ఉసురు తీసిన వేగం

ABN , First Publish Date - 2022-09-19T06:48:22+05:30 IST

అతివేగం నిండు ప్రాణాన్ని బలిగొంది.

ఉసురు తీసిన వేగం
ఘటనా స్థలంలో మృతి చెందిన అభిలాష్‌, గాయపడిన రాజు, ప్రకాశ్‌

చెట్టును ఢీకొట్టిన ద్విచక్రవాహనం

ఓ యువకుడి మృతి..  మరో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరం 

స్టీల్‌ప్లాంట్‌ ప్రధానమార్గంలో ప్రమాదం 

ఉక్కుటౌన్‌షిప్‌, సెప్టెంబరు 18: అతివేగం నిండు ప్రాణాన్ని బలిగొంది. ఇద్దరు స్నేహితులతో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా చెట్టును ఢీకొనడంతో ఓ యువకుడు మృతిచెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటన శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత స్టీల్‌ప్లాంట్‌ ప్రధాన మార్గంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... స్టీల్‌ ప్లాంట్‌ టౌన్‌షిప్‌ సెక్టార్‌-5కి చెందిన కొల్లి కృష్ణ రెండో కుమారుడు కొల్లి అభిలాష్‌ (24) ఫుడ్‌ సంబంధిత సంస్థలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. తన స్నేహితులు సెక్టార్‌-1 ప్రాంతానికి చెందిన ఎన్‌.రాజ్‌కుమార్‌ (రాజు), సెక్టార్‌-8కి చెందిన బి.ప్రకాశ్‌తో కలిసి శనివారం అర్ధరాత్రి (ఆదివారం వేకువజాము) రెండు గంటల సమయంలో ద్విచక్రవాహనంపై స్టీల్‌ప్లాంట్‌ మార్గంలోని తెలుగుతల్లి విగ్రహం నుంచి కూర్మన్నపాలెం వస్తున్నారు. ఈ క్రమంలో బైక్‌ బ్రిడ్జి వద్దనున్న చెట్టును బలంగా ఢీకొనడంతో వాహనం నడుపుతున్న అభిలాష్‌ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. రాజు, ప్రకాశ్‌లకు గాయాలవడంతో ఆస్పత్రికి తరలించారు. వీరి పరిస్థితి కూడా విషమంగానే ఉందని సమాచారం. స్టీల్‌ప్లాంట్‌ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని అభిలాశ్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు, క్షతగాత్రులను గాజువాకలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తీవ్రంగా గాయపడిన రాజు వైరింగ్‌ పనులు చేస్తుండగా, ప్రకాశ్‌ స్టీల్‌ప్లాంట్‌లో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్నాడు. 

మద్యం సేవించడంతోనే?

సంఘటనకు ప్రధాన కారణం యువకులు మద్యం సేవించి అతివేగంగా బైక్‌ నడపడమేనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాహనం ఢీకొన్న ధాటికి చెట్టు బెరడు ఊడి పడిపోవడంతో వీరు చాలావేగంగా వాహనం నడిపినట్టు భావిస్తున్నారు. కాగా మృతుడు, క్షతగాత్రులు టౌన్‌షిప్‌ ప్రాంతానికి చెందినవారేనని, అర్ధరాత్రి దాటిన తరువాత వీరు కూర్మన్నపాలెం వైపు ఎందుకు వెళ్తున్నారో తెలియరాలేదని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

Updated Date - 2022-09-19T06:48:22+05:30 IST