బాలికపై అత్యాచారం కేసులో ముద్దాయికి పదేళ్లు జైలు

ABN , First Publish Date - 2022-10-07T05:53:20+05:30 IST

నర్సీపట్నంలో ఆరేళ్ల బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ముద్దాయికి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ విశాఖపట్నం పోక్సో కోర్టు న్యాయమూర్తి తీర్పు చెప్పినట్టు జిల్లా ఎస్పీ గౌతమిశాలి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

బాలికపై అత్యాచారం కేసులో ముద్దాయికి పదేళ్లు జైలు
ముద్దాయి సాయిరామ్‌ కిరణ్‌ (ఫైల్‌ ఫొటో)

విశాఖ పోక్సో కోర్టు న్యాయమూర్తి ఆదేశం

ఘటన జరిగిన ఐదు నెలల్లోనే తీర్పు


నర్సీపట్నం, అక్టోబరు 6: నర్సీపట్నంలో ఆరేళ్ల బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ముద్దాయికి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ విశాఖపట్నం పోక్సో కోర్టు న్యాయమూర్తి తీర్పు చెప్పినట్టు జిల్లా ఎస్పీ గౌతమిశాలి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించి వివరాలు.. 

నరీపట్నం మూడో వార్డు హరిజన వీధికి చెందిన గొంది సాయిరామ్‌ కిరణ్‌ (20) అదే వార్డుకి చెందిన ఆరేళ్ల బాలికపై ఈ ఏడాది మే 6వ తేదీన అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. అనకాపల్లి దిశా పోలీస్‌ పోలీస్‌ స్టేషన్‌ డీఎస్పీ మళ్ల మహేశ్వరరావు కేసు దర్యాప్తు చేపట్టి, వారం రోజుల్లో అభియోగపత్రాన్ని పోక్సో కోర్టులో సమర్పించారు. బాధితురాలి తరపున స్పెషల్‌ పీపీ కె.కృష్ణ వాదనలు వినిపించారు. కోర్టు 23 మంది సాక్షులను విచారించింది. వాదోపవాదాల అనంతరం పోలీసులు మోపిన అభియోగాలు వాస్తవమని నిర్ధారణ కావడంతో ముద్దాయి సాయిరామ్‌ కిరణ్‌కు పది సంవత్సరాలపాటు కఠిన కారాగారశిక్ష విధిస్తూ న్యాయమూర్తి కె.రామశ్రీనివాసరావు తీర్పు చెప్పారు.  కేసు దర్యాప్తును ఏడు రోజుల్లో పూర్తి చేసి, బలమైన ఆధారాలతో ఛార్జిషీట్‌ దాఖలు చేసిన సీఐ మహేశ్వరావుని జిల్లా ఎస్పీ అభినందించారు.


Updated Date - 2022-10-07T05:53:20+05:30 IST