జిల్లాలో మరో పోలీస్‌ సబ్‌డివిజన్‌

ABN , First Publish Date - 2022-07-07T06:29:06+05:30 IST

అనకాపల్లి జిల్లాలో మరో పోలీసు సబ్‌డివిజన్‌ ఏర్పాటు కానున్నది. పరవాడ కేంద్రంగా కొత్త పోలీసు డివిజన్‌ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

జిల్లాలో మరో పోలీస్‌ సబ్‌డివిజన్‌
డివిజన్‌ కానున్న పరవాడ పోలీసు స్టేషన్‌

కొత్తగా పరవాడలో ఏర్పాటు

ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌

మూడుకు పెరగనున్న సబ్‌డివిజన్లు

‘పరవాడ’ పరిధిలో 8 పోలీసు స్టేషన్లు

అనకాపల్లి, జూలై 6 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి జిల్లాలో మరో పోలీసు సబ్‌డివిజన్‌ ఏర్పాటు కానున్నది. పరవాడ కేంద్రంగా కొత్త పోలీసు డివిజన్‌ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. జిల్లాల పునర్విభజన తరువాత పరవాడ కేంద్రంగా కొత్త పోలీసు సబ్‌ డివిజన్‌ ఏర్పాటు చేయాలని జిల్లా పోలీసు అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఈ మేరకు అనుమతి వచ్చినట్టు సమాచారం. జిల్లాలో అనకాపల్లి, నర్సీపట్నం సబ్‌ డివిజన్‌లు వుండగా, పరవాడతో కలిపి మూడు అవుతాయి.

అనకాపల్లి సబ్‌ డివిజన్‌ పరిధిలో అనకాపల్లి టౌన్‌, ట్రాఫిక్‌, రూరల్‌, కశింకోట, చోడవరం, వి.మాడుగుల, ఎ.కోడూరు, దేవరాపల్లి, కె.కోటపాడు, చీడికాడ, బుచ్చెయ్యపేట, కొత్తకోట, రావికమతం, రోలుగుంట పోలీసు స్టేషన్‌లు వుంటాయి. నర్సీపట్నం సబ్‌ డివిజన్‌ పరిధిలో నర్సీపట్నం టౌన్‌, రూరల్‌, నాతవరం, గొలుగొండ, మాకవతరం, కృష్ణాదేవిపేట, నక్కపల్లి, ఎస్‌.రాయవరం, కోటవురట్ల, పాయరావుపేట పోలీసు స్టేషన్‌లు వుంటాయి. కొత్తగా ఏర్పాటు కానున్న పరవాడ సబ్‌ డివిజన్‌ పరిధిలోకి పరవాడ, సబ్బవరం, అచ్యుతాపురం, మునగపాక, ఎలమంచిలి టౌన్‌, ట్రాఫిక్‌, రూరల్‌, రాంబిల్లి పోలీసు స్టేషన్‌లు చేరతాయి. జిల్లాల పునర్విభజనకు ముందు పరవాడ పోలీసు స్టేషన్‌ నగర పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని సౌత్‌ సబ్‌ డివిజన్‌లో ఉండేది. కొత్తగా సబ్‌ డివిజన్‌ ఏర్పాటు చేసిన డీఎస్పీ స్థాయి అధికారిని నియమిస్తారు. ఈ మేరకు జిల్లా పోలీసు అధికారులకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందినట్టు తెలిసింది.


Read more