రుషికొండలో మరో విచిత్రం

ABN , First Publish Date - 2022-08-04T06:53:03+05:30 IST

ఎలాంటి అనుమతులు లేకుండా రుషికొండను ధ్వంసం చేస్తున్నారని, అడ్డగోలుగా తవ్వకాలు చేపట్టి ప్రకృతిని నాశనం చేస్తున్నారనే ఆరోపణలు... పర్యావరణానికి విఘాతం కలుగుతోందంటూ పలువురు కోర్టును ఆశ్రయించిన సందర్భం... అయినప్పటికీ నిర్మాణాలు కొనసాగిస్తున్న పర్యాటకశాఖాధికారులు జీవీఎంసీ ఎదుట విచిత్ర ప్రతిపాదన పెట్టారు.

రుషికొండలో మరో విచిత్రం
రుషికొండపై చేపడుతున్న నిర్మాణాలు

నిర్మాణాలపై పర్యాటక శాఖ  వింత ప్రతిపాదన 

బిల్డింగ్‌ ప్లాన్‌ ఫీజు రూ.19 కోట్లు మినహాయించాలంటూ జీవీఎంసీకి వినతి

 ప్రభుత్వం జీవో జారీచేస్తేనే సాధ్యమంటున్న అధికారులు

విశాఖపట్నం, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): 

ఎలాంటి అనుమతులు లేకుండా రుషికొండను ధ్వంసం చేస్తున్నారని, అడ్డగోలుగా తవ్వకాలు చేపట్టి ప్రకృతిని నాశనం చేస్తున్నారనే ఆరోపణలు... పర్యావరణానికి విఘాతం కలుగుతోందంటూ పలువురు కోర్టును ఆశ్రయించిన సందర్భం... అయినప్పటికీ నిర్మాణాలు కొనసాగిస్తున్న పర్యాటకశాఖాధికారులు జీవీఎంసీ ఎదుట విచిత్ర ప్రతిపాదన పెట్టారు. 

రుషికొండపై చేపడుతున్న భవన నిర్మాణాలకు సంబంధించి అన్ని రకాల ఫీజుల నుంచి శతశాతం మినహాయించాలంటూ జీవీఎంసీ అధికారులను కోరారు. పైగా ఇవి ప్రభుత్వరంగానికి సంబంధించిన నిర్మాణాలు కాబట్టి మినహాయింపు కోరుతున్నామని మెలిక పెట్టారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేయడంతో వెనుదిరిగారు. 

రుషికొండపై రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో భారీ భవన నిర్మాణాలు జరుగుతున్న విషయం తెలిసిందే.  గతంలో భవనాలున్న ప్రదేశంలో మాత్రమే కొత్తగా నిర్మాణాలు చేపట్టాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. దీనికి విరుద్ధంగా విధ్వంసం సృష్టించి సుమారు 70 ఎకరాల్లో నిర్మాణాలు సాగిస్తున్నారంటూ కొంతమంది హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఇదిలావుండగా జీవీఎంసీ నుంచి  అనుమతులు పొందకుండా నిర్మాణాలు ప్రారంభించారు. ఆన్‌లైన్‌లో బిల్డింగ్‌ప్లాన్‌కు ఏపీటీడీసీ అధికారులు జీవీఎంసీకి దరఖాస్తు చేయగా, అన్నిరకాల ఫీజుల కింద సుమారు రూ.19 కోట్లు వరకూ చెల్లించాల్సి ఉంటుందని టౌన్‌ప్లానింగ్‌ అధికారులు వివరించారు. ఆ మేరకు ఫీజులు కట్టాల్సిన ఏపీటీడీసీ ఆ మొత్తాన్ని తాము కట్టలేమని, ప్రభుత్వ భవన నిర్మాణాలే కాబట్టి  వాటిని పూర్తిగా రద్దుచేస్తూ ప్లాన్‌ జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే టౌన్‌ప్లానింగ్‌ అధికారులు మాత్రం తాము అలాంటి నిర్ణయం తీసుకోలేమని, ఫీజు లేకుండా ప్లాన్‌ జారీ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం  ప్రత్యేకంగా జీవో జారీ చేయాలని  స్పష్టం చేశారు. దీంతో చేసేదిలేక ఫీజులు కట్టకుండానే వెనుదిరిగిపోయినట్టు తెలిసింది. అంతేకాకుండా గతంలో రుషికొండపై ఉన్న రిసార్టులకు సంబంధించి ఏపీటీడీసీ ఆస్తిపన్ను కింద జీవీఎంసీకి సుమారు రూ.59 వేలు బకాయి ఉంది. ఆ మొత్తాన్ని కూడా చెల్లించకుండానే ఏపీటీడీసీ అధికారులు రిసార్టులను కూల్చేయడం, కొత్త నిర్మాణాలను శరవేగంగా జరుపుతుండడం విశేషం.



 

 

Updated Date - 2022-08-04T06:53:03+05:30 IST