సీఎం సభకు బస్సులు
ABN , First Publish Date - 2022-12-31T01:17:36+05:30 IST
నర్సీపట్నంలో శుక్రవారం జరిగిన ముఖ్యమంత్రి బహిరంగ సభకు ప్రజలను తరలించడానికి అనకాపల్లి ఆర్టీసీ డిపో నుంచి సగానికిపైగా బస్సులను కేటాయించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ప్రయాణికులపాట్లు
అనకాపల్లి డిపోలో మొత్తం 105 బస్సులు
వీటిల్లో 61 బస్సులు గొలుగొండ, రావికమతం మండలాలకు కేటాయింపు
కాంప్లెక్స్‌లో గంటల తరబడి నిరీక్షించిన ప్రయాణికులు
అధికారుల తీరుపై పలు వర్గాల ప్రజలు మండిపాటు
అనకాపల్లి టౌన్, డిసెంబరు 30: నర్సీపట్నంలో శుక్రవారం జరిగిన ముఖ్యమంత్రి బహిరంగ సభకు ప్రజలను తరలించడానికి అనకాపల్లి ఆర్టీసీ డిపో నుంచి సగానికిపైగా బస్సులను కేటాయించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ఉదయం నుంచి సాయంత్రం వరకు బస్సుల కోసం ప్రయాణికులు గంటల తరబడి పడిగాపులుకాశారు. అనకాపల్లి డిపోలో మొత్తం 105 బస్సులు వున్నాయి. వీటిల్లో అత్యధిక సర్వీసులు విశాఖ సిటీతోపాటు చోడవరం, మాడుగుల, ఎలమంచిలి, పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గాల ప్రయాణికులకు సేవలు అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం నర్సీపట్నంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పర్యటనతోపాటు బహిరంగ సభను కూడా ఏర్పాటు చేశారు. ఎప్పటి మాదిరిగానే సీఎం సభకు జనాన్ని తరలించడానికి అధికారులు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. అనకాపల్లి డిపో 105 బస్సులు వుండగా వీటిలో 61 బస్సులను కేటాయించారు. గొలుగొండకు 38 బస్సులు, రావికమతానికి 23 బస్సులను తెల్లవారుజామునే పంపారు. దీంతో అనకాపల్లి నుంచి విశాఖపట్నం, పాయకరావుపేట, విజయనగరం, చోడవరం, పూడిమడక, కొత్తపట్నం రూట్లలో సగానికిపైగా సర్వీసులు తగ్గిపోయాయి. పలాస, జోలాపుట్ ప్రాంతాల బస్సు సర్వీసులను రద్దు చేసినట్టు చెబుతున్నారు. దీంతో ఈ మార్గాల్లో ప్రయాణించే వారు ఆర్టీసీ కాంప్లెక్సులో గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. ఒక బస్సు వస్తే.. మూడు బస్సులకు సరిపడ జనం ఎగబడుతున్నారు. దీంతో చిన్న పిల్లలు వున్న మహిళలు, వృద్ధులు బస్సు ఎక్కడానికి చాలా ఇబ్బంది పడ్డారు. విశాఖపట్నం, పాయకరావుపేట, చోడవరం, గాజువాక, విజయనగరం మార్గాల్లో ఉన్న విద్యా సంస్థలకు అనకాపల్లి నుంచి నిత్యం వేలాది మంది విద్యార్థులు రాకపోకలు సాగిస్తుంటారు. ఇంకా చిరు వ్యాపారులు, వివిధ పనులపై వెళ్లే ప్రయాణికుల తాకిడి కూడా ఎక్కువగా ఉంటుంది. సీఎం సభకు సగానికిపైగా బస్సులను తరలించడంతో వీరంతా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆర్టీసీ కాంప్లెక్స్‌తోపాటు పట్టణంలోని బస్టాప్‌ల వద్ద చాలాసేపు నిరీక్షించాల్సి వచ్చింది. ఉదయం కళాశాలలకు వెళ్లేందుకు సమయానికి బస్సులు రాకపోవడంతో ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. కాగా ప్రయాణికులకు ముందస్తు సమాచారం లేకుండా సీఎం సభకు సగానికిపైగా బస్సులను కేటాయించడంపై పీడీటీకి చెందిన ఒక అధికారిని వివరణ కోరగా, రీజనల్ ఆఫీస్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు బస్సులను కేటాయించామని చెప్పారు.