Supreme Court Amaravathi: వెనక్కి వెళ్లలేరు!

ABN , First Publish Date - 2022-11-29T03:10:28+05:30 IST

అమరావతే ఏకైక రాజధాని’ అని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై పూర్తిస్థాయిలో స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది

Supreme Court  Amaravathi:  వెనక్కి వెళ్లలేరు!

రాజధాని అమరావతిపై సుప్రీం మాట

రైతులతో చట్టబద్ధమైన ఒప్పందం.. అమరావతిపై ఇప్పటికే ప్రజాధనం వ్యయం

రాజ్యాంగం, నైతికత, ప్రజా విశ్వాసం దృష్ట్యా చూస్తే వెనక్కి వెళ్లడాన్ని అనుమతించరాదు

హైకోర్టు టౌన్‌ప్లానర్‌, ఇంజనీర్‌గా మారొద్దు.. 6 నెలల్లో రాజధాని నిర్మాణం ఎలా సాధ్యం?

హైకోర్టు తీర్పుపై విచారణకు నిర్ణయం.. తదుపరి విచారణ జనవరి 31కి వాయిదా

అమరావతిలో కేంద్ర ప్రభుత్వ నిధులు కలిపి దాదాపు రూ.15వేల కోట్లు ఇప్పటికే ఖర్చు చేశారు. చట్టబద్ధమైన ఒప్పందం ప్రకారం 29వేల మంది రైతులు రెండెకరాలలోపు భూమిని రాజధాని కోసం ఇచ్చారు. రైతులకు అభివృద్ధి చేసిన స్థలాలు ఇస్తామన్నది ప్రభుత్వ హామీ. అమరావతిలో చాలా పెట్టుబడులు పెట్టారు! సీఆర్డీయేలో కొన్ని నిబంధనలు ఉన్నాయి. భూములిచ్చిన రైతులతో చట్టబద్ధమైన ఒప్పందం కుదుర్చుకున్నారు. దానిపై నిధులు వెచ్చించారు. ప్రజాధనం, ప్రజా విశ్వాసం, రాజ్యాంగం, నైతికత వంటి వాటిని కలిసికట్టుగా పరిశీలిస్తే ప్రభుత్వం వెనక్కి వెళ్లడాన్ని అనుమతించకూడదు!

- జస్టిస్‌ జోసెఫ్‌

ఒకే ప్రాంతంపై దృష్టి పెట్టడం కాకుండా ఇప్పుడు దేశానికి అనేక నగరాలు అవసరం. ఎక్కువ సంఖ్యలో పట్టణ కేంద్రాలు ఉంటే బాగుంటుంది. కాబట్టి... రాష్ట్ర రాజధాని ఎక్కడ ఉండాలన్నది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించాలి. హైకోర్టు తన పరిధి దాటింది. హైకోర్టు ఎగ్జిక్యూటివ్‌ కారాదు! రాజధాని ఏర్పాటు, పట్టణంగా తీర్చిదిద్దడం వేర్వేరు అంశాలు. ఇప్పుడు హైకోర్టు టౌన్‌ ప్లానర్‌గా, చీఫ్‌ ఇంజనీర్‌గా మారడం సబబేనా? కోర్టులకు ఈ విషయాల్లో నైపుణ్యం లేదు. అయినా... రెండు నెలల్లో అది చేయండి... ఇది చేయండి అంటే ఎలా? రెండు నెలల్లో డ్రాయింగ్‌ కూడా చేయలేరు. మొత్తం పట్టణాన్ని ఆరు నెలల్లో అభివృద్ధి చేయాలని హైకోర్టు అంటోంది. ఎగ్జిక్యూటివ్‌ అధికారాలను హైకోర్టు ఊహించుకొని ఇలా ఉత్తర్వులు జారీ చేయవచ్చా?

