చింతపల్లి ఎంపీపీగా అనుషదేవి

ABN , First Publish Date - 2022-10-01T06:46:15+05:30 IST

మండల ప్రజా పరిషత్‌ (ఎంపీపీ) అధ్యక్షురాలిగా తాజంగి ఎంపీటీసీ సభ్యురాలు కోరాబు అనుషదేవి శనివారం బాధ్యతలు స్వీకరించనున్నారు.

చింతపల్లి ఎంపీపీగా అనుషదేవి
ఎంపీపీగా బాధ్యతలు స్వీకరించనున్న అనుషదేవి

నేడు ప్రమాణ స్వీకారం

ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్న ఎంపీడీవో వెల్లడి

హాజరుకావాలని సభ్యులకు వర్తమానం


చింతపల్లి, సెప్టెంబరు 30: మండల ప్రజా పరిషత్‌ (ఎంపీపీ) అధ్యక్షురాలిగా తాజంగి ఎంపీటీసీ సభ్యురాలు కోరాబు అనుషదేవి శనివారం బాధ్యతలు స్వీకరించనున్నారు. గత ఏడాది ఎంపీపీగా ఎన్నికైన వంతల బాబూరావు ఎంపీటీసీ సభ్యత్వం, ఎంపీపీ పదవిని రద్దు చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో లాటరీ ద్వారా ఓటమిపాలైన కోరాబు అనుషదేవిని ఎంపీపీగా నియమిస్తూ ఉమ్మడి జిల్లా కలెక్టర్‌, ఎన్నికల అధికారి డాక్టర్‌ ఎ.మల్లికార్జున ఉత్తర్వులు చేశారు. దీంతో   ఎంపీపీగా ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించడానికి మండల పరిషత్‌ అధికారులు ఏర్పాట్లు చేశారు. శనివారం నిర్వహించే మండల పరిషత్‌ అత్యవసర సమావేశానికి ఎంపీటీసీ సభ్యులందరూ హాజరుకావాలని ఎంపీడీవో లాలం సీతయ్య వర్తమానాలు పంపారు. కాగా ఎన్నికల అధికారి జారీచేసిన పదవి రద్దు ఉత్తర్వులను బాబూరావుకు అందజేసేందుకు అధికారులు ఆయన ఇంటికి వెళ్లగా, అందుబాటులో లేకపోవడంతో గోడకు అతికించారు. మరో కాపీని రిజిస్టర్‌ పోస్టుద్వారా పంపించారు. 

ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి...

చింతపల్లి ఎంపీపీగా బాధ్యతలు చేపట్టనున్న కోరాబు అనుషదేవి 2015లో బీ ఫార్మసీ పూర్తి చేసి ప్రైవేటు కంపెనీలో మెడికల్‌ ట్రాన్స్‌స్ర్కిప్షన్‌గా ఉద్యోగంలో చేరారు. తాజంగి పంచాయతీ రాసపనుకు గ్రామానికి చెందిన ఆమె తండ్రి అంగధరావు రెండు పర్యాయాలు తాజంగి, లంబసింగి ఎంపీటీసీ సభ్యుడిగా పనిచేశారు. ఆయన సలహాతో రెండేళ్ల క్రితం ఆమె ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. తాజంగి ఎంపీటీసీ నుంచి వైసీసీ తరపున పోటీ చేసి గెలుపొందారు.  ఎంపీపీ పదవికి ఆమె పేరును ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ప్రతిపాదించారు. అయితే అదే పార్టీకి చెందిన చింతపల్లి-3 ఎంపీటీసీ సభ్యుడు వంతల బాబూరావు కూడా ఎంపీపీ పదవికి పోటీ పడడంతో ఇద్దరికి చెరి సమానంగా ఓట్లు వచ్చాయి. లాటరీ తీయగా ఎంపీపీ పదవి బాబూరావును వరించింది. అయితే ఇతనిపై నమోదైన ఒక క్రిమినల్‌ కేసును ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొనలేదని, అందువల్ల పదవికి అనర్హుడిగా ప్రకటించాలంటూ అనుషదేవి న్యాయస్థానాన్ని ఆశ్రయించి విజయం సాధించారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆమె ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ, ఎంపీపీగా ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి శయశక్తులా కృషిచేస్తానని తెలిపారు. 

Read more