అధిక దిగుబడినిచ్చే మిరియాల వంగడాలు సిద్ధం
ABN , First Publish Date - 2022-08-04T06:51:17+05:30 IST
విశాఖ ఏజెన్సీ ఆదివాసీ రైతులకు మేలిజాతి మిరియాల వంగడాలు(మొక్కలు) అందుబాటులోకి రానున్నాయి.
- కేరళ నుంచి ఏడు రకాలు దిగుమతి
- ఏడాదిగా పాలిహౌస్‌లో శాస్త్రవేత్తల ప్రయోగాత్మక సాగు
- విజయవంతం కావడంతో వచ్చే నెలలో రైతులకు పంపిణీ చేయడానికి ఏర్పాట్లు
చింతపల్లి, ఆగస్టు 3: విశాఖ ఏజెన్సీ ఆదివాసీ రైతులకు మేలిజాతి మిరియాల వంగడాలు(మొక్కలు) అందుబాటులోకి రానున్నాయి. నాట్లు వేసిన ఏడాదిన్నర కాలానికే దిగుబడులు ప్రారంభమయ్యే విధంగా ఆర్థోట్రాక్ టెక్నాలజీ ద్వారా ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు మొక్కలను అభివృద్ధి చేస్తున్నారు. తెగుళ్లు, చీడపీడలను తట్టుకుని అధిక దిగుబడినిచ్చే ఏడు రకాల వంగడాలను కేరళ నుంచి దిగుమతి చేసుకుని స్థానిక ఉద్యాన పరిశోధన స్థానం(హెచ్‌ఆర్‌ఎస్) శాస్త్రవేత్తలు ఏడాది కాలంగా పాలిహౌస్‌లో ప్రయోగాత్మక సాగు ప్రారంభించారు. ఈ సాగు విజయవంతం కావడంతో వచ్చే నెల నుంచి రైతులకు ఈ కొత్త రకం మొక్కలను పంపిణీ చేసేందుకు శాస్త్రవేత్తలు ఏర్పాట్లు చేస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో కాఫీ తోటల్లో అంతర పంటగా మిరియాలు పండిస్తున్నారు. ఏజెన్సీ పదకొండు మండలాల్లో 98 వేల ఎకరాల్లో మిరియాల పంటను సాగు చేస్తున్నారు. గిరిజన ప్రాంతంలో మిరియాలు ద్వితీయ వాణిజ్య పంటగా గుర్తింపు పొందింది. కేరళ ప్రాంత రైతులు ఎకరానికి 2.5-3 టన్నుల ఎండు మిరియాల దిగుబడి సాధిస్తున్నారు. గిరిజన ప్రాంత రైతులు 1.5 టన్నులకు మించి దిగుబడి సాధించలేకపోతున్నారు. మార్కెట్‌లో మిరియాలు కిలోకి రూ.450-550 ధర పలుకుతోంది. దీంతో గిరిజన ప్రాంత రైతులకు మేలిజాతి వంగడాలను అందించాలనే లక్ష్యంతో వెంకట రామన్నగూడెం ఉద్యాన విశ్వవిద్యాలయం ఉన్నతాధికారుల సహకారంతో స్థానిక పరిశోధన స్థానం ప్రారంభించిన ప్రయోగాత్మక సాగు విజయవంతమైంది. దీంతో రైతులకు మొక్కల పంపిణీకి శాస్త్రవేత్తలు చర్యలు ప్రారంభించారు.
కేరళ నుంచి ఏడు రకాలు దిగుమతి
కేరళ(కాలికట్) ఉద్యాన పరిశోధన స్థానం నుంచి చీడపీడలు, తెగుళ్లను తట్టుకుంటూ అధిక దిగుబడినిచ్చే మేలిజాతి ఏడు రకాల వంగడాలను స్థానిక శాస్త్రవేత్తలు దిగుమతి చేసుకున్నారు. పన్నీరు-1, థేవం, శక్తి, సుభకర, పన్నీరు-5, పీఎల్‌డీ-2, మలబార్ ఎక్సెల్ రకాలను దిగుమతి చేసుకుని ఏడాది కిందట ప్రయోగాత్మక సాగు ప్రారంభించారు. జాతీయ సమగ్ర ఉద్యాన అభివృద్ధి మిషన్(డీఏఎస్‌డీ) పథకం ద్వారా రూ.50 లక్షల నిఽధులతో ప్రయోగాత్మక సాగును శాస్త్రవేత్తలు ప్రారంభించారు.
ఆర్థోట్రాక్ టెక్నాలజీ ద్వారా మొక్కల అభివృద్ధి
సాధారణంగా మిరియాల మొక్కలు నాటిన మూడున్నర ఏళ్ల నుంచి దిగుబడి ప్రారంభమవుతుంది. ఆర్థోట్రాక్(చిగుళ్లు ద్వారా మొక్కల అభివృద్ధి) టెక్నాలజీ ద్వారా అభివృద్ధి చేసిన మొక్కలు నాటుకున్న ఏడాదిన్నరకే దిగుబడి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం పరిశోధన స్థానంలో పాలిహౌస్ నిర్మించి ఆర్థోట్రాక్ టెక్నాలజీ ద్వారా కేరళ నుంచి దిగుమతి చేసుకున్న ఏడు రకాలను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్నారు.
-------
వచ్చే నెలలో మొక్కలు పంపిణీ
వచ్చే నెల నుంచి ఆర్థోట్రాక్ టెక్నాలజీ ద్వారా అభివృద్ధి చేసిన మొక్కలను రైతులకు నామమాత్రపు ధరకు పంపిణీ చేస్తాం. కేరళ నుంచి దిగుమతి చేసుకున్న ఏడు రకాలు గిరిజన ప్రాంతానికి అనుకూలమైనవిగా గుర్తించాం. ఈ కొత్త రకాలు తెగుళ్లను తట్టుకుని ఎకరానికి మూడు టన్నుల ఎండు మిరియాల దిగుబడి ని ఇస్తాయి.
- డాక్టర్ శివకుమార్, అధిపతి, శాస్త్రవేత్త, ఉద్యాన పరిశోన స్థానం, చింతపల్లి