సకాలంలో పనులు పూర్తికాకుంటే చర్యలు

ABN , First Publish Date - 2022-06-07T06:26:35+05:30 IST

ఏజెన్సీలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నాడు- నేడు కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న పనులను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ ఆదేశించారు.

సకాలంలో పనులు పూర్తికాకుంటే చర్యలు
సమావేశంలో మాట్లాడుతున్న ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ


ఆస్పత్రుల్లో నాడు- నేడు పనులు వెంటనే పూర్తి కావాలి 

అధికారులకు ఐటీడీఏ పీవో ఆదేశం

పాడేరు, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): ఏజెన్సీలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నాడు- నేడు కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న పనులను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ ఆదేశించారు. ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం రోడ్లు, భవనాల శాఖ ఇంజనీరింగ్‌ అధికారులు, వైద్యారోగ్యశాఖాధికారులతో పీహెచ్‌సీల్లో నాడు- నేడు పనుల పురోగతిపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్ష్యం మేరకు నిర్దేశించిన సమయానికి పనులు పూర్తి కాకుంటే అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే పెండింగ్‌లో ఉన్న చిన్నపాటి పనులను పది రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. చేపడుతున్న పనుల్లో కచ్చితంగా నాణ్యత పాటించాలని ఆయన సూచించారు. ప్రధానంగా ఎక్కడా రూఫ్‌ లీకేజీలు లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. అలాగే పనులు వేగంగా పూర్తి చేయాల్సిన బాధ్యత ఇంజనీరింగ్‌ అధికారులపైనే ఉందని తెలిపారు. పలు చోట్ల పనులకు సంబంధించిన వివరాలను ఎం.బుక్‌ రికార్డింగ్‌ ఎందుకు చేయలేదని పలువురు ఇంజనీర్లను ఐటీడీఏ పీవో ప్రశ్నించారు. ప్రస్తుతం ఆస్పత్రుల్లో చేపట్టాల్సిన పనుల వివరాలను వైద్యాధికారులను అడిగి నమోదు చేసుకున్నారు. అలాగే విద్యుత్‌ సమస్యలు తలెత్తకుండా ప్రతి పీహెచ్‌సీలోనూ ఇన్వర్టర్లను ఏర్పాటు చేయాలన్నారు. ప్రహరీ గోడల నిర్మాణాలకు స్థలాల సమస్య ఉంటే తన దృష్టికి తీసుకు వస్తే పరిష్కరిస్తామన్నారు. ఈ సమావేశానికి హాజరుకాని వైద్యాధికారులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేస్తామని ఆయన చెప్పారు. విధి నిర్వహణలో అలసత్వాన్ని ప్రదర్శిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. పీహెచ్‌సీ వైద్యులు, సిబ్బంది విధిగా సమయపాలన పాటించాలన్నారు. ఒకే చోట మూడు సంవత్సరాలు పైబడి విధులు నిర్వహిస్తున్న పారామెడికల్‌ సిబ్బంది వివరాలు తమకు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా వైద్య సిబ్బంది డాక్టర్ల మాట వినకపోతే తనకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. స్టాఫ్‌ నర్సులు, ల్యాబ్‌ టెక్నిషియన్‌ పోస్టుల ఖాళీల వివరాలు సమర్పించాలని, పీహెచ్‌సీలో ఇద్దరు డాక్టర్లుంటే నెలకు 15 వైద్య శిబిరాలు, ఒక్కరే ఉంటే నెలకు 10 వైద్య శిబిరాలను నిర్వహించాలని సూచించారు. అలాగే ఎక్కడైనా ఆర్‌ఎంపీల వైద్యం వల్ల ఇబ్బందులుంటే వివరాలు తెలిపితే, వారిపై మండల ఎగ్జిక్యూటివ్‌ మెజిస్ర్టేట్‌తో విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి నెల మొదటి శనివారం ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం, రెండో మంగళవారం ఐసీడీఎస్‌ అధికారులు, సిబ్బందితో సమన్వయ సమావేశం నిర్వహించాలన్నారు. పీహెచ్‌సీ డాక్టర్లు ప్రతి నెలా ముందస్తు టూర్‌ ప్రొగ్రాం, నెలాఖరున టూర్‌ డైరీ ఐటీడీఏ కార్యాలయంలో సమర్పించాలని, వైద్యులు, సిబ్బంది తప్పని సరిగా బయోమెట్రిక్‌ హాజరు నమోదు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఐటీడీఏ ఏపీవో ఎం.వెంకటేశ్వరరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డాక్టర్‌ బి.సుజాత, రోడ్లు, భవనాల శాఖ ఈఈ బాల సుందరబాబు, ఏడీఎంహెచ్‌వో డాక్టర్‌ కె.లీలా ప్రసాద్‌, డీటీసీవో డాక్టర్‌ టి.విశ్వేశ్వరనాయుడు, డీఎంవో సాంబమూర్తి, ఏజెన్సీ మండలాల వైద్యాధికారులు, రోడ్లు, భవనాల శాఖకు చెందిన డీఈఈలు, ఏఈఈలు పాల్గొన్నారు. 

Read more