బొర్రా గుహలు ఆదాయంలో 20 శాతం పంచాయతీకి
ABN , First Publish Date - 2022-06-28T05:40:43+05:30 IST
అనంతగిరి మండలంలోని ప్రముఖ సందర్శనీయ ప్రదేశం బొర్రా గుహలకు వచ్చే ఆదాయంలో 20 శాతం నిధులను బొర్రా పంచాయతీ అభివృద్ధికి కేటాయించాలని ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ చెప్పారు.

ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ
పాడేరు, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): అనంతగిరి మండలంలోని ప్రముఖ సందర్శనీయ ప్రదేశం బొర్రా గుహలకు వచ్చే ఆదాయంలో 20 శాతం నిధులను బొర్రా పంచాయతీ అభివృద్ధికి కేటాయించాలని ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ చెప్పారు. ఇటీవల బొర్రా గ్రామ పర్యటనలో సర్పంచ్, గ్రామస్థులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బొర్రా గుహలు అధికారులు, బొర్రా రూరల్ ఆర్గనైజేషన్ ప్రతినిధులతో సోమవారం తన కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ, బొర్రా గుహల ఆదాయానికి సంబంధించి గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి 2007లో జారీ చేసిన ఉత్తర్వులను పక్కాగా అమలు చేయాలన్నారు. ఆదాయంలో 20 శాతాన్ని పంచాయతీకి కేటాయించాలని, ఆ నిధులను పాఠశాలలు, ఆస్పత్రులు, ప్రజావసరాలకు వినియోగించాలని సూచించారు. అలాగే ఐటీడీఏ పీవో, ఎంపీడీవో, ఎంపీపీ, గ్రామాధికారులు, టూరిజం అధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేసి, కమిటీ తీర్మానంతో ఐటీడీఏ పీవో ఆమోదం తీసుకుని నిధులు వ్యయం చేయాలన్నారు. ఏపీ టూరిజం డీఎం బాబూజీ మాట్లాడుతూ, ఇప్పటివరకు రూ.25 లక్షలు బొర్రా పంచాయతీకి చెల్లించామని, ఆ నిధులతో చేపట్టిన పనులకు సంబంధించి యూసీలు సక్రమంగా సమర్పించలేదని చెప్పారు. యూసీలు రెండు రోజుల్లో అందజేయాలని పంచాయతీ అధికారులను పీవో ఆదేశించారు. ఈ సమావేశంలో ఐటీడీఏ ఏపీవో ఎం.వెంకటేశ్వరరావు, అనంతగిరి ఎంపీడీవో వి.నగేశ్, ఎంపీపీ నీలవేణి, బొర్రా గుహల మేనేజర్ గౌరీశంకరరావు, బొర్రా రూరల్ ఆర్గనేజేషన్ అధ్యక్షుడు ఆర్.రవి, ప్రతినిధులు ప్రేమ్‌కుమార్, ప్రసన్న పాల్గొన్నారు.