అస్మదీయుడికి ‘అంబేడ్కర్‌ చైర్‌’!

ABN , First Publish Date - 2022-12-07T01:43:46+05:30 IST

ఆంధ్ర విశ్వవిద్యాలయం అడ్డగోలు నియామకాలకు అడ్డాగా మారింది. అంబేడ్కర్‌ పేరుతో ఏర్పాటుచేసిన అధ్యయన కేంద్రం చైర్‌లో వర్సిటీ వైస్‌ చాన్సలర్‌ ప్రసాద్‌రెడ్డి తన అస్మదీయుడికి స్థానం కల్పించడం వివాదస్పదమవుతోంది. ఈ కేంద్రంలో పనిచేసేవారు లా, ఆర్ట్స్‌, కామర్స్‌ల్లో పీహెచ్‌డీ చేసి ఉండాలి. అయితే వీసీ మాత్రం కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌ చదివిన తన సొంత మనిషిని నియమించుకున్నారు.

అస్మదీయుడికి ‘అంబేడ్కర్‌ చైర్‌’!

ఏయూలో అడ్డగోలు వ్యవహారం

అంబేడ్కర్‌ సెంటర్‌లో ప్రొఫెసర్‌గా ఉప కులపతి శిష్యుడికి అందలం

ఆయన చేతిలో చాలా చర్చిలున్నాయని... గతంలో ఈసీ సభ్యుడిగా నియామకం

ఇప్పుడు నిబంధనలు ఉల్లంఘిస్తూ మరో పోస్టు

చైర్‌కు ఉండాల్సిన అర్హత... సోషల్‌ సైన్సెస్‌

ఆయన చదివింది... కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌

నియామకం కోసం నోటిఫికేషన్‌లో మార్పులు

అధ్యయన కేంద్రం నిధులపైనా కన్ను?

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

ఆంధ్ర విశ్వవిద్యాలయం అడ్డగోలు నియామకాలకు అడ్డాగా మారింది. అంబేడ్కర్‌ పేరుతో ఏర్పాటుచేసిన అధ్యయన కేంద్రం చైర్‌లో వర్సిటీ వైస్‌ చాన్సలర్‌ ప్రసాద్‌రెడ్డి తన అస్మదీయుడికి స్థానం కల్పించడం వివాదస్పదమవుతోంది. ఈ కేంద్రంలో పనిచేసేవారు లా, ఆర్ట్స్‌, కామర్స్‌ల్లో పీహెచ్‌డీ చేసి ఉండాలి. అయితే వీసీ మాత్రం కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌ చదివిన తన సొంత మనిషిని నియమించుకున్నారు. ఇందుకోసం నోటిఫికేషన్‌ను కూడా అనుకూలంగా మార్చుకున్నారన్న ఆరోపణలున్నాయి. గాంధీ అధ్యయన కేంద్రం తరహాలోనే అంబేడ్కర్‌ అధ్యయన కేంద్రం ఏర్పాటుచేసి, దానికి ఒక ప్రొఫెసర్‌ (చైర్‌)ను నియమించి, అంబేడ్కర్‌ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కేంద్రం నిర్ణయించింది. దీనికి సామాజిక న్యాయశాఖ నుంచి ఏటా నిధులు ఇస్తున్నారు. పూర్తిస్థాయి ప్రొఫెసర్‌ను నియమించి, ఈ కేంద్రాన్ని నడిపితే యూజీసీ నుంచి ఏటా రూ.2.5కోట్ల నిధులు వస్తాయి. సభలు, సమావేశాల నిర్వహణకే వాటిని ఉపయోగించుకోవచ్చు. నిధులు దండిగా ఉన్న ఈ పోస్టులో బయటవారిని పెట్టడం ఇష్టంలేక ఏయూ పాలకులు చాలాకాలంగా ఎవరినీ నియమించలేదు. ప్రకటనలు ఇచ్చి, వాటిని రద్దుచేస్తూ వస్తున్నారు. ప్రొఫెసర్‌ను నియమించకపోతే నిధులు వెనక్కి ఇవ్వాల్సి ఉంటుందని ఇటీవల కేంద్రం హెచ్చరించడంతో వీసీ తన మనిషిని నియమించుకోవడానికి ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంజనీరింగ్‌ అర్హత ఉన్నవారే అవసరమనే అర్థం వచ్చేలా... ‘అంబేడ్కర్‌ రోల్‌ ఇన్‌ డిజిటలైజేషన్‌’ అంటూ ప్రకటన ఇచ్చి, తన శిష్యుడైన జేమ్స్‌ స్టీఫెన్‌ను ఫుల్‌టైమ్‌ ప్రొఫెసర్‌గా నియమించుకున్నారు. ఆయనకు నెలకు కనీస జీతం రూ.2.15లక్షలు కాగా, అదనపు ప్రయోజనాలు కలిపి రూ.2.5లక్షల వరకు ముడుతుంది. ఆ కేంద్రానికి వచ్చే నిధుల సంగతి కూడా ఆయనే చూసుకుంటారు. అదీ అసలు రహస్యం. ఇక ఈ చైర్‌ అభ్యర్థి పరిపాలనా పరమైన అంశాల్లో కూడా పాల్గొనవచ్చంటూ నిబంధనలు రూపొందించారు. అంటే... సమీప భవిష్యత్తులో ఆయన్ను రిజిస్ట్రార్‌గా కూడా నియమించుకునే ఆలోచన చేస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి.

