గాడిన పడని ఇంటర్‌ విద్య

ABN , First Publish Date - 2022-12-15T00:02:33+05:30 IST

విద్యా సంవత్సరం ఆరంభమై ఆరు నెలలైనా.. ఇప్పటివరకు ఇంటర్మీడియట్‌ విద్య గాడిన పడలేదు. ఆన్‌లైన్‌ ప్రవేశాల్లో గందరగోళం.. దరిచేరని పాఠ్యపుస్తకాలు.. సక్రమంగా సాగని విద్యా బోధన.. కళాశాలల్లో మౌలిక వసతుల లేమి.. ప్రైవేటు కళాశాలల్లో కానరాని ప్రయోగ విద్య.. ఇలా ఇంటర్‌ విద్యార్థులను ఎన్నో సమస్యలు వెంటాడుతున్నాయి. మరోవైపు పరీక్షల గడువు కూడా సమీపిస్తుండడంతో విద్యార్థులతో పాటు తల్లిదండ్రుల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది.

గాడిన పడని ఇంటర్‌ విద్య
ఇచ్ఛాపురంలో జూనియర్‌ కళాశాలలో చదువుతున్న విద్యార్థినులు

- ఇప్పటివరకూ అందని పాఠ్య పుస్తకాలు

- విద్యార్థుల్లో అయోమయం

(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి/ ఇచ్ఛాపురం రూరల్‌)

- ఇచ్ఛాపురంలోని బాలికల జూనియర్‌ కళాశాలలో 283 మంది విద్యార్థినులు ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్నారు. వీరిలో కేవలం 53 మందికి మాత్రమే కొన్ని సబ్జెక్టులకు సంబంధించి పాత పుస్తకాలను అందించారు. రెండో సంవత్సరంలో 350 మంది విద్యార్థినులు చదువుతుండగా.. 70 మందికి మాత్రమే పాత పుస్తకాలు అందజేశారు. ప్రభుత్వం పుస్తకాలు సరఫరా చేయకపోవడంతో విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారు.

- ఇచ్ఛాపురం బాలుర జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం 170 మంది, ద్వితీయ సంవత్సరం 188 మంది చదువుతున్నారు. ప్రభుత్వం ఇప్పటివరకు పుస్తకాలు సరఫరా చేయకపోవడంతో కళాశాలలో ఉన్న పాతపుస్తకాలను మొదటి సంవత్సరంలో 60మందికి, రెండో సంవత్సరంలో 65 మందికి మాత్రమే సర్దుబాటు చేశారు. పుస్తకాలు లేకుండా పరీక్షలకు ఎలా సన్నద్ధమవ్వాలో తెలియక విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.

...............

విద్యా సంవత్సరం ఆరంభమై ఆరు నెలలైనా.. ఇప్పటివరకు ఇంటర్మీడియట్‌ విద్య గాడిన పడలేదు. ఆన్‌లైన్‌ ప్రవేశాల్లో గందరగోళం.. దరిచేరని పాఠ్యపుస్తకాలు.. సక్రమంగా సాగని విద్యా బోధన.. కళాశాలల్లో మౌలిక వసతుల లేమి.. ప్రైవేటు కళాశాలల్లో కానరాని ప్రయోగ విద్య.. ఇలా ఇంటర్‌ విద్యార్థులను ఎన్నో సమస్యలు వెంటాడుతున్నాయి. మరోవైపు పరీక్షల గడువు కూడా సమీపిస్తుండడంతో విద్యార్థులతో పాటు తల్లిదండ్రుల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు ఇంటర్మీడియట్‌ కళాశాలలు 210 ఉన్నాయి. వీటిలో ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 53 వేల మంది చదువుతున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే పాఠ్యపుస్తకాలను పంపిణీ చేయాలి. ఈ ఏడాది పుస్తకాల ముద్రణపై స్పష్టత కొరవడింది. తరగతులు ప్రారంభమై ఆరు నెలలు కాగా.. ఇంతవరకు పాఠ్యపుస్తకాలు అందించలేదు. గత రెండేళ్లుగా వీటిని ఇవ్వడం లేదు. బయట మార్కెట్‌లోనూ లభ్యం కావడం లేదు. దీంతో విద్యార్థులు అయోమయం చెందుతున్నారు. పుస్తకాలు లేకుండా పరీక్షలకు ఎలా సిద్ధమవ్వాలో తెలియక సతమతమవుతున్నారు. కొన్నేళ్లుగా ముద్రణే జరగలేదని.. రెండేళ్ల కిందట మిగిలిన పుస్తకాలను విద్యార్థులకు అందించామని అధికారులు చెబుతున్నారు. జిల్లా అవసరాల మేరకు ప్రతిపాదనలు పంపుతున్నా పుస్తకాలు ఇవ్వడం లేదని నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. లెక్టరర్లు చొరవ తీసుకొని సీనియర్ల వద్ద సేకరించిన పుస్తకాలను జూనియర్లకు అందజేశారు. ప్రస్తుతం ఆ పాత పుస్తకాల ద్వారానే విద్యార్థులు పాఠ్యాంశాలను అభ్యసిస్తున్నారు. తాము బోధించిన పాఠ్యాంశాల్లో విద్యార్థులకు తలెత్తే సందేహాలను ఏ మేరకు నివృత్తి చేసుకోగలరన్న ఆందోళన లెక్చరర్లను వెంటాడుతోంది. మరో పక్క పుస్తకాలు లేకుండా తమ పిల్లలు ఎలా చదువుకుంటారని తల్లిదండ్రుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది ఇంటర్మీడియట్‌ పరీక్షల ఫలితాల్లో జిల్లా కొంత వెనుకడింది. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా ప్రభుత్వం, ఇంటర్‌ బోర్డు ఉన్నతాధికారులు స్పందించి పరిస్థితి చక్కదిద్దాల్సిన అవసరం ఉంది.

