చెత్త సరే.. సంపద ఏదీ?
ABN , First Publish Date - 2022-12-16T23:36:43+05:30 IST
జిల్లాలో చెత్తసంపద కేంద్రాల లక్ష్యం నీరుగారుతోంది. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణతో పాటు పంచాయతీలకు ఆదాయం సమకూర్చాలనే ఉద్దేశంతో గత టీడీపీ ప్రభుత్వం చెత్తసంపద తయారీ కేంద్రాలకు శ్రీకారం చుట్టింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చెత్తసంపద కేంద్రాలను పట్టించుకోవడం లేదు. దీంతో రూ.లక్షల వ్యయంతో నెలకొల్పిన కేంద్రాలు నిరుపయోగంగా మారాయి.
నిరుపయోగంగా చెత్తసంపద కేంద్రాలు
కొన్నిచోట్ల పూర్తికాని నిర్మాణాలు
మూలకు చేరిన రిక్షాలు
కాలుష్య కోరల్లో గ్రామాలు
పట్టించుకోని అధికారులు
(నరసన్నపేట/మెళియాపుట్టి)
మెళియాపుట్టి మండల కేంద్రంలో సుమారు 5వేల మంది జనాభా ఉన్నారు. చెత్తసేకరణ కేంద్రం మాత్రం లేదు. దీంతో సేకరిస్తున్న చెత్తను ‘పలాస-పర్లాఖిమిడి’ రహదారి పక్కన మహేంద్రతనయ నది సమీపంలో వేస్తున్నారు. ఆ చెత్తంతా కుళ్లిపోయి వ్యర్థాలు నదిలో కలుస్తున్నాయి. అదేనీరు బోర్లులోకి చేరి మురికినీరు తాగాల్సిన దుస్థితి నెలకొంది. ఫలితంగా చాలామంది అనారోగ్యం బారిన పడుతున్నారు. నది సమీపంలో చెత్త నుంచి వెలువడుతున్న దుర్వాసన కారణంగా అటువైపు రాకపోకలు సాగించే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
....................
నరసన్నపేట మండలం కరగాం పంచాయతీలో నారాయణవలస, కరగాం, పెద్దకరగాం, నర్సింగబిల్లి, యాతపేట గ్రామాలు ఉన్నాయి. వీటిలో చిన్నకరగాం పంచాయతీకు మాత్రమే చెత్తసంపద కేంద్రం ఉంది. మిగతా గ్రామాల్లో చెత్త ఆరుబయట పడేస్తున్నారు. దీంతో గ్రామాల్లో దుర్వాసన వెదజల్లి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కరగాంలోని చెత్తసంపద కేంద్రం చెరువు గర్భంలో ఉండటంతో వ్యర్థాలు చెరువులో కలిసి.. నీరు కలుషితమవుతోంది.
.........................
నరసన్నపేట మేజర్ పంచాయతీలో రూ.30లక్షల వ్యయంతో చెత్తసంపద తయారీ కేంద్రాన్ని నిర్మించారు. ఈ పంచాయతీలో వ్యర్థాలను డంపింగ్ యార్డులో మంట పెడుతున్నారు. దీంతో పొగ వ్యాపించి జగన్నాథపురం, పెద్దపేట వాసులు ఇబ్బందులు పడుతున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాల పొగ పీల్చడంతో తమ ఊపిరితిత్తులు పాడైపోతున్నాయని జగన్నాథపురం వాసులు ఇటీవల ఆందోళన వ్యక్తం చేశారు.
..................................