ఎవరీ జేమ్స్‌ స్టీఫెన్‌?

జేమ్స్‌ స్టీఫెన్‌ ఒక పాస్టర్‌. సువార్త బోధనలు చేస్తుంటారు. సుమారు 50 చర్చిలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీటన్నింటికంటే మించి ఆయన వీసీ ప్రసాదరెడ్డికి ముఖ్య శిష్యుడు. కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌లో ఆయన వద్దే పీహెచ్‌డీ చేశారు. అప్పటినుంచి వీరి మధ్య గురుశిష్యుల అనుబంధం ఉంది. ఏయూ వీసీకి వైసీపీతో విడదీయరాని బంధం ఉంది. ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్‌కు పెందుర్తి సమీపాన ఏర్పాటు చేసిన వెల్ఫేర్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో ప్రసాదరెడ్డికి భాగస్వామం ఉందనే ప్రచారం ఉంది. ఆ కాలేజీకి జేమ్స్‌ స్టీఫెన్‌నే ప్రిన్సిపాల్‌గా పెట్టి నడుపుతున్నారు.

సాయిరెడ్డితో చెప్పి పాలక మండలి సభ్యత్వం

చెప్పిన మాట వినే శిష్యుడిని వీసీ ప్రసాదరెడ్డి అప్పటి ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్‌చార్జి విజయసాయిరెడ్డికి పరిచయం చేశారు. విద్యావేత్త, అనేక చర్చిలకు నాయకత్వం వహిస్తున్నారని, ఇలాంటి వారికి పదవి ఇస్తే... ఓటింగ్‌ పెరుగుతుందని చెప్పి ఏయూ పాలక మండలిలో సభ్యుడిగా పదవి ఇప్పించారు. అనుబంధ కాలేజీల కోటాలో రెండేళ్ల నుంచి జేమ్స్‌ స్టీఫెన్‌ ఈసీ మెంబర్‌గా కొనసాగుతున్నారు. ఇప్పుడు అంబేడ్కర్‌ అధ్యయన కేంద్రం చైర్‌లో ఫుల్‌టైమ్‌ ప్రొఫెసర్‌గా నియమించారు. ఎంటెక్‌ చదివిన ఆయన కంప్యూటర్స్‌ రంగంలోనే పీహెచ్‌డీ చేశారు. ఆ డిగ్రీలతో అంబేడ్కర్‌ సెంటర్‌లో పనిచేయడానికి ఆయన అనర్హుడు. దీంతో నోటిఫికేషన్‌లో ప్రధానిమంత్రి ఆలోచన ‘డిజిటల్‌ ఇండియా’ని జోడించి, ‘అంబేద్కర్‌ రోల్‌ ఇన్‌ డిజిటలైజేషన్‌’ కోసం ఈ కేంద్రం పనిచేస్తుందని చెప్పి, అడ్డదారిలో కూర్చోబెట్టారు. మరోవైపు పాలక మండలిలో సభ్యులుగా ఉండేవారు వర్సిటీలో ఏ పోస్టుకు దరఖాస్తు చేయకూడదనే వాదన ఉంది. గతంలో చిట్టినేని సురేశ్‌ అనే వ్యక్తి ఈసీ సభ్యుడిగా ఉంటూ కంప్యూటర్‌ సైన్స్‌ విభాగంలో ప్రొఫెసర్‌ పోస్టుకు దరఖాస్తు చేసుకుంటే... ఇదే జేమ్స్‌ స్టీఫెన్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. దానిపై ఫిర్యాదు కూడా చేశారని పలువురు గుర్తు చేస్తున్నారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు తాను ఈసీ మెంబర్‌గా ఉంటూ అంబేడ్కర్‌ చైర్‌కు ఎలా దరఖాస్తు చేశారని, దాన్ని వీసీ ఎలా ఆమోదించారని ప్రశ్నిస్తున్నారు. అధికార పార్టీ అండదండలతో ఏయూ వీసీ ప్రసాదరెడ్డి తన మనుషుల్ని విశ్వవిద్యాలయంలో నింపేసుకుంటూ, వారితో వైసీపీకి ఊడిగం చేయిస్తూ పరువు తీస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తక్షణమే అంబేడ్కర్‌ చైర్‌ నియామకంపై విచారణ చేపట్టాలని, జేమ్స్‌ స్టీఫెన్‌ని ఆ పోస్టు నుంచి తప్పించాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - 2022-12-07T01:44:05+05:30 IST