అద్దెకు అన్న క్యాంటీన్ భవనం!
ABN , First Publish Date - 2022-05-22T06:56:03+05:30 IST
పేదలకు అతి తక్కువ ధరకు భోజనం అందించాలన్న సదుద్దేశంతో గత టీడీపీ ప్రభుత్వం ప్రారంభించిన అన్న క్యాంటీన్లు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత మూతపడ్డాయి.

ఆటోనగర్‌లో ఇండస్ట్రియల్ లోకల్ అథారిటీ (ఐలా) అధికారుల నిర్వాకం
ప్రైవేటు రెస్టారెంట్‌గా మార్పు
గాజువాక, మే 21: పేదలకు అతి తక్కువ ధరకు భోజనం అందించాలన్న సదుద్దేశంతో గత టీడీపీ ప్రభుత్వం ప్రారంభించిన అన్న క్యాంటీన్లు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత మూతపడ్డాయి. అయితే అలా మూతపడిన క్యాంటీన్‌ను ప్రైవేటు రెస్టారెంట్‌కు అద్దెకు ఇచ్చేయడం చర్చనీయాంశమైంది.
గాజువాక ఆటోనగర్‌లో గల పరిశ్రమలకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే కార్మికుల కోసం డి-బ్లాక్‌లో ఇండస్ట్రియల్ లోకల్ అథారిటీ (ఐలా)కి చెందిన స్థలంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో జీవీఎంసీ రూ.20 లక్షలతో అన్న క్యాంటీన్‌కు భవనాన్ని నిర్మించింది. ప్రభుత్వం మారడంతో అన్న క్యాంటీన్లు మూతపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆటోనగర్ డి-బ్లాక్‌లో గల అన్న క్యాంటీన్ భవనాన్ని గత ఐలా కమిషనర్...జీవీఎంసీ అధికారుల నుంచి ఎటువంటి అనుమతి తీసుకోకుండా నెలకు కేవలం రూ.18 వేలకు ఓ ప్రైవేటు రెస్టారెంట్‌కు అద్దెకు ఇచ్చేశారు. కాగా అన్న క్యాంటీన్లను నడపకపోగా, ఆయా భవనాలను అద్దెకు ఇవ్వడంపై స్థానికులు మండిపడుతున్నారు.
జీవీఎంసీ కమిషనర్ ఆదేశాల మేరకు చర్యలు
డి.శ్రీధర్, జోనల్ కమిషనర్
ఆటోనగర్‌లోని అన్న క్యాంటీన్‌ను ఐలా అధికారులు ప్రైవేటు రెస్టారెంట్‌కు అద్దెకిచ్చిన అంశాన్ని జీవీఎంసీ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. జీవీఎంసీ నుంచి అనుమతి తీసుకోకుండా ఏ ప్రాతిపదికన అద్దెకు ఇచ్చారో ఐలా కమిషనర్‌ను వివరణ కోరాము. జీవీఎంసీ కమిషనర్ ఆదేశాల మేరకు తదుపరి చర్యలు చేపట్టడం జరుగుతుంది.
వైఎస్ఆర్ తోటబడికి ఆరు ఆర్బీకేలు ఎంపిక
పద్మనాభం, మే 21: ఉద్యాన రైతులకు మెరుగైన సేవలందించేందుకు వీలుగా డాక్టర్ వైఎస్ఆర్ తోటబడి కార్యక్రమానికి జిల్లాలో ఆరు రైతు భరోసా కేంద్రాలను ఎంపిక చేసినట్టు ఉద్యానశాఖ జిల్లా అధికారి కె.శైలజ తెలిపారు. ఒక్కో ఆర్బీకే పరిధిలో 30 మంది ఉద్యాన రైతులను ఎంపిక చేసి అధిక దిగుబడుల సాధనకు సూచనలను అందిస్తామన్నారు. ఆనందపురం మండలం గిడిజాల ఆర్బీకే పరిధిలో అంటుగట్టిన వంగ, మిరపతోటలు, గండిగుండంలో జీడిమామిడి, భీమిలి మండలం అన్నవరంలో కొబ్బరి, పద్మనాభం మండలం తునివలసలో మామిడి, రెడ్డిపల్లి ఆర్బీకేలో బొప్పాయి పంటలపై తోటబడి నిర్వహిస్తామన్నారు.
104, 108 సిబ్బందికి జీతాలు నిల్
మార్చి, ఏప్రిల్ నెలలకు సంబంధించిన వేతనాలు పెండింగ్
విశాఖపట్నం, మే 21 (ఆంధ్రజ్యోతి): అనారోగ్యం పాలైన, ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రులకు చేర్చడంలో కీలకమైన 108 వాహనాలు, సంచార వైద్య సేవలు అందించే 104 వాహనాల్లో పనిచేసే సిబ్బందికి రెండు నెలలుగా జీతాలు లేవు. ఉమ్మడి విశాఖ జిల్లాలో 104 వాహనాలు 42 ఉన్నాయి. వీటిలో ఒక వైద్యుడు, డ్రైవర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉంటారు. డ్రైవర్‌కు రూ.16 వేలు, డాక్టర్‌కు అనుభవాన్ని బట్టి రూ.40 వేలు నుంచి రూ.60 వేలు, డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు రూ.15 వేలు చొప్పున చెల్లిస్తున్నారు. ఇక 108 వాహనాలు 52 వరకూ ఉన్నాయి. వీటిల్లో డ్రైవర్ (పైలట్), ఎమర్జన్సీ మెడికల్ టెక్నీషియన్లు కలిపి మొత్తం 265 మంది పనిచేస్తున్నారు. పైలట్‌కు రూ.24,150, ఈఎంటీకి రూ.26,150 చొప్పున వేతనంగా చెల్లిస్తున్నారు. అయితే, వీరికి మార్చి, ఏప్రిల్ నెలలకు సంబంధించిన జీతాలను ఇప్పటివరకూ ఇవ్వలేదు. మరో పది రోజులు గడిస్తే మే నెల కూడా పూర్తవుతోందని, జీతాలను చెల్లించకపోవడం వల్ల ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు సిబ్బంది వాపోతున్నారు. తమ సమస్యను ఉన్నతాధికారులు పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
