అధికారుల నిర్లక్ష్యానికి దివ్యాంగుడు బలి
ABN , First Publish Date - 2022-10-07T05:36:52+05:30 IST
రైతు భరోసా కేంద్రం భవన నిర్మాణానికి తీసిన పునాదుల గొయ్యిలో పడి దివ్యాంగుడు మృతిచెందాడు.
ఆర్బీకే భవనం పునాదుల గోతిలో పడి మృతి
రెండేళ్ల క్రితం ఆరు అడుగుల లోతున పునాదులు తీసి వదిలేసిన వైనం
వర్షపు నీటితో ప్రాణాంతకంగా మారిన గొయ్యి
ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని సర్పంచ్ ఆరోపణ
మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్
సబ్బవరం, అక్టోబరు 6: రైతు భరోసా కేంద్రం భవన నిర్మాణానికి తీసిన పునాదుల గొయ్యిలో పడి దివ్యాంగుడు మృతిచెందాడు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఒక నిండు ప్రాణం బలైందని, మృతుడి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని సర్పంచ్ డిమాండ్ చేస్తున్నారు. మండలంలోని అసకపల్లి గ్రామంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు...
అసకపల్లి గ్రామంలో రైతు భరోసా కేందం భవన నిర్మాణం కోసం రామాలయం సమీపంలో సుమారు రెండేళ్ల క్రితం స్థలం కేటాయించారు. అధికారులు సాయిల్ టెస్టింగ్ చేయించగా, ఆరు అడుగుల లోతున మట్టి మొత్తం తీసేయాలని చెప్పారు. దీంతో ఆరు అడుగులు లోతున గొయ్యి తీశారు. ఇది జరిగి రెండేళ్లు అవుతున్నప్పటికీ పనులు చేపట్టలేదు. కొద్ది రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో గొయ్యి మొత్తం నీటితో నిండిపోయింది. ఈ నేపఽథ్యంలో గ్రామానికి చెందిన దివ్యాంగుడైన నక్కా రాంప్రసాద్(38) బుధవారం పశువులను మేతకు తోలుకెళ్లి సాయంత్రం తిరిగి కల్లంవద్దకు వచ్చాడు. అయితే ఒక ఆవు రాకపోవడంతో మేతకు తోలిన ప్రాంతానికి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో అతని తల్లి సూర్యకాంతం ఈ విషయాన్ని ఎంపీటీసీ సభ్యుడు కర్రి అప్పారావు, సర్పంచ్ కర్రి నరసింగరావులకు తెలియపరిచి, అర్ధరాత్రి వరకు పరిసరాల్లో గాలించారు. గురువారం ఉదయం రైతు భరోసా కేంద్రం నిర్మాణానికి తీసిన పునాదుల గొయ్యి నీటిలో మృతదేహం తేలింది. గ్రామ పెద్దలు, కుటుంబ సభ్యులు వచ్చి పరిశీలించి మృతిచెందింది రాంప్రసాద్గా నిర్ధారించుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ సురేశ్, సిబ్బంది వచ్చి పంచనామా నిర్వహించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడు దివ్యాంగుడు కావడంతో వివాహం కాలేదని, తల్లి వద్దనే ఉంటూ పశువులను మేపుకుంటూ జీవనం సాగిస్తున్నాడని స్థానికులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ రంగనాథం తెలిపారు.
ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం: సర్పంచ్
సర్పంచ్ కర్రి నరసింగరావు మాట్లాడుతూ, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే వరప్రసాద్ మృతిచెందాడని ఆరోపించారు. ఆర్బీకే భవన నిర్మాణానికి భారీ గొయ్యి తీసి రెండేళ్లు అవుతున్నదని, వర్షాకాలంలో నీరు చేరి చెరువులా మారుతున్నదని అన్నారు. ప్రమాదం పొంచివున్న విషయాన్ని అధికారులు దృష్టికి తీసుకెళ్లానని, మండల సర్వసభ్య సమావేశంలో ప్రస్తావించినా పట్టించుకోలేదన్నారు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.