పారిశుధ్య కార్మికుల ఆకలి కేకలు!
ABN , First Publish Date - 2022-08-04T07:03:33+05:30 IST
పంచాయతీల్లో పరిశుభ్రత కోసం నిరంతరం శ్రమించే పారిశుధ్య కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది..
నెలల తరబడి అందని వేతనాలు
రూ.10 కోట్లకుపైగా బకాయిలు
మండల కేంద్రాల్లో నిరసనలు
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
పంచాయతీల్లో పరిశుభ్రత కోసం నిరంతరం శ్రమించే పారిశుధ్య కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది.. కరోనా సమయంలో కూడా వీరి సేవలు ప్రజలకు అందాయి. గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీల పరిధిలో నిరంతరం కష్టపడే వీరి సేవలకు ప్రభుత్వం తగిన గుర్తింపు నివ్వడం లేదు. అసలే అరకొర వేతనాలు, అవి కూడా సకాలంలో చెల్లించకపోవడంతో కార్మికులు ఆకలితో అలమటించాల్సిన పరిస్థితి నెలకొంది. గత పది నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో కుటుంబ పోషణ కష్టంగా మారిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేసిన పనికి సకాలంలో వేతనాలు అందక పొట్ట చేతపట్టుకొని వేతనాల కోసం ఆందోళన బాట పట్టారు.
జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో 2,150 మంది పారిశుధ్య కార్మికులు పని చేస్తున్నారు. వీరికి నెలకు రూ.6 వేల చొప్పున గౌరవ వేతనం చెల్లించాలి. జీవన వ్యయం విపరీతంగా పెరిగిపోతున్న ప్రస్తుత తరుణంలో ఈ వేతనాలతో ఇల్లు గడవడం అసాధ్యం అయినప్పటికీ ప్రభుత్వం వేతనాలను పెంచుతుందన్న ఆశతో విధులు నిర్వహిస్తున్నట్టు వారు చెబుతున్నారు.
గ్రామాల్లో పేరుకుపోయిన చెత్తను తరలించి, గ్రామ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడానికి గత టీడీపీ ప్రభుత్వంలో పారిశుధ్య కార్మికులను (గ్రీన్ అంబాసిడర్స్) నియమించారు. అప్పట్లో ప్రతినెలా వేతనాలు సకాలంలో అందేవి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పారిశుధ్య కార్మికులకు వేతన కష్టాలు మొదలయ్యాయి. సాధారణంగా గ్రామ పంచాయతీల్లో పారిశుధ్య కార్మికుల వేతనాల చెల్లింపునకు ఆర్థిక సంఘం నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థిక సంఘం నిధులను పంచాయతీల సర్పంచ్లకు తెలియకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇతర పథకాలకు వాడుకుంటున్నది. దీంతో నిధులు లేక పారిశుధ్య కార్మికులకు వేతనాలు చెల్లించలేకపోతున్నామని అధికార పార్టీకి చెందిన సర్పంచులు సైతం బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు.
జిల్లాలో పది నెలలుగా పారిశుధ్య కార్మికులకు వేతన బకాయిలు పేరుకుపోయాయి. అధికారుల లెక్కల ప్రకారం రూ.10 కోట్లకు పైగా కార్మికులకు చెల్లించాల్సి ఉంది. ఇచ్చే అరకొర వేతనాలు సకాలంలో చెల్లించకపోవడంతో కుటుంబ పోషణకు అప్పులు చేయాల్సి వస్తుందని పారిశుధ్య కార్మికులు ఆవేదన చెందుతున్నారు. బకాయిలు చెల్లించకపోవడంతో ఆందోళన బాట పట్టారు. పంచాయతీ కార్యాలయాలు, మండల కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. జిల్లాలోని గొలుగొండ మండలంలో పారిశుధ్య కార్మికులకు రెండేళ్లుగా వేతనాలు అందలేదు.
కాగా పంచాయతీల్లో పనిచేసే పారిశుధ్య కార్మికులకు వేతనాలు సకాలంలో చెల్లించకపోవడమే కాకుండా విధి నిర్వహణలో వినియోగించే వస్తువులను సైతం అందజేయడం లేదని ఆరోపిస్తున్నారు. చట్ట ప్రకారం ప్రతి కార్మికుడికి నెలకు కనీస వేతనం రూ.21 వేలు ఇవ్వాలి. సబ్బులు, నూనె, చెప్పులు, యూనీఫారాలు పంపిణీ చేయాలి. కానీ చాలా పంచాయతీల్లో ఇవి అందజేయడంలేదు. ఇతర ఔట్సోర్సింగ్ సిబ్బందికి చెల్లిస్తున్న మాదిరిగానే వేతనాలను నెలనెలా బ్యాంకు ఖాతాల్లో వేతనాలు జమ చేయాలని వారు కోరుతున్నారు.