ్రవరి 14: లక్ష్మీపురం రహదారిలో సోమవారం మధ్యాహ్నం ఓ కారు బీభత్సం సృష్టించింది. ఇరుకు రోడ్డులో అతి వేగంగా వచ్చిన కారు, అదుపు తప్పి రహదారి పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొట్టింది. ఈ ధాటికి ట్రాన్స్‌ఫార్మర్‌కు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభం వైర్లు తెగిపోయి విరిగిపోయింది. ప్రమాదం జరిగిన స్థలానికి 20 మీటర్ల దూరంలోనే ప్రైవేటు పాఠశాల ఉంది. విద్యార్థులు అప్పుడే మధ్యాహ్న భోజనాల కోసం బయటకు వస్తున్నారు. మరోవైపు అదే మార్గంలో స్థానికులు అటూఇటూ తిరుగుతున్నారు. ఇంత రద్దీగా ఉన్న సమయంలో కారు ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొనడంతో వారంతా భయబ్రాంతులకు గురయ్యారు. అదృష్టవశాత్తూ ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. కారు నడుపుతున్న యువకుడి గురించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో యువకుడిని స్టేషన్‌కు పిలిపించి విచారిస్తున్నారు. కాగా ప్రమాదంలో కరెంటు స్తంభం ఒరిగిపోయి తీగలు తెగిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.