అమ్మఒడిలో కోత!?
ABN , First Publish Date - 2022-06-24T06:22:20+05:30 IST
నగరంలోని గోపాలపట్నం ప్రాంతంలోని 89వ వార్డు పరిధిలో గల నాగేంద్ర కాలనీ వార్డు సచివాలయానికి అమ్మఒడికి అర్హులంటూ 306 మంది పేర్లతో ప్రభుత్వం నుంచి ఒక జాబితా వచ్చింది.
పలు అభ్యంతరాలతో వందలాది మంది పేర్లు తొలగింపు
సచివాలయాలకు చేరిన తుది జాబితాలు
వాట్సాప్ గ్రూపుల్లో పెట్టిన వలంటీర్లు
పేర్లు లేని వారి గగ్గోలు
జాబితా తమకు అందలేదంటున్న విద్యా శాఖ
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
నగరంలోని గోపాలపట్నం ప్రాంతంలోని 89వ వార్డు పరిధిలో గల నాగేంద్ర కాలనీ వార్డు సచివాలయానికి అమ్మఒడికి అర్హులంటూ 306 మంది పేర్లతో ప్రభుత్వం నుంచి ఒక జాబితా వచ్చింది. ఈ సచివాలయ పరిధిలో 75 మందిని అనర్హులుగా ప్రకటించింది. 89వ వార్డులోని ఆరు సచివాలయాల్లో సుమారు రెండు వేల మందిని అర్హులుగా, 400 మందిని అనర్హులుగా తేల్చినట్టు అంచనా వేస్తున్నారు.
పిఠాపురం కాలనీ వార్డు సచివాలయం నుంచి గత నెల 30న 351 మంది (విద్యార్థుల తల్లులు)తో ఈకేవైసీ చేయించి జాబితాను అప్‌లోడ్ చేశారు. అయితే గురువారం వచ్చిన జాబితాలో 226 మంది పేర్లు మాత్రమే ఉన్నాయి.
అనకాపల్లి జిల్లా పరవాడ మండలం పరవాడ 1, 2 సచివాలయాల పరిధిలో గతంలో సుమారు ఆరు వందల మందికి అమ్మఒడి రాగా, ఈసారి 492 మందికే పథకం వర్తింపజేశారు. అలాగే తానాం సచివాలయ పరిధిలో గతంలో 570 మందికి రాగా, ఇప్పుడు 331 మందికి, గొర్లివానిపాలెం సచివాలయ పరిధిలో గతంలో 488 మందికి పథకం వర్తించగా ఈసారి 450 మంది మాత్రమే అర్హులుగా ప్రకటించారు. ఇదే పరిస్థితి మండలంలోని అన్ని సచివాలయాల్లోనూ ఉంది.
ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో అమ్మఒడి లబ్ధిదారుల జాబితాలో కోత పడింది. అయితే ఎంతమంది పేర్లు తొలగించిందీ ఇటు విద్యా శాఖ గానీ, అటు వార్డు/గ్రామ సచివాలయాలను నిర్వహించే విభాగాలుగానీ చెప్పడం లేదు. నెలకు 300 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్ వినియోగించినా, 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో సొంత నివాసం ఉన్నా, నాలుగు చక్రాల వాహనం కలిగినా, విద్యార్థి హాజరుశాతం 75 శాతం కంటే తక్కువగా ఉన్నా...అనర్హులుగా పేర్కొన్నట్టు అధికారులు చెబుతున్నారు.
అమ్మ ఒడి తుది జాబితాలు గురువారం గ్రామ/వార్డు సచివాలయాలకు చేరాయి. అర్హులు, అనర్హుల జాబితాలను వలంటీర్లు వాట్సాప్ గ్రూపుల్లో పెట్టారు. జాబితాలను చెక్ చేసుకోవాలని సూచించారు. తుది జాబితాలో యాక్టివ్, ఇన్ యాక్డివ్ అంటూ ప్రస్తావించారు. ఇన్ యాక్టివ్‌గా గుర్తించిన తల్లులు తమ బ్యాంకు ఖాతాకు ఆధార్ నంబర్‌ను అనుసంధానం చేయించుకోవాల్సి ఉంటుంది. జాబితాల్లో పేర్లు లేని విద్యార్థుల తల్లుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. కాగా గత నెలాఖరున ఈకేవైసీ చేసిన తరువాత అప్‌లోడ్ చేసిన జాబితాకు, తాజాగా వచ్చిన జాబితాకు మధ్య తేడా వుందని గుర్తించారు. బహుశా శుక్ర/శనివారాల్లో కోతపై మరిన్ని వివరాలు తెలిసే అవకాశం వుందని అంటున్నారు.
అనర్హుల జాబితా
గ్రామ/వార్డు సచివాలయాలకు అర్హుల జాబితాలతో పాటు అనర్హుల జాబితాలు చేరాయి. అనర్హతకు సంబంధించి పలు అంశాలను పొందుపరిచారు. తల్లి బియ్యం కార్డులో విద్యార్థి పేరు లేదని, కుటుంబంలో నాలుగు చక్రాల వాహనం ఉందని, మెట్ట భూమి పదెకరాలకు మించి ఉందని, తగినంత హాజరు లేదని, విద్యుత్ వినియోగం 300 యూనిట్లకు మించిందని, కుటుంబంలో ఒకరు ప్రభుత్వ ఉద్యోగిగా వున్నారనే కారణాలను చూపించారు. ఇలా మధురవాడ ప్రాంతంలోని రజక హౌసింగ్ కాలనీ సచివాలయంలో 161 మందిని అనర్హులుంటూ పేర్కొంటూ జాబితా నుంచి తప్పించారు.
కాగా అమ్మఒడి పథకం ప్రకటించిన తరువాత తొలి రెండేళ్లు విద్యా శాఖ పర్యవేక్షించి అర్హుల జాబితాను ఖరారుచేసింది. ఈ పర్యాయం విద్యా శాఖకు సంబంధం లేకుండా అమరావతి స్థాయిలోనే అమ్మఒడి జాబితాలు సిద్ధం చేసి వార్డు/గ్రామ సచివాలయాలకు పంపారు. అయితే సిక్స్ స్టెప్ వాలిడేషన్‌తోపాటు పిల్లలకు సంబంధించి 75 శాతం హాజరు వివరాలను పరిగణనలోకి తీసుకున్నారు. గత నెల ఈకేవైసీ కోసం జాబితాలు వచ్చినప్పుడు వార్డు/గ్రామాల వారీగా వివరాలు వేగంగా పంపేలా సమన్వయం చేయాలని డీఈవోలను ఆదేశించిన ప్రభుత్వం లబ్ధిదారుల వివరాలు మాత్రం వారికి పంపలేదని తెలిసింది. తుది జాబితాలు విద్యా శాఖకు గానీ, పాఠశాల హెచ్‌ఎం లాగిన్‌కు గానీ పంపలేదు. ఇదే విషయాన్ని విద్యా శాఖ వర్గాలు చెబుతున్నాయి.