ఆన్‌లైన్‌ ప్రవేశాల్లో గందరగోళం...

ఆన్‌లైన్‌లో ప్రవేశాల ప్రక్రియ ఇప్పటివరకు పూర్తికాలేదు. ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశాలు అయ్యాయి. ప్రైవేటు కళాశాలల్లో మాత్రం గందరగోళం నెలకొంది. దాదాపు పది కళాశాలలకు ఆన్‌లైన్‌ లాగిన్‌ ఇవ్వకపోవడంతో ప్రవేశాలు నిలిచిపోయాయి.

ప్రయోగ పరీక్షలపై ప్రభావం...

జిల్లాలో ఇబ్బడిముబ్డడిగా ఉన్న ప్రైవేటు కళాశాలల్లో చాలా వరకు ప్రయోగశాలలు లేవు. కేవలం చదువులు, మార్కులకే ప్రాధాన్యం ఇస్తున్న ఆ యాజమాన్యాలు విద్యార్థులను ప్రయోగశాలలకు పంపుతున్న దాఖలాలు లేవు. మరో నెలలో పబ్లిక్‌ ప్రయోగ పరీక్షలు జరగాల్సి ఉన్నా.. వారితో సాధన చేయించడం లేదు. చివరిదశలో భారీగా డబ్బులు వసూలుచేసి.. గట్టెక్కించే సన్నాహాల్లో యాజమాన్యాలు ఉన్నాయి.

అర్థం కావడం లేదు

పుస్తకాలు లేకపోవడంతో అధ్యాపకులు చెబుతున్న పాఠాలు అర్థం చేసుకోలేకపోతున్నాం. ఇంటి వద్ద కూడా చదువుకోలేని పరిస్థితి ఎదురవుతోంది. మరో మూడు నెలల్లో పరీక్షలు ఉన్నందున ఏమి చేయాలో తోచడంలేదు.

- వలపల మధు, ఇంటర్‌, మొదటి సంవత్సరం విద్యార్థి, ఇచ్ఛాపురం.

....................

నోట్సు రాసుకుంటున్నాం

కళాశాలలు ప్రారంభమై 6 నెలలు అవుతున్నా పుస్తకాలు అందించలేదు. మరో మూడునెలల్లో పరీక్షలు వస్తున్నాయి. అధ్యాపకులు చెప్పిన పాఠాలు నోట్సు రాసుకునే ఇప్పటి వరకు చదువుతున్నాం. పుస్తకాలు లేకుండా పరీక్షలు ఎలా రాయాలో అర్థం కావడంలేదు.

- పి.పూజిత, ఇంటర్‌ మొదటి సంవత్సరం విద్యార్థిని, ఇచ్ఛాపురం.

.....................

చర్యలు చేపట్టాం

జిల్లాలో ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేయకపోవడం వాస్తవమే. పుస్తకాలకు సంబంధించి ప్రతిపాదనలను ఇంటర్‌ బోర్డు అధికారులకు పంపించాం. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల ప్రిన్స్‌పాళ్లతో తరచూ జూమ్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్నాం. బోధనకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాం.

- తవిటినాయుడు, ఆర్‌ఐఓ, శ్రీకాకుళం

Updated Date - 2022-12-15T00:02:36+05:30 IST