పీహెచ్‌సీల్లో బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి
ABN , First Publish Date - 2022-07-07T06:28:00+05:30 IST
జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, సిబ్బంది బయోమెట్రిక్ హాజరు నమోదు తప్పనిసరి అని జిల్లా వైద్యారోగ్యశాఖాధికారిణి డాక్టర్ బి.సుజాత తెలిపారు.

- డీఎంహెచ్‌వో డాక్టర్ బి.సుజాత
పాడేరు, జూలై 6(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, సిబ్బంది బయోమెట్రిక్ హాజరు నమోదు తప్పనిసరి అని జిల్లా వైద్యారోగ్యశాఖాధికారిణి డాక్టర్ బి.సుజాత తెలిపారు. మాతాశిశు సంరక్షణ, విద్యార్థుల ఆరోగ్య పరీక్షలు, సిబ్బంది పనితీరు, ఇతర అంశాలపై జిల్లాలోని అన్ని పీహెచ్‌సీలకు చెందిన సీహెచ్‌వో, హెచ్‌ఈవో, పీహెచ్ఎన్లతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. పీహెచ్‌సీల్లో శతశాతం బయోమెట్రిక్ హాజరు నమోదు కావాలన్నారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల డేటా సకాలంలో ఆన్లైన్లో నమోదు చే యాలని ఆదేశించారు. కొవిడ్ కేసులు, ఇతర కేసులకు అందిస్తున్న సేవల వివరాలను సక్రమంగా నమోదు చేయాలన్నారు. అలాగే విద్యార్థుల ఆరోగ్య సంరక్షణలో భాగంగా ప్రతి విద్యార్థికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి సూల్క్హెల్త్ యాప్‌లో నమోదు చేయాలన్నారు. రానున్న పదిహేను రోజుల్లో జిల్లాలోని అన్ని పాఠశాలల్లోని విద్యార్థులకు విధిగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ప్రతి నెలా నిర్వహించే ప్రత్యేక సమావేశానికి అందరూ విధిగా హాజరుకావాలని డీఎంహెచ్‌వో పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా క్షయ నివారణాధికారి డాక్టర్ టి.విశ్వేశ్వరనాయుడు, ఏడీఎంహెచ్‌వో డాక్టర్ కె.లీలాప్రసాద్, పీవో డీటీటీ భారతి, జిల్లా డిప్యూటీ డెమో అధికారి రవికుమార్, సీహెచ్‌వో, హెచ్‌ఈవో, పీహెచ్ఎన్లు, తదితరులు పాల్గొన్నారు.