కాగితాల్లోనే వీక్లీఆఫ్‌

ABN , First Publish Date - 2022-11-25T00:11:46+05:30 IST

నరసన్నపేటలో సీఎం జగన్‌ పర్యటన సందర్భంగా ఇద్దరు పోలీసులు అస్వస్థతకు గురయ్యారు. గుండెపోటుతో ఒకరు మృతి చెందగా.. తలలో రక్తనాళాలు పగిలి మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జిల్లాలో ఇటీవల గుండెపోటుతో మృతి చెందుతున్న పోలీసుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. విశ్రాంతి లేకుండా పనిచేయడం, వీక్లీఆఫ్‌లు ఇవ్వకపోవడం, విధి నిర్వహణలో తీవ్రమైన ఒత్తిడి కారణాలుగా వైద్యనిపుణులు చెబుతున్నారు.

కాగితాల్లోనే వీక్లీఆఫ్‌

పోలీసులకు అమలుకాని వారాంతపు సెలవు

జీవో ఇచ్చి పక్కన పెట్టేసిన ప్రభుత్వం

అరకొర సిబ్బందితో అధికమైన పనిభారం

తరచూ గుండెపోటు.. కొందరు మృత్యువాత

పని ఒత్తిడే కారణమంటున్న వైద్యనిపుణులు

సీఎం నరసన్నపేట పర్యటనలో ఇద్దరికి అస్వస్థత

ఒకరు మృతి.. మరొకరు ఆసుపత్రిలో చేరిక

(రణస్థలం)

- కేవీఆర్‌ కృష్ణారావు జేఆర్‌పురం పోలీస్‌స్టేషన్‌లో హెచ్‌సీగా పని చేస్తున్నారు. ఈనెల 23న నరసన్నపేటలో సీఎం జగన్‌ పర్యటన బందోబస్తు కోసం రెండు రోజుల ముందే వెళ్లారు. పనిభారం, నిద్రలేమి, రాత్రంతా మంచులో ఉండడంతో తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. దీంతో కృష్ణారావు తలలో రక్తనాళాలు దెబ్బతిన్నాయి. రెండు రోజులుగా విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈయన పరిస్థితి విషమంగా ఉంది.

- అనకాపల్లి పట్టణంలో ట్రాపిక్‌ హెచ్‌సీగా పనిచేస్తున్న వై.అప్పారావు బుధవారం నరసన్నపేటలో జరిగిన సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన బందోబస్తుకు వచ్చారు. తీవ్ర ఒత్తిడికి గురైన ఆయన గుండెపోటుతో మృతి చెందారు.

- కవిటి పోలీస్‌స్టేషన్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న కర్రి కోదండరావు సెప్టెంబరులో గుండెపోటుతో మృతిచెందారు. ఆయన వయసు 50 సంవత్సరాలే. ఇంకా 12 సంవత్సరాల సర్వీసు ఉంది. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

- లావేరు పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రొక్కం దినేష్‌కుమార్‌ సెప్టంబరు 25న గుండెపోటుతో మృతిచెందారు. అప్పటివరకూ తోటి వారితో ఆనందంగా గడిపిన ఆయన.. మధ్యాహ్న భోజనానికి ఇంటికి వెళ్లి కుప్పకూలిపోయారు. ఆస్పత్రికి తరలించేలోపే మృత్యువాత పడ్డారు. ఆయన వయసు 38 సంవత్సరాలే. భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

- ఈ ఏడాది మే నెలలో రణస్థలంలో రమణ అనే హోంగార్డు గుండెపోటుతో మృతిచెందారు. విధి నిర్వహణలో ఉండగా అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ చనిపోయారు. ఆయన వయసు 42 సంవత్సరాలే. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

............................

