ఉత్తమ ప్రజా సంబంధాల నిపుణుడు అన్నమాచార్యులు
ABN , First Publish Date - 2022-12-31T00:46:34+05:30 IST
వాగ్గేయకారులు తమ సంగీత, సాహిత్యాల ద్వారా భగవంతుడికి, ప్రజలకు మధ్య ఆధ్యాత్మిక సంబంధాలు నెలకొల్పడంలో విశేష పాత్ర పోషించారని అలాంటి వారిలో పదకవితా పితామహుడు అన్నమాచార్యులు ఒకరని పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా(పీఆర్‌ఎస్‌ఐ) విశాఖ శాఖ చైర్మన్ డాక్టర్ పీఎల్‌కే మూర్తి అన్నారు.
పీఆర్‌ఎస్‌ఐ విశాఖ శాఖ చైర్మన్ డాక్టర్ పీఎల్‌కే మూర్తి
విశాఖపట్నం, డిసెంబరు 30: వాగ్గేయకారులు తమ సంగీత, సాహిత్యాల ద్వారా భగవంతుడికి, ప్రజలకు మధ్య ఆధ్యాత్మిక సంబంధాలు నెలకొల్పడంలో విశేష పాత్ర పోషించారని అలాంటి వారిలో పదకవితా పితామహుడు అన్నమాచార్యులు ఒకరని పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా(పీఆర్‌ఎస్‌ఐ) విశాఖ శాఖ చైర్మన్ డాక్టర్ పీఎల్‌కే మూర్తి అన్నారు. నగరంలోని ప్రముఖ హోటల్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రాచీన కాలంలో జనబాహుళ్యంలో ఽఆధ్యాత్మికతను పెంచేందుకు సాహితీవేత్తలు, వాగ్గేయకారులు కీలక పాత్ర పోషించారన్నారు. దీని ద్వారా సమాజంలో భక్తిభావన పెరిగి శాంతి, భగవంతుని సన్నిధిలో అందరూ సమానమన్న తత్వం పెరగడానికి దారితీసిందన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న తాళ్లపాక వంశస్థుల్లో 12వ తరానికి చెందిన తాళ్లపాక హరినారాయణాచార్యులు మాట్లాడుతూ అన్నమాచార్యులు రచించిన కీర్తనల ప్రచారానికి ఇరవై సంవత్సరాలుగా చేస్తున్న కృషిని వివరించారు. అన్నమాచార్యులు రచించిన 32 వేల కీర్తనల్లో 14 వేల కీర్తనలు లభించగా, వాటిలో ఆరు వేల కీర్తనలకు బాణీలు కట్టి టీటీడీ ప్రచారంలోకి తెచ్చిందన్నారు. మరో మూడువేల కీర్తనలు ప్రజల ముందుకు తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. పీఆర్‌ఎస్‌ఐ దక్షిణ భారత అధ్యక్షుడు యూఎస్ శర్మ మాట్లాడుతూ వచ్చే ఏడాది దేశరాజధాని ఢిల్లీలో పీఆర్‌ఎస్‌ఐ జాతీయ సమావేశాలు జరుగనున్నాయని ప్రకటించారు. ఈ సందర్భంగా పీఆర్‌ఎస్‌ఐ జీవితకాల సభ్యులకు గుర్తింపు కార్డులు అందజేశారు. పీఆర్‌ఎస్‌ఐ విశాఖ శాఖ ఉపాధ్యక్షుడు ఆర్‌పీ శర్మ, కార్యదర్శి ఎ.గోవిందరావు, సంయుక్త కార్యదర్శి ఎంకేవీఎల్ సరసింహం, కోశాధికారి ఎన్‌వీ నరసింహం, కార్యవర్గ సభ్యులు ఎంవీ రాజశేఖర్, డిసుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.