ఆదాయానికి అడ్డాకులు

ABN , First Publish Date - 2022-06-02T06:22:03+05:30 IST

మన్యంలో వేసవి కాలం వచ్చిందంటే అడవులకు వెళ్లి అడ్డాకులను సేకరించడమే ప్రధాన వ్యాపకంగా గిరిజనులు జీవనం సాగిస్తారు.

ఆదాయానికి అడ్డాకులు



ఫొటో రైటప్స్‌: 1పిడిఆర్‌ 1: పాడేరు మండలం గుత్తులపుట్టులో కొనుగోలు చేసిన అడ్డాకులు 

1పిడిఆర్‌ 2: అడవి నుంచి అడ్డాకులను సేకరించి తీసుకుని వస్తున్న గిరిజనులు 

1పిడిఆర్‌ 6: అడ్డాకులను మైదాన ప్రాంతాలకు తరలించేందుకు వాహనాల్లో లోడ్‌ చేస్తున్న దృశ్యం 



- గిరిజనులకు సిరులు కురిపిస్తున్న అడ్డాకుల సేకరణ

- ఈ ఏడాది ముమ్మరంగా సేకరణ, విక్రయాలు 

- 50 కిలోల కావిడ ఆకులు రూ.2 వేలు నుంచి రూ.2,500కు అమ్మకం

- ధర గిట్టుబాటు కావడంతో ఆనందం

- ఏజెన్సీ వ్యాప్తంగా 20 వేల టన్నుల ఆకుల సేకరణ 


అడ్డాకులు గిరిజనులకు ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. ప్రస్తుతం గిట్టుబాటు ధర ఉండడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో 50 కిలోలుండే కావిడ ఆకులు కేవలం రూ.1000 నుంచి  రూ.1500 మధ్య ధర పలకగా, ఈ ఏడాది రూ.2000 నుంచి రూ.2,500 వరకు వస్తుండడంతో ఆకుల సేకరణపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. అయితే ఆకుల ఉత్పత్తి తగ్గుతుండడం కొంత ఆందోళన కలిగించే అంశం.


(పాడేరు, ఆంధ్రజ్యోతి)

మన్యంలో వేసవి కాలం వచ్చిందంటే అడవులకు వెళ్లి అడ్డాకులను సేకరించడమే ప్రధాన వ్యాపకంగా గిరిజనులు జీవనం సాగిస్తారు. దీంతో వారికి అదనపు ఆదాయం లభిస్తుండటంతో అడ్డాకుల సేకరణపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నారు. ఏజెన్సీ వ్యాప్తంగా 20 వేల టన్నుల అడ్డాకులను గిరిజనులు సేకరించి వారపు సంతల్లో వర్తకులకు విక్రయిస్తున్నారని ఒక అంచనా. ప్రస్తుతం అడ్డాకుల సీజన్‌ కావడంతో గిరిజనులంతా వాటి సేకరణపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఏజెన్సీ వ్యాప్తంగా అన్ని మండలాల్లోనూ గిరిజనులు అడ్డాకులను సేకరిస్తారు. తొలకరి వర్షాలు కురిసే వరకు గిరిజనులు అడ్డాకుల సేకరణ, విక్రయాలపైనే దృష్టి కేంద్రీకరిస్తుంటారు. వర్షాలు ప్రారంభంతో ఖరీఫ్‌ వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతారు. కొవిడ్‌ కారణంగా గత రెండేళ్లుగా అడ్డాకుల మార్కెట్‌ లేకపోవడంతో ఆదాయం కోల్పోయారు. ప్రస్తుతం పరిస్థితులు కుదుటపడడంతో అడ్డాకులకు జాతీయ మార్కెట్‌లో డిమాండ్‌ ఏర్పడింది. దీంతో ఈ ఏడాది అడ్డాకుల సేకరణతో  ఆదాయం పొందుతున్నారు. 


