పంచాయతీల్లో సమస్యలు పట్టవా..!

ABN , First Publish Date - 2022-12-31T01:21:41+05:30 IST

పంచాయతీల్లో సమస్యలు వివరిస్తున్నా.. పరిష్కారానికి నోచుకోవడం లేదంటూ పలువురు ప్రజాప్రతినిధులు గగ్గోలు పెట్టారు.

పంచాయతీల్లో సమస్యలు పట్టవా..!
సభ్యులనుద్దేశించి మాట్లాడుతున్న ఎంపీపీ సూరిబాబు

పరిష్కరిస్తామని ఎంపీపీ హామీ

రెవెన్యూ అధికారుల తీరుపై ఆరోపణలు

తుమ్మపాల, డిసెంబరు 30 : పంచాయతీల్లో సమస్యలు వివరిస్తున్నా.. పరిష్కారానికి నోచుకోవడం లేదంటూ పలువురు ప్రజాప్రతినిధులు గగ్గోలు పెట్టారు. అనకాపల్లి ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ గొర్లి సూరిబాబు అధ్యక్షతన శుక్రవారం మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశం ఏర్పాటైంది. ఈ సందర్భంగా పలు వురు సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు సమస్యలపై ఏకరువుపెట్టారు. ప్రధానంగా రెవెన్యూ శాఖ అధికారులపై మండిపడ్డారు. గొలగాం ఎంపీటీసీ నారపిన్ని చంద్రశేఖర్‌ మాట్లాడుతూ గొలగాం రెవెన్యూ పరిధి సర్వే నంబరు 184, 137లలో రెవెన్యూ రికార్డులను అధికారులు తారు మారుచేసి ప్రైవేటు వ్యక్తులకు ఎకరాల భూమిని ధారాదత్తం చేసేందుకు తెగబడ్డారని ఆరోపించారు. అలాగే గ్రామంలో పేదలు నిర్మించుకుం టున్న తొమ్మిది ఇళ్లను నిర్థాక్షణ్యంగా కూల్చేశారని మంత్రి ఆదేశాల మేరకే కూల్చేస్తున్నట్టు స్వయంగా అధికారులే స్పష్టం చేశారని ఆరోపించారు. గెడ్డపోరంబోకు స్థలాల్లో జగనన్న లేఅ వుట్లు వేస్తున్నారని, దీనికి రెవెన్యూ అధికారులు సహకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారుల తీరుకు సంబంధించి పలు ఆధారాలను ఎంపీపీకి సమర్పించారు. దీనిపై న్యాయస్థానాలను సైతం ఆశ్రయిస్తున్నట్టు చెప్పారు. మామిడిపాలెం సర్పంచ్‌ పూడి పరదేశినాయుడు మాట్లాడుతూ గ్రామంలో ఇంతవరకు వీఆర్వో ఎవరన్నది తమకు తెలియదని, దీంతో గ్రామస్థులు సమస్యల పరిష్కారానికి అవస్థలు పడుతున్నారని చెప్పారు.

తుమ్మపాల ఎంపీటీసీ పంచదార్ల కన్నారావు మాట్లాడుతూ రైతులకు పాస్‌ పుస్తకాల జారీకి సంబంధించి పలు లోటుపాట్లు ఉన్నాయని అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఇరిగేషన్‌ అధికారుల పై పలువురు మండిపడ్డారు. పంట కాలువల్లో పూడికలు తీయకపోవడంతో రైతాం గం తీవ్ర అవస్థలు పడుతున్నారన్నారు. పంచాయతీల సమస్యలకు సంబంధించి ఈవోపీఆర్డీ ధర్మారావుపై పలువురు మండిపడ్డారు. అలాగే ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు చేపట్టిన పనులు పూర్తికాక తాగునీటికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశానికి రెవెన్యూ, పోలీస్‌, ఆర్‌అండ్‌బీ, హెల్త్‌, ఎక్సైజ్‌ తదితర శాఖల అధికారులు గైర్హాజరుపై పలువురు ప్రజాప్రతినిధులు అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ సూరిబాబు మాట్లాడుతూ సమావేశంలో సభ్యులు వెల్లడించిన సమస్యలకు పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పలు శాఖల అధికారులు గైర్హాజరైనట్టు చెప్పారు. ఈ సమావేశంలో ఎంపీ డీవో చంద్రశేఖర్‌, పంచాయతీరాజ్‌ డీఈ వేణుగోపాలరెడ్డి, వైస్‌ ఎంపీపీలు విల్లూరి సూర్యకుమారి, రాము తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T01:21:41+05:30 IST

Read more