- జస్టిస్‌ నాగరత్న

న్యూఢిల్లీ, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): ‘అమరావతే ఏకైక రాజధాని’ అని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై పూర్తిస్థాయిలో స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ‘‘సీఆర్డీయేలో కొన్ని నిబంధనలు ఉన్నాయి. భూములిచ్చిన రైతులతో చట్టబద్ధమైన ఒప్పందం కుదుర్చుకున్నారు. దానిపై నిధులు వెచ్చించారు. ప్రజాధనం, ప్రజా విశ్వాసం, రాజ్యాంగం, నైతికత వంటి వాటిని కలిసికట్టుగా పరిశీలిస్తే ప్రభుత్వం వెనక్కి వెళ్లడాన్ని అనుమతించకూడదు’’ అని అభిప్రాయపడింది. రాజధానిపై చట్టం చేసే అధికారం రాష్ట్ర అసెంబ్లీకి లేదనడంతోపాటు అనేక కీలకాంశాలతో హైకోర్టు ఇచ్చిన తీర్పులో... అమరావతి నిర్మాణం, వివిధ పనుల పూర్తికి హైకోర్టు నిర్దిష్ట గడువులు విధించడాన్ని మాత్రం తీవ్రంగా తప్పుపట్టింది. హైకోర్టు ఉత్తర్వుల్లో ఈ గడువులకు సంబంధించిన ఐదు అంశాలను నిలిపివేస్తూ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. అమరావతి అంశం- హైకోర్టు తీర్పును పరిశీలించాల్సి ఉందంటూ తదుపరి విచారణను జనవరి 31వ తేదీకి వాయిదా వేసింది. కేంద్ర ప్రభుత్వంతోపాటు సంబంధిత పక్షాలకు నోటీసులు జారీ చేసింది. అమరావతిపై ఈ ఏడాది మార్చి 3వ తేదీన హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ కేఎం జోసెఫ్‌, జస్టిస్‌ బీవీ నాగరత్నతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది.

‘మూడు’ ముగిసింది...

సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున మాజీ అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ వాదనలు వినిపించారు. ‘‘మూడు రాజధాల ఏర్పాటుకు రాష్ట్ర అసెంబ్లీ వికేంద్రీకరణ చట్టాన్ని ఆమోదించింది. అయితే... హైకోర్టులో దీనిపై విచారణ జరుగుతుండగానే ప్రభుత్వం ఆ చట్టాన్ని ఉపసంహరించుకుంది. ఆ చట్టం ఉనికిలోనే లేదు. మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకున్న తర్వాత... అసెంబ్లీ ఏం చేస్తుందనే అంశంపై వేచి చూడాల్సింది. మళ్లీ చట్టం చేస్తే అప్పుడు సవాలు చేయాల్సింది. కానీ... హైకోర్టు మాత్రం ప్రతి అంశంపైనా విచారణ జరిపి కేసును నిర్ణయించించడం వింతగా ఉంది’’ అని తెలిపారు. ముగిసిన అధ్యయంలో జోక్యం చేసుకోవడం సరికాదని కేకే వేణుగోపాల్‌ పేర్కొన్నారు. శాసన వ్యవస్థలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోరాదని తెలిపారు. ‘‘రాజధానిపై రాష్ట్రానికి శాసనాధికారం లేదంటూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పార్లమెంటు మాత్రమే చట్టం చేయాలనడం సరికాదు. ఇది తప్పు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 154లోని అధికారాలను ఉపయోగించి హిమాచల్‌ ప్రదేశ్‌ తన రెండో రాజధానిగా ధర్మశాలను ఏర్పాటు చేసుకుంది. శాసన, ప్రభుత్వ కార్యకలాపాలను ఎక్కడి నుంచి సాగించాలో నిర్ణయించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. హైకోర్టు కార్యకలాపాలకు రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుందని రాజ్యాంగం చెబుతుంది’’ అని కేకే వేణుగోపాల్‌ వివరించారు. అయినప్పటికీ... అలాంటి అధికారాలేవీ రాష్ట్రానికి లేవని హైకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. హైకోర్టు తీర్పులోని ఆదేశాలను వేణుగోపాల్‌ చదివి వినిపించారు.

ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంది. అమరావతిలో కేంద్ర ప్రభుత్వ నిధులు కలిపి దాదాపు రూ.15వేల కోట్లు ఇప్పటికే ఖర్చు చేశారని గుర్తు చేశారు. హైకోర్టు ఏర్పాటుకు 2018లో రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ అయ్యాయని తెలిపారు. ఇప్పుడేమో... దానికి వ్యతిరేకంగా హైకోర్టును కర్నూలుకు హైకోర్టును తరలించాలని మీరు అనుకుంటున్నారని ధర్మాసనం పేర్కొంది. దీంతో... ‘‘హైకోర్టును తరలించే అంశం ముగిసింది’’ అని వేణుగోపాల్‌ బదులిచ్చారు. హైకోర్టు అమరావతిలోనే ఉండాలని ఉత్తర్వులు జారీ చేసినందున... న్యాయమూర్తులు, సిబ్బందికి నివాస వసతిని ప్రభుత్వం కల్పించిందన్నారు. అసలు హైకోర్టు ఎక్కడ ఉంటుందని ధర్మాసనం ప్రశ్నించగా... హైకోర్టు అమరావతిలోనే ఉంటుందని వేణుగోపాల్‌ స్పష్టంగా వెల్లడించారు. 2018లోనే రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ అయ్యాయని ప్రస్తావించారు. అలాగే... హైకోర్టు జారీ చేసిన మ్యాండమస్‌ ఇలా కొనసాగరాదని అన్నారు. హైకోర్టు జారీ చేసిన ఏడు ఆదేశాలపై ప్రభుత్వ అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్న ధర్మాసనం.... ఏయే ఆదేశాలపై స్టే కోరుతున్నారని ప్రశ్నించింది. అలాగే... మొత్తం తీర్పుపై స్టే అడగరని ఆశిస్తున్నామని కూడా పేర్కొంది. గడువుకు సంబంధించిన అంశాలపై మాత్రమే స్టే ఇస్తూ... విచారణను వాయిదా వేసింది.

ధర్మాసనం ప్రశ్న... ప్రభుత్వ సమాధానం

దర్మాసనం: రాజధానిని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఎక్కడికి తరలించాలనుకుంటోంది!

సమాధానం: మూడు రాజధానుల కోసం చట్టాన్ని తీసుకొచ్చాం.

ధర్మాసనం: ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టే కార్యనిర్వాహక (ఎగ్జిక్యూటివ్‌) వ్యవస్థలా వ్యవహరిస్తోందా?

సమాధానం: అవును.

ధర్మాసనం: రాజధానికి భూములిచ్చిన రైతులు, ఒప్పందంలో పేర్కొన్న వారి హక్కుల పరిస్థితి ఏమిటి?

సమాధానం: సీఆర్డీయే చట్టం ప్రకారం అమరావతి రాజధాని. ఇప్పటికీ అమరావతే రాజధాని. ఒప్పందాన్ని ఉల్లంఘించలేదు.

ధర్మాసనం: చట్టబద్ధమైన ఒప్పందం గురించి ఏం చెబుతారు?

సమాధానం: కేవలం ఇన్ని నిధులు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకోడానికి చట్టం చేయాల్సిన అవసరం లేదు. రాజధాని ఏర్పాటుకు ఎక్కడా చట్టం లేదు. 1965లో చట్టాల ద్వారా రాష్ట్రాలను విభజించారు. ఎక్కడా రాజధాని ప్రస్తావనే లేదు. నిపుణుల కమిటీ సూచన మేరకు రాష్ట్ర రాజధాని ఉండాలని ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర విభజన చట్టంలో ఉంది.

ధర్మాసనం: రైతుల హక్కుల పరిస్థితి ఏంటి?

సమాధానం: అమరావతిని రాజధానిగా తొలగించలేదు. మూడు రాజధానుల్లో అదొకటిగా ఉంటుంది. ల్యాండ్‌ పూలింగ్‌ పథకంలో పేర్కొన్న ప్రయోజనాలకు మించిన లబ్ధిని వికేంద్రీకరణ చట్టంలో పొందుపరిచాం. రైతులకు నష్టం జరగదు. 29 వేల మంది రైతులు భూములు ఇచ్చారన్న కారణంగా రాష్ట్రంలోని 7 కోట్ల ప్రజలపై ప్రభావం పడరాదు.

