టౌన్‌ప్లానింగ్‌కు మహా చెక్‌

ABN , First Publish Date - 2022-12-02T01:24:08+05:30 IST

టౌన్‌ప్లానింగ్‌ విభాగంపై వస్తున్న ఫిర్యాదులకు అడ్డుకట్ట వేయడంపై జీవీఎంసీ అధికారులు దృష్టిసారించారు.

టౌన్‌ప్లానింగ్‌కు మహా చెక్‌

అక్రమాలు, అవకతవకలపై ఫిర్యాదుల స్వీకరణకు జీవీఎంసీలో కాల్‌సెంటర్‌

8187897569కి ఫోన్‌ చేస్తే కమిషనర్‌, చీఫ్‌ సీటీ ప్లానర్‌ దృష్టికి సమస్య

కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి పర్యవేక్షణ

సెంటర్‌ ఏర్పాటుపై అధికార పార్టీకి చెందిన కొంతమంది కార్పొరేటర్ల కినుక

అడ్డుకునేందుకు చివరివరకూ యత్నం

విశాఖపట్నం, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి):

టౌన్‌ప్లానింగ్‌ విభాగంపై వస్తున్న ఫిర్యాదులకు అడ్డుకట్ట వేయడంపై జీవీఎంసీ అధికారులు దృష్టిసారించారు. అందుకోసం ప్రత్యేకంగా ఒక కాల్‌సెంటర్‌ (8187897569)ను ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. టౌన్‌ప్లానింగ్‌ విభాగంలో అక్రమాలు, అవినీతితో పాటు రోడ్లపై భవన నిర్మాణ సామగ్రి, డెబ్రిస్‌ వంటివి ఎక్కడైనా వుంటే ఫిర్యాదు చేసేందుకు కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ సెంటర్‌ను ఏర్పాటుచేశారు. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లోని సిబ్బంది ఆ నంబర్‌కు వచ్చే కాల్స్‌ను రిసీవ్‌ చేసుకుని ఫిర్యాదులను జీవీఎంసీ కమిషనర్‌, చీఫ్‌ సిటీప్లానర్‌ల దృష్టికి తీసుకువెళతారు. కాల్‌సెంటర్‌ ద్వారా తీసుకున్న ఫిర్యాదుపై తగిన సమాచారం ఫిర్యాదుదారుడికి తెలియజేయాల్సి ఉంటుంది కాబట్టి కచ్చితంగా అక్రమాలపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల అనధికార నిర్మాణాలు, ప్రభుత్వ భూములు, గెడ్డలను ఆక్రమించి చేపట్టే నిర్మాణాలకు అడ్డుకట్ట పడుతుందని జీవీఎంసీ అధికారులు భావిస్తున్నారు. కాల్‌సెంటర్‌కు సంబంధించిన ఫోన్‌ నంబర్‌ను జీవీఎంసీ కమిషనర్‌ పి.రాజాబాబు బుధవారం విడుదల చేశారు.

ఇదిలావుండగా టౌన్‌ప్లానింగ్‌లో అక్రమాలపై ప్రజలు ఫిర్యాదు చేసేందుకు వీలుగా ప్రత్యేకంగా కాల్‌సెంటర్‌ ఏర్పాటుచేయనున్నట్టు కమిషనర్‌ ప్రకటించిన వెంటనే కొంతమంది కార్పొరేటర్లు ఉలిక్కిపడ్డారు. ఫోన్‌ నంబర్‌ అందుబాటులోకి తెస్తే తమ వార్డులో జరిగే అనధికార నిర్మాణాలు, ఇతర ఉల్లంఘనలపై ఇతరులు ఫిర్యాదుచేసే అవకాశం ఉంటుందని, అదే జరిగితే తమ కనుసన్నల్లో జరిగే వ్యవహారాలన్నీ బయటపడతాయని ఆందోళన చెందారు. అందుకే కాల్‌సెంటర్‌ ఏర్పాటు ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలంటూ కొంతమంది కార్పొరేటర్లు గత రెండు రోజులుగా జీవీఎంసీ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారు. ప్రతి వార్డులో జరిగే అక్రమ నిర్మాణాలకు అధికార పార్టీ కార్పొరేటర్లు, పార్టీ వార్డు అధ్యక్షుల అండదండలు ఉంటున్నాయనేది బహిరంగ రహస్యం. వార్డులో ఎవరైనా నిర్మాణం చేపట్టాలంటే అధికార పార్టీ కార్పొరేటర్‌ను లేదంటే వార్డు అధ్యక్షులను కలిసి ప్రసన్నం చేసుకోవాల్సిందే. అలాకాకుండా ఎవరైనా నిర్మాణం మొదలెడితే అధికారులపై ఒత్తిడి తెచ్చి ఆటంకం కలిగిస్తుంటారు. ఇప్పుడు అనధికార నిర్మాణాలు, ఇతర ఉల్లంఘనలు జరిగితే నేరుగా జీవీఎంసీ కమిషనర్‌, చీఫ్‌ సిటీప్లానర్‌ దృష్టికి వెళ్లేలా ప్రత్యేకంగా ఫోన్‌ నంబర్‌(కాల్‌సెంటర్‌)ను ఏర్పాటుచేయడం వల్ల తమ హవాకు అడ్డుకట్టపడుతుందని కార్పొరేటర్లు భావిస్తున్నారు. అయితే అధికారులు మాత్రం ప్రస్తుతానికి కార్పొరేటర్ల ఒత్తిడికి తలొగ్గకుండా కాల్‌సెంటర్‌ ఏర్పాటుచేయాలని నిర్ణయించుకున్నారు. కాల్‌సెంటర్‌లోని ఫోన్‌ నంబర్‌ (8187897569)కు ఎవరైనా ఫిర్యాదు చేస్తే కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లోని సిబ్బంది ఆయా వివరాలను తీసుకుని ఆన్‌ లైన్‌లో కమిషనర్‌, సీసీపీకి పంపిస్తారు. అక్కడి నుంచి ఎలాంటి స్పందన వచ్చిందో తెలుసుకుని తిరిగి ఫిర్యాదుదారుడికి చేరవేస్తారు. దీంతోపాటు టౌన్‌ప్లానింగ్‌ విభాగానికి సంబంధించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు వీలుగా ప్రతి బుధవారం టౌన్‌ప్లానింగ్‌ గ్రీవెన్స్‌ నిర్వహిస్తున్నారు. బుధవారం తొలిసారిగా సీసీపీ సురేష్‌కుమార్‌ ఆధ్వర్యంలో స్పందన నిర్వహించగా 27 మంది అర్జీలను అందజేశారు. వాటన్నింటినీ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు పంపించి అక్కడి నుంచి ఆయా జోన్‌లకు పంపించి పరిష్కారం చూపుతామని సీసీపీ సురేష్‌కుమార్‌ తెలిపారు.

Updated Date - 2022-12-02T01:24:09+05:30 IST