కొవిడ్‌తో రెండేళ్లు క్రయ విక్రయాలు బంద్‌

కొవిడ్‌ కారణంగా గత రెండేళ్లు అడ్డాకుల విక్రయాలు జరగలేదు. కొవిడ్‌ ప్రభావంతో దేవాలయాలు, హోటళ్లు మూతపడడంతో అడ్డాకులకు గిరాకీ లేకుండా పోయింది. దేశంలో తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో దేవాలయాలు, హోటళ్లలో అడ్డాకులను అధికంగా వాడతారు. అలాగే ఉత్తర భారతదేశంలోనూ పర్యావరణ హితంగా అడ్డాకులను వినియోగిస్తారు. అయితే కొవిడ్‌ సమయంలో దేశ వ్యాప్తంగా అడ్డాకుల కొనుగోళ్లు నిలిచిపోయాయి. రెండేళ్లుగా అడ్డాకులతో గిరిజనులు ఆదాయం పొందలేని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం పరిస్థితులు సద్దుమణగడంతో ఈ ఏడాది అడ్డాకుల క్రయవిక్రయాలు జోరందుకున్నాయి.


ఆశాజనకంగా అడ్డాకుల ధర

గత రెండేళ్లుగా క్రయవిక్రయాలు నిలిచిపోవడంతో ఈ ఏడాది అడ్డాకుల ధర ఆశాజనకంగా ఉంది. గతంలో 50 కిలోలుండే కావిడ ఆకులను కేవలం రూ.1000 నుంచి రూ.1500లకు మాత్రమే వర్తకులు కొనుగోలు చేసేవారు. కానీ ఈ ఏడాది అదే కావిడ ఆకులు రూ.2 వేలు నుంచి రూ.2,500 వరకు ధర పలుకుతోంది. ప్రస్తుతం పాడేరు మండలం గుత్తులపుట్టు, హుకుంపేట, డుంబ్రిగుడ మండలం కించుమండ, జి.మాడుగుల, చింతపల్లి మండలం అన్నవరం, అనంతగిరి మండలం డముకు, కాశీపట్నం వారపు సంతల్లో అడ్డాకుల కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. అనకాపల్లి జిల్లా పరిధిలోని మైదాన ప్రాంతాలైన వి.మాడుగుల, రావికమతం, రోలుగుంట, విజయనగరం జిల్లా శృంగవరపుకోట ప్రాంతాలకు చెందిన వర్తకులు వారపు సంతల్లో అడ్డాకులను కొనుగోలు చేసి వాహనాల్లో తమ ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. అక్కడ నుంచి రాజమండ్రి, తుని, చెన్నై మార్కెట్‌లకు తరలిస్తారు. మరో నెలన్నర రోజులు అడ్డాకుల సీజన్‌ కొనసాగుతుంది. ఏదిఏమైనా ఈ ఏడాది అడ్డాకుల ధర ఆశాజనకంగా ఉండడంతో గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 


అడ్డాకుల పునరుత్పత్తికి చర్యలు అనివార్యం

ఏజెన్సీలో గతంలో అత్యధికంగా అడ్డాకుల ఉత్పత్తి అయ్యేవి. పదేళ్ల క్రితం వరకు ఏజెన్సీలో సుమారుగా లక్ష టన్నుల అడ్డాకులు ఉత్పత్తి అయ్యేవి. ఫలితంగా వ్యవసాయ పనులు లేని వేసవి కాలంలో గిరిజనులకు అడ్డాకుల ద్వారా చక్కని ఆదాయం లభించేది. అయితే గిరిజనులు సైతం అడ్డాకుల సేకరణలో శాస్త్రీయ పద్ధతులు పాటించకపోవడం, జీసీసీ, అటవీ శాఖ వంటి ప్రభుత్వ సంస్థలు అడ్డాకుల పునరుత్పత్తికి ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో క్రమంగా ఆకుల ఉత్పత్తి క్షీణిస్తోంది. అందువల్లే గత పదేళ్లతో పోల్చితే ప్రస్తుతం 20 వేల టన్నులు మాత్రమే అడ్డాకులు ఉత్పత్తి అవుతోందని స్పష్ట్టమవుతుంది. అయితే ఇదే పరిస్థితి కొనసాగితే కొన్నాళ్లకు ఏజెన్సీలో అడ్డాకులు పూర్తిగా అంతరించి పోయే ప్రమాదముందని పలువురు పర్యావరణవేత్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత తరుణంలో అడ్డాకుల పునరుత్పత్తికి చర్యలు చేపడితేనే భావితరాలకు అడ్డాకులను అందించే అవకాశం ఉంటుందని, లేకుంటే రానున్న రోజుల్లో అడవుల్లో అడ్డాకులు లేని పరిస్థితి ఏర్పడుతుందని చెబుతున్నారు.


Updated Date - 2022-06-02T06:22:03+05:30 IST