ధర్మాసనం: రైతుల ప్రయోజనాలు ఎలా కాపాడుతారు? రైతులకు ఏం చేస్తారు?

సమాధానం: ప్రణాళిక ప్రకారం మాస్టర్‌ప్లాన్‌ను అభివృద్ధి చేస్తాం. రైతులకు యాన్యుటీని పరిరక్షిస్తాం. రైతులకు ఇచ్చే కౌలు మొత్తాన్ని, స్థల విస్తీర్ణాన్ని పెంచాం. అమరావతిలో రూ.15 వేల కోట్లను ఖర్చు చేయలేదు. 5 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. అమరావతి అభివృద్ధికి దాదాపు రూ. 2 లక్షల కోట్లు అవసరం. దీనికి 40-50 ఏళ్ల సమయం పట్టే అవకాశముంది.

ఒకే రాజధాని... గడువుపై తీర్పు సబబే

రైతుల తరఫు వాదనలు..

సుప్రీంకోర్టులో రైతుల తరఫున సీనియర్‌ న్యాయవాది ఫాలీ ఎస్‌ నారీమన్‌ వాదనలు వినిపించారు. విభజన చట్టంలో ఒకే రాజధాని అని ఉంది కానీ, రాజధానులు అని లేదని తెలిపారు. ‘అమరావతే రాజధానిగా ఉండాలని రాష్ట్ర విభజన చట్టంలో లేదు కదా?’’ అని ధర్మాసనం ప్రశ్నించగా... అమరావతి ప్రాంతంలో రాజధాని ఉండాలని నిపుణుల కమిటీ సిఫారసు చేసిందని నారీమన్‌ చెప్పారు. రాజధాని అభివృద్ధికి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారని వివరించారు. ఈ అన్ని అంశాలపై అధ్యయనం చేస్తామని ధర్మాసనం తెలిపింది. రాజధాని రైతు పరిరక్షణ సమితి తరఫున సీనియర్‌ న్యాయవాది శ్యామ్‌ దివాన్‌ వాదనలు వినిపించారు. ‘‘ప్రభుత్వాలు వస్తాయి పోతాయి! కానీ.. ఇచ్చిన హామీలు అమలు చేయాలి. రాజధానికి భూసేకరణ చేయలేదు. భూసమీకరణ చేశారు. ఈ ప్రాజెక్టు రాష్ట్రానికే కాదు... దేశ ప్రయోజనాలకూ ఎంతో ఉపయోగపడుతుంది’’ అని వివరించారు. మే 2019 నుంచి అభివృద్ధి పనులను నిలిపివేశారని తెలిపారు. ఆ ఫొటోలను ధర్మాసనానికి సమర్పించారు. పెద్ద ఎత్తున ప్రజాధనం వృథా అయ్యిందని తెలిపారు. ‘‘అన్నీ అమలు చేస్తామంటున్న ప్రభుత్వం ఏమీ చేయడం లేదు. రాజధాని అభివృద్ధికి హైకోర్టు తక్కువ సమయం కేటాయించడాన్ని తప్పుబట్టలేం’’ అని తెలిపారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ... ‘‘ఇప్పుడు హైకోర్టు టౌన్‌ ప్లానర్‌గా, చీఫ్‌ ఇంజనీర్‌గా మారడం సబబేనా? ఎగ్జిక్యూటివ్‌ అధికారాలను ఊహించుకొని హైకోర్టు ఇలా ఉత్తర్వులు జారీ చేయవచ్చా? ’’ అని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. రాజధానికి సంబంధించి డ్రాయింగ్స్‌ ఇప్పటికే పూర్తయ్యాయని... హైకోర్టు తీర్పులో తప్పేమీ లేదని న్యాయవాదులు వాదించారు.

Updated Date - 2022-11-29T03:59:02+05:30 IST