అగ్నిపథ్‌ ఆర్మీ అభ్యర్థుల ఆందోళన

ABN , First Publish Date - 2022-11-17T00:45:30+05:30 IST

అగ్నిపథ్‌ ఆర్మీ ఉద్యోగాలలో తమకు అన్యాయం జరిగిందని ఎన్‌సీసీ సి సర్టిఫికెట్‌ అభ్యర్థులు బుధవారం జిల్లా కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన చేశారు.

అగ్నిపథ్‌ ఆర్మీ అభ్యర్థుల ఆందోళన
ఆందోళన చేస్తున్న ఎన్‌సీసీ అభ్యర్థులు

అర్హులైన ఎన్‌సీసీ అభ్యర్థులందరికీ ఉద్యోగాలివ్వాలని డిమాండ్‌

మహారాణిపేట, నవంబరు 16: అగ్నిపథ్‌ ఆర్మీ ఉద్యోగాలలో తమకు అన్యాయం జరిగిందని ఎన్‌సీసీ సి సర్టిఫికెట్‌ అభ్యర్థులు బుధవారం జిల్లా కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన చేశారు. రన్నింగ్‌, మెడికల్‌ పరీక్షలలో ఉత్తీర్ణులైన ఎన్‌సీసీ సి సర్టిఫికెట్‌ కలిగివున్న వారికి రాత పరీక్ష లేకుండా నేరుగా ఉద్యోగాలు పొందవచ్చని అగ్నిపథ్‌ రిక్రూట్‌మెంట్‌ నియమావళిలో పొందుపరిచారు. గత ఆగస్టు నెలలో రాష్ట్రంలో వివిధ జిల్లాలకు చెందిన వారికి విశాఖలో అగ్నిపథ్‌ ఆర్మీ ర్యాలీ నిర్వహించారు. ఈ ఎంపికలలో ఎన్‌సీసీ సి సర్టిఫికెట్‌ ఉన్న సుమారు 136 మంది అర్హత సాధించారు. దీంతో తమకు రాత పరీక్ష లేకుండా నేరుగా నియామకాలు ఉంటాయని అభ్యర్థులు ఆశించారు. అయితే వీరిలో కేవలం 80 మందినే ఎంపిక చేసి, మిగిలిన 56 మందిని విస్మరించారు. ఎన్‌సీసీ సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ పూర్తయిన వారికి మాత్రమే నియమించామని ఆర్మీ అధికారులు చెబుతున్నారు. దీంతో అభ్యర్థులు ఎన్‌సీసీ కార్యాలయం అధికారులను సంప్రదించగా, తాము అందరి సర్టిఫికెట్‌లను వెరిఫై చేసి పంపామని చెబుతున్నారని అభ్యర్థులు తెలిపారు. ఇప్పటికైనా ఆర్మీ అధికారులు స్పందించి, అర్హులైన అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని అభ్యర్థులు కోరుతున్నారు. ఈమేరకు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.

Updated Date - 2022-11-17T00:45:35+05:30 IST