భూ హక్కుల జారీపై ప్రత్యేక దృష్టి

ABN , First Publish Date - 2022-10-07T05:54:33+05:30 IST

భూ హక్కుల జారీ అంశంలో జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కార్యదర్శి, ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ ఆదేశించారు.

భూ హక్కుల జారీపై ప్రత్యేక దృష్టి
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌, జేసీ శివశ్రీనివాసు

- వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కార్యదర్శి ఆదేశం

పాడేరు, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): భూ హక్కుల జారీ అంశంలో జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కార్యదర్శి, ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ ఆదేశించారు. భూహక్కు- భూరక్షాపై విజయవాడ నుంచి జిల్లా కలెక్టర్లతో గురువారం సాయంత్రం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. భూహక్కు- భూరక్షా పత్రాల జారీలోని అంశాలపై కలెక్టర్లు నిశితంగా పరిశీలించాలన్నారు. అలాగే సమగ్ర భూ సర్వే పూర్తయిన గ్రామాల్లోని భూమి హక్కుదారులకు భూహక్కు- భూరక్షా పత్రాల జారీకి చర్యలు చేపడతామన్నారు. సమగ్ర సర్వే పూర్తయిన ప్రాంతాల్లో రెండు వేల గ్రామాల్లోని భూ హక్కుదారులకు నవంబరు ఒకటి లేదా రెండో తేదీన హక్కు పత్రాలు పంపిణీ చేసే అవకాశముందని చెప్పారు. జిల్లా కలెక్టర్లు తమ పరిధిలోని భూహక్కు- భూరక్షా పత్రాల జారీకి సిద్ధంగా ఉన్న పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి, ఈనెల 15 తేదీ నాటికి వాటి వివరాలను పక్కాగా తమకు తెలపాలన్నారు. అలాగే కోర్టు పరిధిలో ఉన్న అంశాలపై చేపడుతున్న చర్యలను తెలపాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ , జాయింట్‌ కలెక్టర్‌ జె.శివశ్రీనివాసు, జిల్లా రెవెన్యూ అధికారి బి.దయానిధి పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-07T05:54:33+05:30 IST