అసాంఘిక కార్యకలాపాలకు చెక్‌

ABN , First Publish Date - 2022-09-29T06:33:25+05:30 IST

పర్యాటక ప్రాంతమైన లంబసింగిలో పోలీస్‌ అవుట్‌ పోస్టు ఏర్పాటు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

అసాంఘిక కార్యకలాపాలకు చెక్‌
పోలీస్‌ అవుట్‌ పోస్టు కోసం తాజంగిలో స్థలాన్ని పరిశీలిస్తున్న రెవెన్యూ, పోలీసు అధికారులు

- పర్యాటక ప్రాంతంలో అనధికార మద్యం విక్రయాలు

- పెచ్చుమీరుతున్న మందుబాబుల ఆగడాలు

- పేరుకుపోతున్న ప్లాస్టిక్‌ వ్యర్థాలు

- ఇష్టానుసారంగా వాహనాల పార్కింగ్‌తో ట్రాఫిక్‌ కష్టాలు

- లంబసింగిలో పోలీస్‌ అవుట్‌ పోస్టుకు సన్నాహాలు

- స్థల పరిశీలన చేసిన రెవెన్యూ, పోలీసు అధికారులు

చింతపల్లి, సెప్టెంబరు 28: పర్యాటక ప్రాంతమైన లంబసింగిలో పోలీస్‌ అవుట్‌ పోస్టు ఏర్పాటు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అవుట్‌ పోస్టు ఏర్పాటుకు అవసరమైన ప్రభుత్వ స్థలాన్ని రెవెన్యూ, పోలీసు అధికారులు బుధవారం పరిశీలించారు. ఆంధ్ర కశ్మీర్‌గా గుర్తింపు పొందిన లంబసింగికి అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. గత ఐదేళ్లలో పర్యాటకుల సంఖ్య రెట్టింపు అయ్యింది. లంబసింగి పరిసర ప్రాంతాల్లో పర్యాటకుల వసతి కోసం ప్రైవేటు రిసార్ట్స్‌, టెంట్లు అందుబాటులోకి వచ్చాయి. నవంబరు నుంచి ఫిబ్రవరి వరకు లంబసింగికి పర్యాటకుల తాకిడి అధికంగా ఉంటుంది. లంబసింగి వాతావరణం శీతలంగా ఉంటుంది. దీని వల్ల మైదాన ప్రాంతాల నుంచి వస్తున్న పర్యాటకుల్లో అత్యధికులు మద్యం సేవిస్తూ విచ్చలవిడిగా డీజే సౌండ్స్‌ పెట్టుకుని ఎంజాయ్‌ చేస్తున్నారు. మద్యం సీసాలు, ప్లాస్టిక్‌ వ్యర్థాలతో  ఈ ప్రాంతం నిండిపోతోంది. స్థానికులు, మూగజీవులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తున్నది. రిసార్ట్స్‌, టెంట్లలో వ్యభిచారం కూడా జరుగుతున్నట్టు ప్రచారం జరుగుతున్నది. దీనికితోడు రోజూ లంబసింగిలో ట్రాఫిక్‌ సమస్య పెరిగిపోతోంది. పర్యాటకులు ఎక్కడబడితే అక్కడ వాహనాలను పార్క్‌ చేయడం వల్ల ట్రాఫిక్‌ సమస్య తలెత్తుతోంది. కొన్ని సందర్భాల్లో లంబసింగి జంక్షన్‌ వద్ద గంటల తరబడి పీటీడీ బస్సులు, ప్రైవేటు సర్వీసు వాహనాలు నిలిచిపోతున్నాయి. 

పోలీస్‌ స్టేషన్‌ దూరంగా ఉండడంతో..

లంబసింగి, తాజంగి, చెరువులవేనం పర్యాటక ప్రాంతాలు చింతపల్లి పోలీస్‌ స్టేషన్‌కు 18- 25 కిలో మీటర్ల దూరంలో ఉన్నాయి. టెంట్లు, రిసార్ట్స్‌పై పోలీసులు తరచూ దాడులు నిర్వహించే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో మందుబాబుల ఆగడాలు పెరిగిపోతున్నాయి. అనఽధికారిక మద్యం విక్రయాలు కూడా జరుగుతున్నాయి. పోలీసులు ప్రత్యేకంగా వెళ్లి తనిఖీలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. ట్రాఫిక్‌ సమస్యను నియంత్రించేందుకు కూడా చింతపల్లి నుంచి పోలీసులు, సీఆర్‌పీఎఫ్‌ బలగాలు లంబసింగికి ఉదయం ఐదు గంటలకు వెళ్లాల్సి వస్తోంది. దీంతో పర్యాటక ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పర్యాటక ప్రాంతాల్లో ప్రశాంత వాతావరణం కల్పించడంతో పాటు కుటుంబ సమేతంగా పర్యాటకులు వచ్చే పరిస్థితులను కల్పించే దిశగా జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌, ఎస్పీ సతీష్‌కుమార్‌ ప్రత్యేక చర్యలకు శ్రీకారం చుట్టారు. అసాంఘిక చర్యలను కట్టడి చేసేందుకు తాజంగి, లంబసింగి ప్రాంతంలో పోలీస్‌ అవుట్‌ పోస్టు ఉండాలని నిర్ణయించారు. ఈ మేరకు అవుట్‌ పోస్టు ఏర్పాటుకు అవసరమైన ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాలని చింతపల్లి రెవెన్యూ అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. దీంతో తహసీల్దార్‌ ఎల్‌ఎల్‌వీ ప్రసాద్‌, స్థానిక ఎస్‌ఐ.. లంబసింగి, తాజంగి రిజర్వాయర్‌ వద్ద అవుట్‌ పోస్టు ఏర్పాటుకు అవసరమైన నాలుగు స్థలాలను గుర్తించారు. ఈ నాలుగు స్థలాల్లో ఒకటి అవుట్‌ పోస్టుకి కేటాయిస్తామని అధికారులు తెలిపారు.

28సీటీపీ5: మాట్లాడుతున్న డీఎల్‌పీవో పీఎస్‌ కుమార్‌ 
నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు

- రిసార్ట్స్‌, టెంట్ల వద్ద మద్యం విక్రయాలు నిషేధం

- పాడేరు డీఎల్‌పీవో పీఎస్‌ కుమార్‌

చింతపల్లి: పర్యాటక ప్రాంతాల్లో నిబంధనలు అతిక్రమించే రిసార్ట్స్‌, టెంట్ల నిర్వాహకులపై శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని పాడేరు డీఎల్‌పీవో పీఎస్‌ కుమార్‌ హెచ్చరించారు. పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యమిస్తున్నట్టు ఆయన తెలిపారు. బుధవారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో పర్యాటక ప్రాంత పంచాయతీ కార్యదర్శులు, గ్రామ సచివాలయ ఉద్యోగులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవంబరు నుంచి మార్చి వరకు లంబసింగి పరిసర ప్రాంతాలకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తారన్నారు. పర్యాటకులకు మెరుగైన సదుపాయాలు కల్పిస్తూనే పర్యావరణానికి హాని కలగకుండా సచివాలయం ఉద్యోగులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఒక్కసారి ఉపయోగించి పారేసే ప్లాస్టిక్‌ వస్తువులను పూర్తిగా నిషేధించాలన్నారు. రిసార్ట్స్‌, టెంట్లు, దుకాణాల వద్ద ఈ వస్తువులను విక్రయించరాదన్నారు. ఐటీడీఏ నిర్ణయించిన ధరలకు మాత్రమే టెంట్లు, రిసార్ట్స్‌ అద్దెకు ఇవ్వాలన్నారు. టెంట్ల మధ్య కనీస దూరం పాటించాలని ఆదేశించారు. టెంట్లు, రిసార్ట్స్‌ వద్ద మద్యం విక్రయాలు, మద్యం సేవించడం పూర్తిగా నిషేధమన్నారు. పర్యాటక సీజన్‌లో మహిళా కానిస్టేబుళ్లు, గ్రేడ్‌-5 కార్యదర్శులు లంబసింగి పరిసర ప్రాంతాల్లో విధులు నిర్వహించాల్సి వుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో లాలం సీతయ్య, ఈవోఆర్‌డీ కోరుప్రోలు శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు. 
Read more