విద్యుదాఘాతంతో బాలుడు మృతి

ABN , First Publish Date - 2022-10-14T07:05:42+05:30 IST

విద్యుత్‌ షాక్‌కు గురై బుధవారం రాత్రి ఓ బాలుడు మృతిచెందాడు. ఇందుకు సంబంధించి సీఐ వై.మురళీరావు తెలిపిన వివరాలివి.

విద్యుదాఘాతంతో బాలుడు మృతి
సింహాద్రి (ఫైల్‌)


అచ్యుతాపురం, అక్టోబరు 13 : విద్యుత్‌ షాక్‌కు గురై బుధవారం రాత్రి ఓ బాలుడు మృతిచెందాడు. ఇందుకు సంబంధించి సీఐ వై.మురళీరావు తెలిపిన వివరాలివి. కొత్త మోసయ్యపేటలో మూడో తరగతి చదువుతున్న పంచదార్ల సింహాద్రి (8) తోటి పిల్లలతో కలిసి బుధవారం రాత్రి మేడమీద అడుకుంటున్నాడు. ఇంతలో అక్కడున్న విద్యుత్‌ వైరు అతడికి తగలడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. బాలుడి తండ్రి అప్పలరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.  

మృతుడి కుటుంబానికి రూ.ఐదు లక్షల పరిహారం

 ఇదిలావుండగా ప్రమాద స్థలానికి వెళ్లిన విద్యుత్‌ శాఖ సిబ్బందిని గ్రామస్థులు అదేరోజు రాత్రి నిర్బంధించారు. కేవలం విద్యుత్‌ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే బాలుడు మరణించాడని అంతా ఆరోపించి ఆగ్రహం వ్యక్తం చేశారు.  దీంతో ఆ శాఖ ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. ప్రభుత్వ పరంగా రూ. ఐదు లక్షలు పరిహారం ఇస్తామని ఏపీఈపీడీసీఎల్‌ ఏడీఈ ఎ.రామకృష్ణ తెలిపారు. దహన ఖర్చుల నిమిత్తం మానవతా దృక్పథంలో సిబ్బంది రూ. 15వేలు ఇస్తారని చెప్పడంతో వారంతా శాంతించారు. 


వ్యక్తి అనుమానాస్పద మృతిపై కేసు నమోదు 

కశింకోట, అక్టోబర్‌ 13 : మండలంలో ఓ వ్యక్తి అనుమానాస్పద మృతిపై కేసు నమోదు చేసినట్టు కశింకోట ఏఎస్‌ఐ జక్కుల నాగేశ్వరరావు గురువారం తెలిపారు.  బయ్యవరం గ్రామానికి చెందిన ఏనుగుపల్లి సూరితల్లితో కలిసి వార నాయుడు అలియాస్‌ సంతోష్‌ (31) ఎలక్ర్టీషియన్‌గా పని చేస్తూ హౌసింగ్‌ కాలనీలో నివాసముంటున్నాడు. గురువారం తెల్లవారుజామున సోదరుడు సంతోష్‌ మృతి చెందాడని అతని చెల్లి గుడివాడ వరలక్ష్మికి ఫోన్‌లో సమాచారం అందింది. దీంతో అన్నయ్య ఉంటున్న ఇంటి మేడపైకి వెళ్లి చూసిన అనంతరం ఆమె తమకు ఫిర్యాదు చేసినట్టు ఏఎస్‌ఐ తెలిపారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించామని, అయితే సంతోష్‌ మృతికి గల కారణాలు తెలియరాలేదన్నారు.  ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.

Read more