భారీ వాన.. వడగళ్లు

ABN , First Publish Date - 2022-04-19T06:09:00+05:30 IST

జిల్లాలో సోమవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. అక్కడక్కడ వడగళ్లు సైతం పడ్డాయి. వర్షం వల్ల పాడేరులో జన జీవనానికి అంతరాయం ఏర్పడింది.

భారీ వాన.. వడగళ్లు
పాడేరు మెయిన్‌రోడ్డుపై వర్షం కురుస్తున్న దృశ్యం

- జిల్లాలో మధ్యాహ్నం నుంచి కుండపోత వర్షం

- హుకుంపేటలో వడగళ్లు

- పాడేరు, చింతపల్లి, జీకే వీధిలో ఎడతెరిపి లేకుండా వాన

- రోడ్లు జలమయం

- విద్యుత్‌ సరఫరాకు తరచూ అంతరాయం


పాడేరు, ఏప్రిల్‌ 18(ఆంధ్రజ్యోతి): జిల్లాలో సోమవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. అక్కడక్కడ వడగళ్లు సైతం పడ్డాయి. వర్షం వల్ల పాడేరులో జన జీవనానికి అంతరాయం ఏర్పడింది. ఏజెన్సీలో గత ఐదు రోజులుగా మధ్యాహ్నం దాటిన తరువాత భారీ వర్షం కురవడం సాధారణమైపోయింది. సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎండ కాసి, ఆ తరువాత ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం మొదలైంది. సుమారు గంటసేపు కుండపోతగా భారీ వర్షం కురిసింది. దీంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వర్షానికి రోడ్లన్నీ జలమయం కాగా, పంట పొలాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. భారీ వర్షాలకు ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించకపోవడంతో అధికార యంత్రాంగం ఊపిరిపీల్చుకుంటున్నది.


హుకుంపేటలో వడగళ్ల వాన 

హుకుంపేట: మండలంలో సోమవారం మధ్యాహ్నం వడగళ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సాధారణంగానే ఎండ కాసింది. కానీ ఒంటి గంట తరువాత నుంచి మూడు గంటల వరకు వడగళ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి రోడ్డన్నీ జలమయంకాగా, గెడ్డలు, వాగులు పొంగి ప్రవహించాయి. గత మూడు రోజులుగా వర్షం కురుస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 

చింతపల్లిలో..

చింతపల్లి: మండలంలో సోమవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు పలు చోట్ల కుండపోత వర్షం కురిసింది. దీంతో ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు వర్షపునీటితో నిండిపోయాయి. వర్షం కురవడంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. అయితే ప్రస్తుతం కురుస్తున్న తొలకరి వర్షాలు కాఫీ పూతకు, వేసవి దుక్కులకు దోహదపడతాయని పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

గూడెంకొత్తవీధిలో..

గూడెంకొత్తవీధి: మండలంలో సోమవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఎడతెరిపి లేకుండా ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండకాయగా, మధ్యాహ్నం నుంచి వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

Updated Date - 2022-04-19T06:09:00+05:30 IST