బొర్రా గుహల సందర్శకులపై బాదుడు
ABN , First Publish Date - 2022-10-07T05:56:14+05:30 IST
బొర్రా గుహల నుంచి మరింత ఆదాయాన్ని పొందడానికి ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ(ఏపీటీడీసీ) అధికారులు మరోసారి ప్రవేశ రుసుము పెంచేశారు.
ప్రవేశ రుసుమును రూ.10 చొప్పున పెంచిన ఏపీటీడీసీ అధికారులు
పిల్లలకు రూ.60, పెద్దలకు రూ.80
15 నుంచి 20 శాతం వరకు పెరగనున్న ఆదాయం
సౌకర్యాలు మెరుగుపరచకుండా రుసుము పెంపుపై పర్యాటకులు పెదవి విరుపు
అనంతగిరి, అక్టోబరు 6: బొర్రా గుహల నుంచి మరింత ఆదాయాన్ని పొందడానికి ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ(ఏపీటీడీసీ) అధికారులు మరోసారి ప్రవేశ రుసుము పెంచేశారు. పిల్లలకు, పెద్దలకు ప్రస్తుతం వున్న చార్జీలపై రూ.10 అదనంగా వసూలు చేస్తారు. వీడియో కెమెరా రుసుమును గతంలోనే రూ.25 పెంచారు.
ఏటా లక్షలాది మంది పర్యాటకులు సందర్శించే బొర్రా గుహలను.. ఏపీటీడీసీ అధికారులు కామధేనుగా మార్చుకుంటున్నారు. ఇక్కడ కొత్తగా ఎటువంటి సౌకర్యాలు కల్పించనప్పటికీ గుహల ప్రవేశ రుముసును తరచూ పెంచుతున్నారు. మూడేళ్ల క్రితం పిల్లలకు రూ.45, పెద్దలకు రూ.60 చొప్పున టికెట్ల రేట్లు వుండేవి. 2019 ఆగస్టులో పిల్లలకు రూ.50, పెద్దలకు రూ.70కి పెంచారు. అప్పట్లో కెమెరా వున్న సెల్ ఫోన్కు రూ.25, వీడియో తీసే పెద్ద కెమెరాలకు రూ.75 చొప్పున వసూలు చేసేవారు. అయితే ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్లు వాడుతుండడంతో చార్జీల నుంచి వాటికి మినహాయింపు ఇచ్చారు. పెద్ద సైజు వీడియో కెమెరాలకు మాత్రం చార్జీని రూ.75 నుంచి రూ.100కు పెంచారు. తాజాగా పిల్లలకు రూ.60, పెద్దలకు రూ.80గా ప్రవేశ రుసుము పెంచారు. కొత్త ధరలు ఈ నెల 6వ తేదీ నుంచే అమలు చేస్తున్నారు. ప్రవేశ రుసుము పెంపుతో గుహల ఆదాయం 15 నుంచి 20 శాతం వరకు పెరుగుతుందని ఏపీటీడీసీ అధికారులు భావిస్తున్నారు. కాగా గుహల్లో ఆధునికీకరణ పనులు చేయకుండా, సందర్శకులకు సదుపాయాలు మెరుగుపరచకుండా ప్రవేశ రుసుము పెంచడం ఏమిటని పర్యాటకులు ప్రశ్నిస్తున్నారు. బొర్రా గుహల ప్రవేశ రుసుము పెంచుతున్న అధికారులు తమ వేతనాలు మాత్రం పెంచడంలేదని కార్మికులు, గైడ్లు వాపోతున్నారు.