ఆటోల్లో ‘అభయం’

ABN , First Publish Date - 2022-09-10T07:03:29+05:30 IST

స్త్రీలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టేందుకు ‘అభయం’ పేరిట యాప్‌ను అధికార యంత్రాంగం అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఆటోల్లో ‘అభయం’
ఆటోల్లో ఫిక్స్‌ చేస్తున్న సెక్యూరిటీ అలారం డివైజ్‌.

మహిళలకు రక్షణ కల్పించేలా చర్యలు 

సెక్యూరిటీ అలారం ఏర్పాటుచేస్తున్న అధికారులు 

ఏదైనా ఆపద ఎదురైతే నిమిషాల్లో ట్రాకింగ్‌

అలారం మోగుతూ సంఘటనా స్థలంలోనే ఆటో ఆగిపోయేలా ఏర్పాట్లు 

గత ప్రభుత్వ హయాంలోనే చర్యలు 

పరికరాల రాకలో ఆలస్యంతో ఆగిన ప్రక్రియ 

తాజాగా పునరుద్ధరిస్తున్న యంత్రాంగం 


మాధవధార, సెప్టెంబరు 9:

స్త్రీలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టేందుకు ‘అభయం’ పేరిట యాప్‌ను అధికార యంత్రాంగం అందుబాటులోకి తీసుకువచ్చింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ఇందుకు రూపకల్పన చేసినప్పటికీ, పరికరాల రాకలో ఆలస్యం, అనంతరం కొవిడ్‌ నేపథ్యంలో ఆచరణలోకి రాలేదు. ప్రస్తుతం పరికరాలు అందుబాటులోకి రావడంతో నగరంలోని సుమారు 20 వేల ఆటోలకు ఈ యాప్‌ను అనుసంధానించే ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు.

విశాఖ నగరంలో పాసింజర్‌ ఆటోల్లో ప్రయాణించే మహిళల భద్రతకు రవాణా, పోలీస్‌ శాఖల పర్యవేక్షణలో ‘అభయం’ పేరిట ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. మహిళల భద్రతకు భరోసా కల్పించేలా, ఆయా సమయాల్లో ప్రయాణిస్తున్న ఆటోలను నియంత్రించేలా అలారం పరికరాలను అమరుస్తున్నారు. రాష్ట్రంలో మొదటి దశలో విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ, విజయవాడల్లో దీనిని అమలుచేస్తున్నారు. పర్యవేక్షణ బాధ్యతలను ఓటీఎస్‌ఐ అనే సంస్థకు అప్పగించారు. 


పరికరం పనిచేస్తుందిలా...

పాసింజర్‌ ఆటోల్లో స్త్రీలు ప్రయాణించే సమయంలో ఎవరైనా అఘాయిత్యాలకు పాల్పడేందుకు యత్నిస్తే వాహనంలో అమర్చిన అలారం బటన్‌ నొక్కితే, నేరుగా పోలీసు శాఖలో వుండే ప్రత్యేక హెల్ప్‌లైన్‌ కాల్‌సెంటర్‌కు సమాచారం అందుతుంది. దీంతో వెంటనే డివైజ్‌ నుంచి ఆటో ఇంజన్‌కు అనుసంధానమయ్యే ఒక కేబుల్‌ ద్వారా ఇంధనం (డీజిల్‌/పెట్రోలు) సరఫరా నిలిచిపోతుంది. అలాగే పెద్ద శబ్దం వెలువడుతూ ఆటో కొంతదూరం ముందుకువెళ్లి ఆగిపోతుంది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని ఆపేంత వరకు అలారం మోగుతూనే ఉంటుంది. ఈ విధమైన రక్షణ వ్యవస్థకు ‘అభయం’గా నామకరణం చేశారు. ఇందులో భాగంగా ఆటోల్లో ప్రత్యేక సెక్యూరిటీ సీరియల్‌ నంబర్‌తో వుండే పరికరాలను ప్రయాణికులు కూర్చునే సీటు పక్కన అమరుస్తున్నారు. అంతేకాకుండా ఈ డివైజ్‌పై అభయం కాల్‌ సెంటర్‌కు సంబంధించిన రెండు ఫోన్‌ నంబర్లు 94934 48415, 75694 33801 ముద్రించి ఉంచుతున్నారు. అత్యవసర సమయంలో ఆయా నంబర్లకు ఫోన్‌ చేసి కూడా రక్షణ పొందే అవకాశం ఉంటుంది. దీంతోపాటు అభయం మొబైల్‌ యాప్‌ ద్వారా కూడా రక్షణ చర్యలు చేపడుతున్నట్టు ఈ ప్రాజెక్టు విశాఖ కో-ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్న ఆర్టీఏ కార్యాలయ అధికారి మునీషా తెలియజేశారు. యాప్‌ ద్వారా ఆటోల్లో వుండే క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసినా ఆటో డ్రైవర్‌తో సహా వాహనం పూర్తి సమాచారం కాల్‌సెంటర్‌కు చేరుతుందన్నారు. 


నగరంలో 20 వేల ఆటోలు 

విశాఖ నగరంలో ప్రస్తుతం 20 వేల ఆటోలు ఉన్నాయని, వాటిలో ఇప్పటికే 12 వేల ఆటోలకు అభయం పరికరాలను అమర్చినట్టు మునీషా వివరించారు రోజుకు 250కి పైగా ఆటోలకు పరికరాలను అమరుస్తున్నామన్నారు.  


దిశ, అభయం యాప్‌ల అనుసంధానం 

దిశ, అభయం యాప్‌లను వేర్వేరుగా కాకుండా, ఒకటే మొబైల్‌ యాప్‌గా అందుబాటులోకి తేవాలని పోలీసు శాఖ ఉన్నతాధికారులు సూచించారని, దీనిపై ఓటీఎస్‌ఐ సంస్థతో చర్చించి, మార్పులు తెచ్చే అవకాశాలను పరిశీలిస్తున్నామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం అమరుస్తున్న పరికరాలు ఆటోల్లో ఎలాంటి ఆపద జరగకుండా నిరోధించేందుకు ఉద్దేశించినవంటున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో చిన్న పిల్లలు సెక్యూరిటీ అలారం నొక్కడం వంటి పొరపాట్లు చేసినా, కాల్‌సెంటర్‌కు వచ్చిన సమాచారాన్ని మదింపు చేసుకుని, నేరాలను అదుపుచేసేలా యాప్‌ ప్రొవైడర్ల సాయంతో ముందడుగు వేస్తున్నారు. 


ఉచితంగానే పరికరాలు 

ప్రస్తుతం అలారం పరికరాలను మాధవధార పాత టెస్ట్‌ గ్రౌండ్‌, గంభీరం, అగనంపూడి ఆర్టీఏ కార్యాలయాల్లో అమరుస్తున్నామని, దీనికి చివరి తేదీ లేదన్నారు. కానీ ప్రతి ఆటోవాలా తప్పనిసరిగా అభయం పరికరాలను తమ వాహనంలో అమర్చుకోవాలని కో-ఆర్డినేటర్‌ మునీషా తెలిపారు. ఈ పరికరాలను ఉచితంగానే అమరుస్తున్నామని, ఎలాంటి చార్జీలు వసూలు చేయడం లేదన్నారు. ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేసి, మహిళలందరికీ తెలిసేలా ఆర్టీఏ సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారని ఆమె వివరించారు. 

Updated Date - 2022-09-10T07:03:29+05:30 IST