రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

ABN , First Publish Date - 2022-10-07T06:23:42+05:30 IST

మండలంలోని టి.అర్జాపురంలో బుధవారం స్నేహితులతో పార్టీ చేసుకొని ద్విచక్ర వాహనం వస్తుండగా ప్రమాదానికి గురై మడగల రామ్‌ప్రకాష్‌ (19) మృతి చెందాడు. దీనిపై కొత్తకోట ఎస్‌ఐ విభూషణరావు అందించిన వివరాలిలా ఉన్నాయి.

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
రాంప్రకాష్‌ (ఫైల్‌)

రావికమతం, అక్టోబరు 6: మండలంలోని టి.అర్జాపురంలో బుధవారం స్నేహితులతో పార్టీ చేసుకొని ద్విచక్ర వాహనం వస్తుండగా ప్రమాదానికి గురై మడగల రామ్‌ప్రకాష్‌ (19) మృతి చెందాడు. దీనిపై కొత్తకోట ఎస్‌ఐ విభూషణరావు అందించిన వివరాలిలా ఉన్నాయి. టి.అర్జాపురం గ్రామానికి చెందిన స్నేహితులు దసరా పండుగ సందర్భంగా గ్రామానికి సమీపంలో మామిడితోటలో పార్టీ చేసుకొని తిరిగి ఇంటికి ద్విచక్ర వాహనంపై వస్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. వెంటనే స్నేహితులు రాంప్రకాష్‌ను నర్సీపట్నం ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు.  స్నేహితులు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేస్తామన్నారు. 


మనస్తాపంతో మహిళ ఆత్మహత్య

భర్త మందలించడంతో అఘాయిత్యం

చింతపల్లి, అక్టోబరు 6: కల్లు తాగినందని భర్త మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన భార్య పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గూడెంకొత్తవీధి మండలం గుర్రాళ్లగొంది గ్రామంలో వంత గులాబి, కొసం దంపతులు నివాసముంటున్నారు. వారికి ఆరుగురు సంతానం. బుధవారం దసరా పండగ సందర్భంగా భార్య కొసం(40) జీలుగు కల్లు తాగింది. కల్లు ఎందుకు తాగావని ఆమెను భర్త గట్టిగా మందలించాడు. దీంతో ఆమె మనస్తాపానికి గురై పొలంలో పిచికారీ చేసేందుకు తీసుకొచ్చిన పురుగుల మందును ఆదే రోజు సాయంత్రం తాగేసింది. కుటుంబ సభ్యులు చింతపల్లి ఏరియా ఆస్పత్రికి తీసుకువచ్చారు. అయితే అప్పటికే ఆమె పరిస్థితి విషమించి మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. 


 పురుగుల మందు తాగిన వ్యక్తి మృతి

కొత్తూరు, అక్టోబరు 6 : మద్యం అనుకొని పురుగుల మందు తాగిన వ్యక్తి గురువారం మధ్యాహ్నం మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి రూరల్‌ ఎస్‌ఐ సిహెచ్‌ నర్సింగరావు తెలిపిన వివరాలివి. అనకాపల్లి మండలం అక్కిరెడ్డిపాలేనికి చెందిన గొల్లవిల్లి చిన్నారావు (37) బుధవారం దసరా కావడంతో ఉదయం నుంచి మద్యం తాగుతూ మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు. ఇంట్లో ఉన్న పురుగుల మందును మద్యం అనుకొని తాగాడు. ఇది గుర్తించిన భార్య వెంటనే అతనిని ఎన్టీఆర్‌ ఆసుపత్రికి తరలించింది. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం విశాఖ కేజీహెచ్‌కు వైద్యులు పంపారు. అక్కడ చికిత్స పొందుతూ  గురువారం మధ్యాహ్నం  మృతి చెందినట్టు భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. చిన్నారావు తాపీమేస్త్రీగా పనిచేస్తూ భార్య, కుమార్తె, కుమారుడ్ని పోషించేవాడు.  ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

గుర్తు తెలియని వాహనం ఢీకొని..

ఎస్‌.రాయవరం, అక్టోబరు 6 : మండలంలోని గెడ్డపాలెంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందినట్టు ఎస్‌ఐ ప్రసాదరావు తెలిపారు. గెడ్డపాలేనికి చెందిన దాడిశెట్టి శ్రీనివాసరావు (47) అడ్డరోడ్డులో అరటి పండ్ల  వ్యాపారం చేస్తుండేవాడు. ఎప్పటిలాగే బుధవారం ఉదయం అడ్డరోడ్డు వెళ్లి వ్యాపారం ముగించుకుని ఇంటికి బైక్‌పై బయల్దేరాడు. మార్గ మధ్యలో అడ్డరోడ్డుకు సమీపం జాతీయ రహదారిపైకి వచ్చేసరికి అదే దారిలో గుర్తు తెలియని వాహనం బైక్‌ను ఢీకొనడంతో తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఇతని భార్య రెండేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. శ్రీనివాసరావుకు ఇద్దరు కుమారులు ఉండగా అందులో ఒకరికి వివాహం కాగా, మరో కుమారుడు ఇంటర్‌ చదువుతున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


 దుగ్గాడ ఆనకట్టలో వ్యక్తి గల్లంతు 

నర్సీపట్నం అర్బన్‌, అక్టోబరు 6: మండలంలోని దుగ్గాడ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి దుగ్గాడ ఆనకట్ట దాటుతుండగా నీటి ప్రవాహానికి గల్లంతయ్యాడు. స్థానికులు, కుటుంబ సభ్యులు అందించిన కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన నిద్దర సత్తిబాబు(35) గురువారం సాయంత్రం మూడు గంటల సమయంలో ఆనకట్టు అవతల గల పొలాల్లోకి వెళ్లడం కోసం దుగ్గాడ ఆనకట్టు దాటుతుండగా నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాడని స్థానికులు తెలిపారు. ఈ సమాచారాన్ని స్థానిక సర్పంచ్‌ నిద్దర లలిత భర్త శ్రీనివాసరావుకు స్థానికులు అందించారు. వెంటనే ఆయన ఈ సమాచారం అగ్నిమాపక కేంద్రానికి అందించారు. అగ్రిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. దీనిపై ఎటువంటి సమాచారం అందలేదని నర్సీపట్నం రూరల్‌ పోలీసులు తెలిపారు. 

Read more