స్పందనలో వినతుల వెల్లువ

ABN , First Publish Date - 2022-09-27T07:08:49+05:30 IST

ప్రజా సమస్యలపై అర్జీల స్వీకరణకు నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమానికి సోమవారం జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలి వచ్చారు. సుమారు 202 మంది తమ తమ సమస్యలను విన్నవించారు.

స్పందనలో వినతుల వెల్లువ
అర్జీదారులతో మాట్లాడుతున్న జాయింట్‌ కలెక్టర్‌ కల్పనాకుమారి, కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి


అర్జీదారులతో కలెక్టరేట్‌ ప్రాంగణంలో కోలాహలం 

పలువురి సమస్యలను స్వయంగా తెలుసుకున్న కలెక్టర్‌ 


అనకాపల్లి కలెక్టరేట్‌, సెప్టెంబరు 26 : ప్రజా సమస్యలపై అర్జీల స్వీకరణకు నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమానికి సోమవారం జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలి వచ్చారు. సుమారు 202 మంది తమ తమ సమస్యలను విన్నవించారు. కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి కొందరితో స్వయంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఉదయం తొమ్మిది గంటల నుంచి కలెక్టరేట్‌లో సందడి ప్రారంభమైంది. పది గంటల నుంచి అర్జీదారులకు రశీదులు ఇచ్చి కలెక్టర్‌ వద్దకు పంపించారు. మరికొందరు జేసీ కల్పనాకుమారి, డీఆర్‌వో వెంకటరమణలను కలిసి వారి గోడు వినిపించారు.  అంతకుముందు అధికారులను ఉద్దేశించి కలెక్టర్‌ మాట్లాడుతూ రానున్న అక్టోబరు, నవంబరు నెలల్లో రాష్ట్రంలోని కోస్తా తీరంలో తుఫాన్లు అత్యధికంగా వచ్చే అవకాశం ఉన్నందున అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని   సూచించారు. అవసరమైతే సహాయక చర్యలు అందించేందుకు, పునరావాసం కల్పించేందుకు సంసిద్ధమై ఉండాలన్నారు. తుఫాన్‌ ముందస్తు ఏర్పాట్లపై ఆయా శాఖల అధికారులతో సమీక్షించుకోవాలన్నారు.  ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 


 అర్జీలపై తక్షణమే స్పందించండి : ఎస్పీ గౌతమిశాలి


అనకాపల్లి రూరల్‌,  సెప్టెంబరు 26 : స్పందనలో వచ్చే అర్జీలపై తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ గౌతమిశాలి అధికారులను ఆదేశించారు. శంకరంలోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందనలో ఆమె పలువురి నుంచి అర్జీలను  స్వీకరించి సమస్యలను తెలుసుకున్నారు. సుమారు 40 మంది అర్జీలు సమర్పించారు. ఇందులో ప్రధానంగా కుటుంబ కలహాలు, భూ వివాదాలకు సంబంధించి ఎక్కువగా ఉన్నాయి. ఈ కార్యక్రమంలో పోలీస్‌ అధికారులు పాల్గొన్నారు. 


Read more