ఆదివాసీ శిశు మరణాలు ప్రభుత్వ హత్యలే..!

ABN , First Publish Date - 2022-08-09T06:24:19+05:30 IST

పెదబయలు మండలంలోని రూడకోట గ్రామంలో జరిగిన శిశు మరణాలు ప్రభుత్వ హత్యలేనని ఆదివాసీ అధికార్‌ రాష్ట్రీయ మంచ్‌ గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు పి.అప్పలనర్స ఆరోపించారు.

ఆదివాసీ శిశు మరణాలు ప్రభుత్వ హత్యలే..!
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న అప్పలనర్స

నివారణలో అధికారులు, ఐటీడీఏ పీవో వైఫల్యం

గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు అప్పలనర్స

పాడేరు రూరల్‌, ఆగస్టు 8: పెదబయలు మండలంలోని రూడకోట గ్రామంలో జరిగిన శిశు మరణాలు ప్రభుత్వ హత్యలేనని ఆదివాసీ అధికార్‌ రాష్ట్రీయ మంచ్‌ గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు పి.అప్పలనర్స ఆరోపించారు. స్థానిక గిరిజన సంఘం కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పాతరూడకోటలో గిరిజన సంఘం రాష్ట్ర ప్రతినిధులు బి.సన్నిబాబు, కె.పృథ్వీరాజ్‌ బృందంతో కలిసి ఆదివారం పర్యటించామన్నారు. ఈ గ్రామంలో 2018 జూన్‌ నుంచి ఇప్పటివరకు 20 మంది చిన్నారులు మృతి చెందారని, ఆ వివరాలు రికార్డుల్లో నమోదు కాలేదని చెప్పారు. శిశువుల మరణాల నివారణకు చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ విశ్వభూషన్‌ హరిచందన్‌ ఆదేశాలు జారీ చేసిన తరువాత కూడా అధికారుల్లో చలనం లేదన్నారు. ఈ విషయంలో ఐటీడీఏ పీవో కూడా వైఫల్యం చెందారన్నారు. కిముడు హిమబిందు కుటుంబానికి చెందిన ముగ్గురు చిన్నారులు మరణించారని, వారిలో ఒక చిన్నారి (2 నెలల పాప) మృతదేహాన్ని ఆగస్టు 2వ తేదీన ఐటీడీఏ పీవో దగ్గరకు తీసుకువెళ్లి పోస్టుమార్టం చేయించి మరణానికి కారణాలను తెలపాలని ప్రాధేయపడినా ఆయన స్పందించకపోవడం దారుణమన్నారు. చిన్నారుల మృతిపై రాష్ట్ర గవర్నర్‌, జాతీయ, బాలల హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. అతని వెంట సంఘ సభ్యులు కొర్రా నర్సయ్య, సోమెలి చిట్టిబాబు ఉన్నారు.


Updated Date - 2022-08-09T06:24:19+05:30 IST