ఘనంగా ఎరుకమాంబ అమ్మవారి వార్షికోత్సవం
ABN , First Publish Date - 2022-10-17T06:58:15+05:30 IST
దొండపర్తి మెయిన్‌రోడ్డులో వేంచేసివున్న ఎరుకమాంబ అమ్మవారి వార్షికోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు.
దొండపర్తి, అక్టోబరు 16 : దొండపర్తి మెయిన్‌రోడ్డులో వేంచేసివున్న ఎరుకమాంబ అమ్మవారి వార్షికోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి ఉదయం నుంచి విశేష అర్చనలు, పూజలు, పసుపునీళ్లతో అభిషేకాలు నిర్వహించారు. వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ అమ్మవారికి సుమారు రెండు వందల కేజీల అన్నంతో అన్నాభిషేకం నిర్వహించారు. దొండపర్తి పరిసర ప్రాంతవాసులేకాకుండా, ఇతర ప్రాంతవాసులు కూడా పాల్గొని అమ్మవారిని దర్శించుకొని తమ మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకుడు గంగవరపు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అభిషేక హోమాలు నిర్వహించారు. దేవదాయ, ధర్మాదాయ డిప్యూటీ కమిషనర్ కె.శిరీష, 27వ వార్డు కార్పొరేటర్ గొలగాని వీరారావు(బుజ్జి)లు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ వేడుకలను ఆలయ ఈఓ జీవీ రామాభాయి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. విశేష పూజల అనంతరం మధ్యాహ్నం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో సుమారు పదిహేను వందల మందికి పైగా భక్తులు పాల్గొని అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు.