నల్లగొండలో 84 టేకు దుంగలు స్వాధీనం
ABN , First Publish Date - 2022-06-26T06:18:51+05:30 IST
మండలంలోని నల్లగొండ అటవీ టేకు ప్లాంటేషన్‌లో చెట్లు నరికి అక్రమ రవాణాకు సిద్ధం చేసిన 84 టేకు దుంగలను శుక్రవారం సాయంత్రం అటవీ శాఖ ఉద్యోగులు స్వాధీనం చేసుకున్నారు.

ఇంటి దొంగల పనిగా అనుమానం
మిగిలిన కలప అన్వేషణలో అధికారులు
కొయ్యూరు, జూన్ 25: మండలంలోని నల్లగొండ అటవీ టేకు ప్లాంటేషన్‌లో చెట్లు నరికి అక్రమ రవాణాకు సిద్ధం చేసిన 84 టేకు దుంగలను శుక్రవారం సాయంత్రం అటవీ శాఖ ఉద్యోగులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దుంగల నిల్వల వ్యవహారంలో ఇద్దరు అటవీ శాఖ ఉద్యోగుల హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నల్లగొండలో టేకు ప్లాంటేషన్‌లో చెట్లు మాయమయ్యాయన్న సమాచారం మేరకు నర్సీపట్నం డీఎఫ్‌వో సూర్యనారాయణ పడాల్ ప్లాంటేషన్‌ను తనిఖీ చేసి 22 టేకు చెట్లు, మరో మూడు మారుజాతి చెట్లు మాయమైనట్టు గుర్తించారు. ఈ వ్యవహారంపై పలు దఫాలు విచారణ చేపట్టారు. ఇందుకు బాధ్యులుగా కృష్ణాదేవిపేట డీఆర్వో కె.వెంకటరమణ, నల్లగొండ బీట్ ఆఫీసర్ జి.నూకరాజును సస్పెండ్ చేశారు. అలాగే కొప్పుకొండలో నిర్వహిస్తున్న బేస్ క్యాంప్‌కు సంబందించిన ఐదుగురు సిబ్బందిని విధుల నుంచి తొలగించారు. అయితే ప్లాంటేషన్ నుంచి మాయమైన చెట్లు ఎక్కడిక వెళ్లాయనే విషయమై దృష్టిసారించిన డీఎఫ్‌వో, వారం రోజులుగా కృష్ణాదేవిపేట రేంజర్ వెంకటరావు, సిబ్బంది కలసి గాలింపులు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో నల్లగొండ గ్రామ శివార్లలోని దట్టమైన పొదలమాటున అక్రమ రవాణాకు సిద్ధంగా 84 దుంగలు ఉంచినట్టు గుర్తించారు. ఈ వ్యవహారంలో అటవీ శాఖకు చెందిన ఇద్దరు ఉద్యోగుల ప్రమేయం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పట్టుబడిన టేకు దుంగలను శనివారం గొలుగొండ అటవీ డిపోకు తరలించారు. మిగిలిన కలప కోసం అధికారులు అన్వేషిస్తున్నారు. ఈ విషయమై వివరణ కోసం డీఎఫ్‌వోను, స్థానిక రేంజర్‌ను సంప్రదించే ప్రయత్నం చేయగా, వారు ఫోన్‌కు సైతం అందుబాటులో లేరు.