...ఇలా గ్రామాల్లో చెత్తసేకరణ కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్నా ప్రయోజనం కనిపించడం లేదు. స్వచ్ఛత గ్రామాల పేరుతో కార్యక్రమాలు మూన్నాళ్ల ముచ్చటగా మారాయి. పట్టించుకునే నాథుడు లేక ఎక్కడికక్కడ చెత్త అక్కడే పేరుకుపోతోంది. ఫలితంగా గ్రామాలు కాలుష్యకోరల్లో చిక్కుకుని ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణతో పాటు పంచాయతీలకు ఆదాయం సమకూర్చాలనే ఉద్దేశంతో గత టీడీపీ ప్రభుత్వం చెత్తసంపద తయారీ కేంద్రాలకు శ్రీకారం చుట్టింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో వీటి నిర్మాణం చేపట్టి.. సేకరించిన చెత్తతో సేంద్రియ ఎరువులు తయారు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు పంచాయతీకి ఒకటి చొప్పున జిల్లాకు 912 పంచాయతీల్లో చెత్త సంపద కేంద్రాలు మంజూరు చేసింది. ఒక్కో కేంద్రానికి సుమారు రూ.20లక్షల నుంచి రూ.30లక్షలు చొప్పున వెచ్చింది. చెత్త సేకరణ కోసం ఒక్కో పంచాయతీకి రెండేసి రిక్షాలు చొప్పున అందజేసింది. తడి, పొడి చెత్తను వేరు చేసి.. ఎరువుగా మార్చేందుకు గ్రీన్‌అంబాసిడర్లను, సిబ్బందిని నియమించింది. కాగా, జిల్లాలో 569 చెత్తసంపద కేంద్రాల నిర్మాణాలు మాత్రమే పూర్తయ్యాయి. మిగిలిన చోట్ల నిర్మాణాలు అసంపూర్తిగా నిలిచిపోయాయి. ప్రస్తుతం జిల్లాలో 197 కేంద్రాలు మాత్రమే పని చేస్తున్నాయి. సుమారు రూ.40కోట్లు ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులు వెచ్చిస్తున్నా.. చెత్త సేకరణ మొక్కుబడిగా సాగుతోంది.
పట్టించుకోని ప్రభుత్వం
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చెత్తసంపద కేంద్రాలను పట్టించుకోవడం లేదు. దీంతో రూ.లక్షల వ్యయంతో నెలకొల్పిన కేంద్రాలు నిరుపయోగంగా మారాయి. చెత్తసేకరణకు కొత్తరిక్షాలు పంపిణీ చేసింది. కానీ, కొన్ని పంచాయతీల్లో వాటిని వినియోగించకుండానే మూలన చేరాయి. జిల్లాలో సుమారు 20 టన్నుల తడిచెత్త, 15 టన్నుల పొడిచెత్తను సేకరిస్తున్నట్టు లెక్కలు చూపిసున్నా.. వీటిని చెత్తసంపద కేంద్రాలకు తరలించడం లేదు. ఊరి బయట పడేస్తున్నారు. సేకరించిన చెత్తతో ఎరువులు తయారు చేయాల్సి ఉండగా.. ఎక్కడా అటువంటి కార్యక్రమాలు కనిపించడం లేదు. నెల, రెండు నెలలకోసారి కాలువలను శుభ్రం చేసి.. ఆ చెత్తను రోడ్డుమీదే వదిలేస్తున్నారు. దీంతో దోమలు వ్యాప్తి చెంది.. ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. కొంతమంది సర్పంచ్‌లు నిధులు లేక చెత్తసేకరణకు చర్యలు చేపట్టడం లేదు. గ్రీన్‌అంబాసిడర్లకు, సిబ్బందికి సక్రమంగా జీతాలు కూడా చెల్లించకపోవడంతో వీటి నిర్వహణ ప్రశ్నార్థకమవుతోంది. దీంతో చెత్తసంపద కేంద్రాలు నిరుపయోగంగా కనిపిస్తున్నాయి. కొన్ని గ్రామాల్లో ఈ కేంద్రాలు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారాయి. ఈ కేంద్రాల పనితీరుపై ప్రాంతీయ పర్యవేక్షకులు ఎం.శాంతి వద్ద ప్రస్తావించగా.. ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. నిర్మాణాల వేగవంతానికి చర్యలు చేపడుతున్నామన్నారు.
అవగాహన కల్పిస్తున్నాం
చెత్తసేకరణ కేంద్రాలు వినిగించుకోవాలని గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. స్వచ్ఛత గ్రామాలుగా గుర్తించాలని పంచాయతీ స్థాయి అధికారులకు ఆదేశిస్తున్నాం. చెత్త నుంచి సంపద తయారీకి కృషి చేస్తున్నాం.
- చంద్రకుమారి, ఎంపీడీవో, మెళియాపుట్టి