అల్లం, పసుపు పంటలకు తెగుళ్ల బెడద

ABN , First Publish Date - 2022-08-17T06:13:11+05:30 IST

ఆదివాసీ రైతులు సాగుచేస్తున్న అల్లం, పసుపు పంటలో వ్యాప్తి చెందిన దుంపకుళ్లు తెగులు ఉధృతి అధికంగా కనిపిస్తున్నది.

అల్లం, పసుపు పంటలకు తెగుళ్ల బెడద
దుంప కుళ్లు ఆశించిన అల్లం మొక్క

- సకాలంలో నివారించుకోవాలి

- లేకుండా పంట పూర్తిగా నాశనం

- ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్‌ శివకుమార్‌ వెల్లడి

చింతపల్లి, ఆగస్టు 16: ఆదివాసీ రైతులు సాగుచేస్తున్న అల్లం, పసుపు పంటలో వ్యాప్తి చెందిన దుంపకుళ్లు తెగులు ఉధృతి అధికంగా కనిపిస్తున్నది. అల్లం పంటలో ఫిల్లోస్టిక్టా ఆకు మచ్చ తెగులు వ్యాప్తి చెందింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పసుపు, అల్లం పంటల్లో వ్యాప్తి చెందిన దుంపకుళ్లు, ఫిల్లోస్టిక్టా ఆకు మచ్చ తెగులును సకాలంలో నియంత్రించుకోవాలని, లేదంటే పంటను తీవ్రంగా నాశనం చేస్తాయని చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. పసుపు, అల్లం పంటల్లో వ్యాప్తి చెందిన దుంపకుళ్లు, ఫిల్లోస్టిక్టా ఆకు మచ్చ తెగులు నివారణపై ఉద్యాన పరిశోధన స్థానం హెడ్‌, సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ శివకుమార్‌  ‘ఆంధ్రజ్యోతి’కి వివరించారు. పాడేరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలో పసుపు పంటను 900 హెక్టార్లు, అల్లం 500హెక్టారుల్లో ఆదివాసీ రైతులు సాగు చేస్తున్నారు. అనధికారికంగా మరో 600 హెక్టారుల్లో ఈ పంటలను సాగుచేసుకుంటున్నారు. ఏప్రిల్‌ నెలాఖరు నుంచి జూన్‌ మొదటి పక్షం వరకు రైతులు పసుపు, అల్లం నాట్లను వేసుకుంటారు. ప్రస్తుతం అల్లం, పసుపు మొక్కలు 1-1.5 ఎత్తులో ఉన్నాయి. గిరిజన ప్రాంతంలో విస్తారంగా కురిసిన వర్షాల కారణంగా అల్లం, పసుపు పంటల్లో దుంపకుళ్లు తెగులు అధికంగా వ్యాప్తి చెందింది. 

దుంపకుళ్లు తెగులు: అల్లం, పసుప పంటలో అధిక నష్టం కలిగించే తెగులు దుంపకుళ్లు. ఎకరాకు పది నుంచి 20 క్వింటాళ్ల దిగుబడిని తగ్గిస్తుంది. మురుగునీరు పోయే కాలువలు లేకపోవడం వల్ల దుంపకుళ్లు ఉధృతి అధికంగా కనిపిస్తున్నది. అధిక వర్షం, నీరు నిలువ ఉండడం వల్ల శిలీంధ్రం వేగంగా వృద్ధి చెంది తెగులు తీవ్రతను పెంచుతుంది. తెగులు ఉధృతి అధికంగా ఉంటే మొక్క ఆకులు పాలిపోతాయి. మొక్కలు ఎండిపోయి కుళ్లిపోతాయి. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే దుంపకుళ్లు ఆశించిందని భావించి నివారణ చర్యలు ప్రారంభించాలి. 

నివారణ: పసుపు, అల్లం పంటలను ఒక అడుగు ఎత్తు, ఒక మీటరు వెడల్పు కలిగిన బెడ్స్‌లో నాట్లు వేసుకోవాలి. పంట పొలంలో మురుగునీటి కాలువలు ఏర్పాటు చేసుకోవాలి. ఏప్రిల్‌ మాసంలోనే నాట్లు వేసుకోవడం మంచిది. నాట్లు వేసే ముందు విత్తనాన్ని 5-7 గ్రాముల ట్రైకోడెర్మావిరిడి పొడి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. పంట పొలంలో దుంపకుళ్లు ఆశించిన మొక్కలను గుర్తించి వెంటనే తొలగించాలి. తెగులు సోకిన మొక్కలను కాల్చివేయాలి. అల్లం, పసుపు పంటలకు వేపపిండి ఎరువును వేసుకోవాలి. దుంపకుళ్లు ఉధృతి అధికంగా ఉంటే మెటలాక్సిల్‌గాని, మాంకోజెబ్‌గాని 5గ్రాములు లీటరు నీటిలో కలుపుకుని తెగులు సోకిన మొక్కల మొదళ్లలో పోసుకోవాలి. కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ 3 గ్రాములు లీటరు నీటిలో కలిపి తెగులు సోకిన మొక్కలతో పాటు పక్కనున్న నాలుగు, ఐదు మొక్కలు మొదళ్లలోనూ మిశ్రమం పోసుకోవాలి. అలాగే 100 కిలోల పశువుల గెత్తం, 10 కిలోల వేప పిండి, కేజీ ట్రైకోడెర్మా విరిడి కలిపి 15 రోజుల పాటు తేలికపాటి తడులు ఇవ్వాలి. ఈ మిశ్రమాన్ని బెడ్లపైన వేసుకోవాలి. అలాగే ట్రైకోడెర్మా విరిడి 5గ్రాములు లీటరు నీటిలో కలుపుకుని దుంపకుళ్లు వ్యాప్తి చెందిన మొక్కల చుట్టూ ఉన్న మొక్కల మొదళ్లలో వేసుకోవడం వల్ల దుంపకుళ్లు తెగులును నివారించుకోవచ్చు. 

ఫిల్లోస్టిక్టా ఆకు మచ్చ తెగులు నివారణ: అల్లం పంట ఆకుల్లో మచ్చ కనిపిస్తే ఫిల్లో స్టిక్టా ఆకు మచ్చ తెగులుగా గుర్తించాలి. జూలై నుంచి అక్టోబరు మాసంలో ఈ తెగులు ఆశించే అవకాశముంది. వాతావరణంలో తేమ అధికంగా ఉంటే ఈ తెగులు ఆశిస్తుంది. ఈ తెగులు ఆశించిన మొక్కల ఆకులు గోధుమ రంగులోకి మారి ఎండిపోతాయన్నారు. ఈ తెగులు నివారణకు కాపర్‌ ఆక్సిక్లోరైడ్‌ మూడు గ్రాములు లీటరు నీటిలో కలుపుకుని ఆకులపై పిచికారీ చేసుకోవాలి. 


Read more