నరసన్నపేటలో సీఎం జగన్‌ పర్యటన సందర్భంగా ఇద్దరు పోలీసులు అస్వస్థతకు గురయ్యారు. గుండెపోటుతో ఒకరు మృతి చెందగా.. తలలో రక్తనాళాలు పగిలి మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జిల్లాలో ఇటీవల గుండెపోటుతో మృతి చెందుతున్న పోలీసుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. విశ్రాంతి లేకుండా పనిచేయడం, వీక్లీఆఫ్‌లు ఇవ్వకపోవడం, విధి నిర్వహణలో తీవ్రమైన ఒత్తిడి కారణాలుగా వైద్యనిపుణులు చెబుతున్నారు. జిల్లాలో ఇటీవల దొంగతనాలు పెరిగాయి. మరోవైపు అక్రమాలు, ప్రమాదాల సంఖ్య ఎక్కువగానే ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు, సిబ్బంది క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. జిల్లాలో ఇసుక, నిషేధిత వస్తువుల అక్రమ రవాణా నియంత్రణ, వాహన తనిఖీలు ఇలా అన్నింటినీ ఒకేసారి చేపట్టాల్సి వస్తోంది. దీంతో స్టేషన్‌లో ఉన్న కొద్దిపాటి సిబ్బందిపై పనిభారం పడుతోంది. ఉమ్మడి జిల్లాలోని మూడు సబ్‌ డివిజన్ల పరిధిలో 12 పోలీసుల సర్కిళ్లు ఉన్నాయి. 42 పోలీస్‌స్టేషన్లు ఉన్నాయి. వీటితో పాటు సీసీఎస్‌, మహిళా, ట్రాఫిక్‌, మెరైన్‌పోలీస్‌స్టేషన్లు ఉన్నాయి. అయితే ఏస్టేషన్‌లోనూ పూర్తిస్థాయి సిబ్బంది లేరు. జిల్లావ్యాప్తంగా 22 మంది సీఐలు, 120 మంది ఎస్‌ఐలు, 138 మంది ఏఎస్‌ఐలు, 365 మంది హెడ్‌ కానిస్టేబుళ్లు, 1,200 మంది కానిస్టేబుళ్లు విధులు నిర్వహిస్తున్నారు. వీరితో పాటు 850 మంది హోంగార్డులు సేవలందిస్తున్నారు. అయితే పెరుగుతున్న విధులకు ఈ సిబ్బంది ఏ మూలకూ చాలడం లేదు. దీంతో ఉన్న కొద్దిపాటి సిబ్బంది షిఫ్ట్‌లు వేసుకుని విధులు నిర్వహిస్తున్నారు. అత్యవసర, అనారోగ్య సమయాలు, ఇంటి అవసరాలకు గంటల లెక్కనే సెలవు మంజూరవుతోంది. మరీ అత్యవసం అయితే తోటి సిబ్బందితో సర్దుబాటు చేసుకోవాల్సిందే. అదికూడా స్టేషన్‌అధికారి అనుమతిస్తేనే. లేకుంటే ఇబ్బందులు తప్పవు. అలాగే పోలీసులకు శాఖపరమైన శిక్షణలు తగ్గిపోయాయి. మానసిక ఒత్తిడిని నియంత్రించేందుకు నిపుణులతో కౌన్సెలింగ్‌ ఇవ్వాల్సి ఉన్నా.. ఎక్కడా నిర్వహిస్తున్న దాఖలాలు లేవు. శారీరకంగా ఒత్తిడి తగ్గించేందుకు మాక్‌డ్రిల్‌ వంటివి కూడా లేవు. వేతనం కూడా మిగతా శాఖలతో పోల్చుకుంటే చాలా తక్కువ. ఇవన్నీ పోలీసులపై ఒత్తిడికి కారణమవుతున్నాయి.

వారాంతపు సెలవు ఎక్కడ?

పోలీసుకు పేరుకే వీక్లీ ఆఫ్‌. ఎక్కడా అమలు కావడం లేదు. దీంతో ఒత్తిడి అధికమై పోలీసులు చిన్న వయసులోనే గుండెపోటుకు గురవుతున్నారు. సాధారణంగా ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి ఆదివారం సెలవు ఉంటుంది. ఇతర పండుగల సమయంలో కూడా సెలవులు లభిస్తాయి. పోలీస్‌ శాఖలో మాత్రం అలాంటి పరిస్థితి లేదు. ప్రభుత్వం వీక్లీ ఆఫ్‌ ప్రకటించినా అమలవుతున్న దాఖలాలు లేవని పోలీస్‌ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సిబ్బంది కొరత వల్లే వారాంతపు సెలవులు ఇవ్వలేకపోతున్నామని ఉన్నతాధికారులు చెబుతున్నారు.

రెగ్యులర్‌ మెడికల్‌ చెకప్‌ అవసరం

పోలీసు ఉద్యోగులకు ఏడాదికి ఒక్కసారి టీఎంసీ పరీక్షలు నిర్వహించే బాధ్యత ప్రభుత్వం విధిగా తీసుకోవాలి. కొంత వయస్సు మీద పడినపుడు రెగ్యులర్‌ మెడికల్‌ చెకప్‌ అవసరం. రోజూ గంటపాటు వ్యాయామం ప్రతి ఒక్కరికీ అవసరం. పోలీస్‌ ఉద్యోగంలో చేరినప్పుడు ఉన్న ఫిట్‌నెస్‌ తరువాత ఉండదు. స్మోకింగ్‌, మద్యపానానికి దూరంగా ఉండాలి. ఒత్తిడికి గురైనప్పుడే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. పోలీసుల్లో నిద్రలేమి ఎక్కువగా ఉంటుంది. ఆహారపు అలవాట్లు కొంతవరకు మార్చుకోవాలి.

- డాక్టర్‌ శనపల నరసింహమూర్తి, ఎండీ, శ్రీకాకుళం

Updated Date - 2022-11-25T00:11:49+05:30 IST