హత్యోదంతం.. వైసీపీకి ‘అనంత’ నష్టం!

ABN , First Publish Date - 2022-05-24T05:41:07+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రంపచోడవరం ప్రాంతానికి చెందిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ కారు డ్రైవర్‌ అయిన దళిత వ్యక్తి హత్యోదంతం అల్లూరి సీతారామరాజు జిల్లాలోని వైసీపీ శ్రేణుల్లో గుబులు రేపింది.

హత్యోదంతం..  వైసీపీకి ‘అనంత’ నష్టం!

  • మాజీ డ్రైవర్‌ అయిన దళిత వ్యక్తి హత్యలో 
  • వైసీపీ ఎమ్మెల్సీ పాత్రపై పార్టీ శ్రేణుల్లో గుబులు
  • దళితులు, గిరిజనులు 
  • పార్టీకి దూరమవుతారేమోనని టెన్షన్‌
  • అనంతబాబు నిర్వాకంపై నోరు మెదపని పార్టీ నాయకులు
  • ప్రతిపక్షాల ఆందోళనలతో ఇరకాటంలో పడ్డ వైనం

(పాడేరు, ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రంపచోడవరం ప్రాంతానికి చెందిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ కారు డ్రైవర్‌ అయిన దళిత వ్యక్తి హత్యోదంతం అల్లూరి సీతారామరాజు జిల్లాలోని వైసీపీ శ్రేణుల్లో గుబులు రేపింది. వాస్తవానికి జిల్లాలో ఇటువంటి ఘటన జరగడం ఇదే ప్రప్రథమం. గిరిజనుల మధ్య రాజకీయంగా ఎన్ని విభేదాలున్నా.. వాటిని హత్యల వరకు తీసుకెళ్లిన దాఖలాలు లేవు. అనంతబాబు నిర్వాకంతో వైసీపీ క్యాడర్‌ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటన ప్రభావం జిల్లాలో వైసీపీపై తీవ్ర ప్రభావం చూపుతుందనే ఆందోళన వ్యక్తమవుతున్నది. సుబ్రహ్మణ్యం హత్య ఘటన ప్రభావంతో గిరిజన ప్రాంతంలో వైసీపీకి నష్టం జరిగే ప్రమాదం లేకపోలేదని పార్టీ వ్యక్తులే గుసగుసలాడుకుంటున్నారు. ఈ ఘటనపై ఏం మాట్లాడినా ప్రజల్లో చులకనవుతామనే  భావనతో జిల్లాలో వైసీపీ నేతలు తేలు కుట్టిన దొంగల్లా మిన్నకున్నారు. ఇటువంటి పరిణామాలతో పార్టీకి దళితులు, గిరిజనులు దూరమవుతారని వైసీపీలోని ద్వితీయ శ్రేణి క్యాడర్‌ ఆందోళన చెందుతున్నది.


కుటుంబ నేపథ్యమే నేర చరిత్ర

అనంతబాబు కుటుంబ నేపథ్యమే నేర చరిత్ర కలిగినదనే వాదన రంపచోడవరం ప్రాంతంతో బలంగా వినిపిస్తున్నది. ఆయన తండ్రి సైతం అప్పట్లో రంపచోడవరం డివిజన్‌ పరిధిలో మునసబుగా వ్యవహరించే కాలంలోనే అన్ని వర్గాల ప్రజలపై పెత్తనం చెలాయిస్తుండేవారని, కలప, రంగురాళ్లు అక్రమ వ్యాపారం, భూ తగాదా సెటిల్‌మెంట్లు చేయడంలో దిట్టగా చెబుతుంటారు. ఈ క్రమంలోనే ఆయన బలహీన వర్గాలకు చెందిన ఆస్తులను లాక్కోవడం, వాళ్లు తిరగబడితే హింసించడం వంటి చేసేవారని ఆ ప్రాంతీయులు చెబుతున్నారు. ఆయన అరాచకాలను తట్టుకోలేక గిరిజనులు మావోయిస్టులను ఆశ్రయించడంతో అనంతబాబు తండ్రిని మావోయిస్టులు హతమార్చారనే విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. తండ్రి వారసత్వంగా అనంతబాబు అక్రమాల బాటలోనే పయనిస్తున్నారని ఆ పార్టీలోని ఒక వర్గం వారే బహిరంగంగా చెబుతున్నారు. దీంతో ఆయనను ఎదురించే వారే రంపచోడవరం ప్రాంతంలో లేని పరిస్థితిని ఏర్పరిచారని తెలుస్తుంది.


రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా అనంతబాబు మైనింగ్‌, కలప, రంగురాళ్ల అక్రమ వ్యాపారాలకు అడ్డులేని పరిస్థితి ఏర్పరచుకున్నారనే వాదన ఉంది. అలాగే ఆయన రెండో భార్య ధనలక్ష్మిని ఎమ్మెల్యేను చేయడం, వైసీపీ అధిష్ఠానంలో సైతం పెద్దల ఆశీస్సులు ఉండడంతో అనంతబాబుకు ఎమ్మెల్సీ సైతం కట్టబెట్టారు. దీంతో రంపచోడవరం డివిజన్‌ పరిధిలో ఆయనకు తిరుగు లేకుండాపోయింది. ఇదే అదనుగా ఆయన ఇష్టారాజ్యంగా అన్ని వ్యవహారాలను కొనసాగిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. అధికార మదంతో ఉన్న ఆయన తనకు అడ్డుగా ఉన్నాడనే నెపంతోనే మాజీ డ్రైవర్‌ అయిన దళిత వ్యక్తి సుబ్రహ్మణ్యం ప్రాణాలను తీసేసి మృతదేహాన్ని తన కారులోనే తీసుకువచ్చి కుటుంబ సభ్యుల ముందు పడేశాడని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. ఇది ఎంతటి ఘోరమని జిల్లా వాసులు ముక్కున వేలేసుకుంటున్నారు.


విపక్షాల ఆందోళనతో ఇరకాటంలో వైసీపీ

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు హత్య కేసులో ప్రధాన నిందితుడు కావడంతో విపక్షాలు అటు రంపచోడవరం, ఇటు పాడేరు ప్రాంతాల్లో తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేపడుతుండడంతో వైసీపీ నేతలు ఇరకాటంలో పడ్డారు. గతంలో విపక్షాలు ఎటువంటి విమర్శలు, ఆందోళనలు చేసినా తిరగబడే వైసీపీ ఇప్పుడు  అనంతబాబు వ్యవహారంలో తప్పు తమవైపు ఉండడంతో ఆత్మరక్షణలో పడ్డారు. టీడీపీ, బీజేపీ, సీపీఎం, జనసేన పార్టీలు.. ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి. అలాగే ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, బాధిత కుటుంబానికి రూ.25 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని, మృతుని భార్యకు ప్రభుత్వ ఉద్యోగం, రెండెకరాల భూమి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నాయి.

Updated Date - 2022-05-24T05:41:07+05:30 IST