ముడసర్లోవలో యువకుడి గల్లంతు

ABN , First Publish Date - 2022-07-07T06:28:10+05:30 IST

ముడసర్లోవ రిజర్వాయర్‌లో ఈతకు దిగిన యువకుడు గల్లంతయ్యాడు. పుట్టినరోజునాడే జరిగిన ఈ దారుణం ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది.

ముడసర్లోవలో యువకుడి గల్లంతు
నరేష్‌ (ఫైల్‌ఫొటో)

పుట్టిన రోజునాడే విషాదం

ఆరిలోవ, జూలై 6: ముడసర్లోవ రిజర్వాయర్‌లో ఈతకు దిగిన యువకుడు గల్లంతయ్యాడు.  పుట్టినరోజునాడే జరిగిన ఈ దారుణం ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. ఆరిలోవ సీఐ ఇమాన్యుల్‌రాజు తెలిపిన వివరాల మేరకు... పెదగదిలికి చెందిన  సీహెచ్‌ నరేష్‌ (23)  బుధవారం ముడసర్లోవ రిజర్వాయర్‌ వెనుక భాగాన గల తోటలో తన పుట్టినరోజు సందర్భంగా స్నేహితులతో కలిసి కేక్‌ కట్‌చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం అంతా కలసి రిజర్వాయర్‌లో ఈతకు దిగారు. కొద్దిసేటి తరువాత అంతా ఒడ్డుకు చేరుకున్నా, నరేష్‌ కనిపించలేదు. ఆందోళన చెందిన స్నేహితులు గాలించినా జాడ కానరాకపోవడంతో  అతడి భార్య గీతా రాణికి సమాచారం అందించారు.  ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు రిజర్వాయర్‌ వద్దకు వెళ్లి గజ ఈతగాళ్లను పెట్టి గాలిస్తున్నామన్నారు. నరేష్‌కు ఏడాది వయసున్న కుమార్తె ఉంది. ఇతడు స్థానికంగా ప్రైవేటు ఎలక్ట్రీషియన్‌. 

Updated Date - 2022-07-07T06:28:10+05:30 IST