విశాఖలో ఏపీఎస్‌డీసీకి 106.82 ఎకరాలు

ABN , First Publish Date - 2022-11-23T02:28:15+05:30 IST

విశాఖలో విలువైన భూములను బదలాయించిన సర్కారు ప్రయత్నం ఎట్టకేలకు బయటపడింది.

విశాఖలో ఏపీఎస్‌డీసీకి 106.82 ఎకరాలు

గతేడాది ఆగస్టు 18నే జీవో జారీ.. తాజాగా వెలుగులోకి

అమరావతి, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): విశాఖలో విలువైన భూములను బదలాయించిన సర్కారు ప్రయత్నం ఎట్టకేలకు బయటపడింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌డీసీ)కి భూములు కట్టబెట్టిన అధికారిక ఉత్తర్వు ఏడాది ఆలస్యంగా వెలుగుచూసింది. హైకోర్టులో జీవోల కేసు విచారణ సందర్భంగా సర్కారు తప్పనిసరి పరిస్థితుల్లో ఎస్‌డీసీకి విశాఖ భూములు 106.82 ఎకరాలు కట్టబెడుతూ జారీ చేసిన జీవో 221ను గజిట్‌ సర్వర్‌లో మంగళవారం అప్‌లోడ్‌ చేసింది. ఈ జీవోను గతేడాది ఆగస్టు 18న నాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ జారీచేశారు. 15 నెలల తర్వాత సర్కారు ఈ జీవోను గజిట్‌లో అందుబాటులో ఉంచింది. అయితే, అది కూడా ఎవ్వరికీ ఏమీ అర్థం కాకుండా, అక్షరాలు ఏమీ తెలియకుండా చాలా వ్యూహాత్మకంగా జీవోను అప్‌లోడ్‌ చేసింది. అందులో ఏముందో ఎవ్వరికీ అర్థం కాకుండా అక్షరాలు సాగినట్లు కనిపించేలా ఫోటోతీసి అప్‌లోడ్‌ చేశారు.

పైగా ఆ జీవో ద్వారా ఏ ఏ భూములను ఎస్‌డీసీకి కట్టబెడుతున్నామో ఆ జాబితా అందిస్తున్నామన్నారు. కానీ ఆ జాబితాను గజిట్‌లో అప్‌లోడ్‌ చేయలేదు. విశాఖలో అత్యంత విలువైన 106.82 ఎకరాల భూమిని ఎస్‌డీసీకి ఇవ్వబోతున్నారని గతేడాది మే నెలలోనే ‘ఆంధ్రజ్యోతి’ బయటపెట్టింది. ఎస్‌డీసీ ఆ భూములను తాకట్టుపెట్టి రుణాలు తీసుకోబోతుందని వెలుగులోకి తీసుకొచ్చింది. అప్పుడు రెవెన్యూశాఖతో సహా ప్రభుత్వ పెద్దలు అవాస్తవం అంటూ హడావుడి చేశారు. చివరకు జీవో 221 వెలుగు చూడటంతో భూముల వ్యవహారం బట్టబయలైంది. ప్రభుత్వం చేసే పని ఎవరికీ అర్థం కాకూడదన్నట్లుగా, చదవడానికి కూడా వీలుకాని ఉత్తర్వును గజిట్‌లో అప్‌లోడ్‌ చేయడం తీవ్రమైన అనైతిక చర్య అని రెవెన్యూ నిపుణులు రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఈ చర్యను ఎలా సమర్థించుకుంటుందని ఆయన ప్రశ్నించారు.

Updated Date - 2022-11-23T02:28:15+05:30 IST

Read more