సెజ్ పరిధిలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించాలి
ABN , First Publish Date - 2022-08-04T06:48:23+05:30 IST
అచ్యుతాపురం సెజ్ పరిధిలో పరిశ్రమలు ఎక్కువగా ఉన్నందున అక్కడ 500 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం చేపట్టాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
టీడీపీ జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్
అనకాపల్లి టౌన్, ఆగస్టు 3 : అచ్యుతాపురం సెజ్ పరిధిలో పరిశ్రమలు ఎక్కువగా ఉన్నందున అక్కడ 500 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం చేపట్టాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ వైద్యాలయం వద్ద బుధవారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ సెజ్ పరిధిలోని కంపెనీల్లో తరుచూ ఏదో ఒకచోట ప్రమాదాలు జరుగుతున్నందున, మంత్రి గుడివాడ అమర్నాథ్ పరిశ్రమల శాఖకు ప్రాతినిథ్యం వహిస్తున్నందున ఆస్పత్రి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలన్నారు. కంపెనీ యాజమాన్యాలు అవసరమైతే సీఎస్ఆర్ నిధుల నుంచి నిర్మాణానికి నిధులు కేటాయించేందుకు ముందుకు రావాలని సూచించారు. మంత్రి అసమర్ధత వల్లే పరిశ్రమల్లో సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపించారు. జూన్ మూడో తేదీన సీడ్స్ కంపెనీలో జరిగిన ప్రమాదంపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం విచారకరమన్నారు. ఐఐసీటీ నివేదిక ఇంతవరకు ఎందుకు బయట పెట్టలేదని ప్రశ్నించారు. విషవాయివు లీకైన ఘటనలో తీవ్ర అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు వారికి నష్టపరిహారం కూడా చెల్లించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో టీడీపీ ఎలమంచిలి నియోజకవర్గ ఇన్చార్జి ప్రగడ నాగేశ్వరరావు, పార్టీ నాయకులు బీఎస్‌ఎంకే జోగినాయుడు, దొడ్డి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
సీడ్స్ ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి సత్యనారాయణమూర్తి
అచ్యుతాపురం సీడ్స్ కంపెనీలో ఘటనపై కారకులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి సత్యనారాయణమూర్తి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఆయన ఇక్కడి విలేఖర్లతో మాట్లాడుతూ సీడ్స్ కంపెనీలో తరుచూ గ్యాస్ లీకేజీ ఘటనలతో వందలాది మంది మహిళా కార్మికులు అనారోగ్యానికి గురువుతున్నట్టు చెప్పారు. గార్మెంట్స్ పరిశ్రమలో రసాయనాలు తీవ్రస్థాయిలో వెలువడతాయని, దానివల్లే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయన్నారు. ఈ పరిశ్రమలో విషవాయువు లీకేజీపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ సుమోటోగా స్వీకరించిందన్నారు.
యాజమాన్యం నిర్లక్ష్యమే కారణం
- సీపీఎం జిల్లా కార్యదర్శిలోకనాథం
సెజ్‌లోని సీడ్స్ కంపెనీలో ప్రమాదానికి యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని సీపీఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం ఆరోపించారు. బుధవారం ఇక్కడి విలేఖర్లతో మాట్లాడుతూ కంపెనీ యాజమాన్యంపై క్రిమినల్ కేసు పెట్టి, అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే బాఽధితులకు మెరుగైన వైద్యసేవలందించాలని కోరారు. ఉమ్మడి విశాఖ జిల్లా పారిశ్రామిక ప్రాంతంలోని పరిశ్రమల్లో ఎలాంటి భద్రతా చర్యలు లేవని ఆరోపించారు. కార్పొరేట్లకు రాష్ట్ర ప్రభుత్వం కొమ్ముకాస్తుందని విమర్శించారు.