‘స్మార్ట్‌ సిటీ’ చైర్మన్‌ జీవీపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలి

ABN , First Publish Date - 2022-01-03T05:35:04+05:30 IST

ఎండాడలో హయగ్రీవ డెవలపర్స్‌కు గత ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని దుర్వినియోగం చేయడంలో విశాఖ స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌ చైర్మన్‌ గన్నమని వెంకటేశ్వరరావు(జీవీ) కీలకపాత్ర పోషించారని టీడీపీ విశాఖ దక్షిణ నియోజకవర్గ ఇన్‌చార్జి గండి బాబ్జీ ఆరోపించారు.

‘స్మార్ట్‌ సిటీ’ చైర్మన్‌ జీవీపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలి
మాట్లాడుతున్న టీడీపీ విశాఖ దక్షిణ ఇన్‌చార్జి గండి బాబ్జీ

హయగ్రీవ ప్రాజెక్టు వ్యవహారంలో ఆయన పాత్ర కీలకం

మంత్రి బొత్స రహస్య సమావేశం వివరాలు వెల్లడించాలి

టీడీపీ విశాఖ దక్షిణ ఇన్‌చార్జి గండి బాబ్జీ డిమాండ్‌

విశాఖపట్నం, జనవరి 2(ఆంధ్రజ్యోతి): ఎండాడలో హయగ్రీవ డెవలపర్స్‌కు గత ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని దుర్వినియోగం చేయడంలో విశాఖ స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌ చైర్మన్‌ గన్నమని వెంకటేశ్వరరావు(జీవీ) కీలకపాత్ర పోషించారని టీడీపీ విశాఖ దక్షిణ నియోజకవర్గ ఇన్‌చార్జి గండి బాబ్జీ ఆరోపించారు. హయగ్రీవ సంస్థ ఆడిటర్‌గా ఉన్న జీవీ ఆ సంస్థ అధినేత జగదీశ్వర్‌ను మోసం చేశారని పేర్కొంటూ ప్రభుత్వం తక్షణమే జీవీపై క్రిమినల్‌ కేసు నమోదుచేయాలని డిమాండ్‌ చేశారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నగరంలో రూ.300 కోట్ల విలువైన భూమిని కాజేసే వ్యవహారంలో జీవీకి సహకరించిన విశాఖ ఎంపీ సత్యనారాయణపై కూడా కేసు నమోదుచేయాలన్నారు. కంపెనీలు, సంస్థలు నిర్వహించే వ్యక్తులు తమ వ్యాపార కార్యకలాపాలకు సంబంధించి ఖాళీ పేపర్లపై సంతకాలు చేసి ఆడిటర్లు, లాయర్లకు ఇస్తుంటారన్నారు. హయగ్రీవ సంస్థ అధినేత జగదీశ్వర్‌ కూడా తన ఆడిటర్‌ జీవీకి పలు ఖాళీ పేపర్లపై సంతకాలు చేసి ఇచ్చారన్నారు. అయితే సంస్థ అవసరాలకు రూ.15 కోట్లు అప్పులు ఇప్పించిన కారణంతో హయగ్రీవ సంస్థకు ఎండాడలో ఉన్న 12.71 ఎకరాల భూమిని జీవీ కొట్టేశారని ఆరోపించారు. తనకు అనుకూలంగా ఉండే బ్రహ్మాజీ అనే వ్యక్తిని హయగ్రీవకు ఎండీగా చేశారన్నారు. ఇలా కొట్టేసిన భూమిలో 53 ప్లాట్లు అనధికారికంగా విక్రయాలు చేసిన జీవీ, వాటిలో 15 వరకు రిజిస్టర్‌ చేశారని ఆరోపించారు. కొండను అభివృద్ధి చేయకుండా లేవుట్‌ వేసి ఎలా విక్రయిస్తారని ప్రశ్నించారు. నిబంధనల మేరకు అయితే 12.71 ఎకరాలకు వీఎంఆర్‌డీఏ  నుంచి అనుమతి తీసుకోవడం, పదిశాతం ప్లాట్లు తనఖా పెట్టాలని గుర్తుచేశారు. వీఎంఆర్‌డీఏ నుంచి అనుమతి తీసుకున్న తరువాతే జీవీఎంసీ నుంచి ప్లాన్‌ పొందాల్సి ఉన్నప్పటికీ అటువంటి విధానం అమలుకాలేదన్నారు. కాగా ఈ వ్యవహారంపై జగదీశఽ్వర్‌ వారం క్రితం బహిర్గతం చేసిన నేపథ్యంలో కలెక్టర్‌ మొత్తం విచారించి కొన్ని అక్రమాలు జరిగాయని నాలుగు రోజుల క్రితం జరిగిన డీఆర్‌సీలో వెల్లడించారన్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం మునిసిపల్‌ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రభుత్వ అతిథిగృహంలో ఎంపీ సత్యనారాయణ, జీవీలతో కలిసి జీవీఎంసీ కమిషనర్‌తో నిర్వహించిన సమావేశంలో ఏమి మాట్లాడారో చెప్పాలని బాబ్జీ డిమాండ్‌ చేశారు. హయగ్రీవ ప్రాజెక్టును మంత్రి బొత్స టేకోవర్‌ చేస్తారా? అనేది వెల్లడించాలన్నారు. కాగా సుమారు రూ. 300 కోట్ల విలువైన భూమి వ్యవహారంలో ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి వెంటనే స్పందించాలని డిమాండ్‌ చేశారు. వీఎంఆర్‌డీఏ అనుమతి లేకుండా జీవీఎంసీ ప్లాన్‌ మంజూరుపై విచారణ చేయాలన్నారు. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఆరేటి మహేష్‌, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్‌గోపాల్‌ పాల్గొన్నారు.

Read more