‘అల్లూరి’ జిల్లాలో ఘోర ప్రమాదం

ABN , First Publish Date - 2022-11-23T02:09:14+05:30 IST

అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం బొడ్డుగూడెం వద్ద మంగళవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

‘అల్లూరి’ జిల్లాలో ఘోర ప్రమాదం

లారీ, బొలెరో ఢీ..8 మంది మృత్యువాత

దైవదర్శనానికి వచ్చి తిరిగిరాని లోకాలకు!

మృతులంతా ఛత్తిస్‌గఢ్‌ వాసులు.. ఒకే కుటుంబ సభ్యులు

మృతుల్లో ముగ్గురు మహిళలు.. మరొకరి పరిస్థితి విషమం

సురక్షితంగా బయటపడ్డ బాలుడు

చింతూరు, నవంబరు 22: అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం బొడ్డుగూడెం వద్ద మంగళవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భద్రాచలం నుంచి చింతూరు వైపు వస్తున్న బొలేరో వాహనం, చింతూరు నుంచి భద్రాచలం వైపు వెళ్తున్న ఐరన్‌లోడ్‌ లారీ ఎదురెదురుగా ఢీ కొని ఎనిమిది మంది మృత్యువాతపడ్డారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఐదుగురు పురుషులు ఉన్నారు. పోలీసుల కథనం మేరకు.. ఛత్తీ్‌సగఢ్‌లోని కొండగా జిల్లా, బాంహాని గ్రామంలోని ఒకే కుటుంబానికి చెందిన పది మంది బొలేరో వాహనంలో భద్రాచలం రాములవారి దర్శనానికి వెళ్లి.. తిరిగి స్వస్థలానికి వెళ్తూ ప్రమాదానికి గురయ్యారు. నైన్‌సింగ్‌ ఠాకూర్‌(68), రాజే్‌షసింగ్‌ ఠాకూర్‌ (52), దైలేంద్ర ఠాకూర్‌(35), మునిరాం ఠాకూర్‌ (61), సాత్‌ ఠాకూర్‌(46), కిరం ఠాకూర్‌(50) సంఘటన స్థలంలోనే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన డ్రైవర్‌ పడాసింగ్‌(54)తోపాటు, మనీష్‌ ఠాకూర్‌(28)లను భద్రాచలం ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. కార్తీక్‌ ఠాకూర్‌(17)కు చికిత్స అందిస్తున్నప్పటికీ ఇంకా పరిస్థితి విషమంగానే ఉంది. కాగా, ఈ ప్రమాదంలో దయాన్షి ఠాకూర్‌ అనే పదకొండేళ్ల బాలుడు ఒక్కడే స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం భద్రాచలం ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. మృతదేహాలను చింతూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలంలో దొరికిన ఆధార్‌ కార్డు ఆధారంగా వివరాలు సేకరించి బంధువులకు సమాచారమిచ్చారు. లారీ డ్రైవర్‌ పరారైనట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2022-11-23T02:09:47+05:30 IST